ఎమ్మెల్సీగా విజయగౌరిని గెలిపించండి

Feb 2,2025 21:04

6న జరిగే నామినేషన్‌కు తరలి రావాలి

ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ పిలుపు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రానున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలో పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న కె.విజయగౌరికి ఉపాధ్యాయులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యుటిఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం విజయనగరంలో యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు వి. ప్రసన్నకుమార్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ ఉపాధ్యాయులతా విజయగౌరికి మద్దతు ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి, పాఠశాలలో క్లస్టరీకరణకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేసే పోరాటాలకు విజయ గౌరి అండగా ఉంటారని తెలిపారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించేందుకు శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా ఉంటారని భావించి పిడిఎఫ్‌ అభ్యర్థి విజయగౌరికి యుటిఎఫ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో అన్ని మండల శాఖలు నుండి ఫిబ్రవరి 6న జరిగే నామినేషన్‌ కార్యక్రమానికి ఎక్కువమంది ఉపాధ్యాయులు విశాఖపట్నం హాజరు కావాలని కోరారు. ఉద్యమాలతోనే ఉద్యోగ జీవితాన్ని గడిపిన విజరుగౌరి శాసనమండలిలో ప్రవేశించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని, ఉపాధ్యాయులందరూ ఆలోచించి విజయ గౌరిని గెలిపించాలని కోరారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు జెఆర్‌సి పట్నాయక్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, కోశాధికారి సిహెచ్‌ భాస్కరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర విద్యా సంబంధ అధ్యయనం కమిటీ సభ్యులు డి. రాము, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎ.సత్య శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శులు, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పి.రాంప్రసాద్‌, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️