హెల్మెట్‌ లేకుంటే ప్రాణాలకు ముప్పు

Jan 7,2025 23:50

వాహనదారులకు హెల్మెట్‌ అందజేస్తున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బబిత తదితరులు
ప్రజాశక్తి – తుళ్లూరు:
హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం శిక్షారమైన నేరమని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత అన్నారు.హెల్మెట్‌ ధరించటం ద్వారా సురక్షితంగా వాహనదారులు గమ్య స్థానాలు చేరవచ్చునని, ప్రాణాలు రక్షించు కోవచ్చని చెప్పారు. తుళ్లూరు డిఎస్‌పి మురళీకృష్ణ, సిబ్బందితో కలిసి స్థానిక హైకోర్టు వద్ద హెల్మెట్‌ వాడకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బబిత మాట్లాడుతూ చాలామంది ఏమీ కాదులే అనే నిర్లక్ష్యంతో ద్విచక్ర వాహనాలు నడిపేటపుడు హెల్మెట్‌ ధరించటంలేదని, ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న సంగతి మరువవద్దని హెచ్చరించారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపితే శిక్షలు కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. ద్విచక్రదారులు వాహనం నడిపేటప్పుడు వారి కుటుంబ సభ్యులు వారిపైన ఆధారపడి ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మారి మాట్లాడుతూ చాలామంది హెల్మెట్‌ ఉన్నప్పటికీ దానిని వాహనంపై ఉంచి ధరించకుండా వాహనం నడుపుతున్నారని, ఎవరైనా అధికారులు వాహనదారులను ప్రశ్నిస్తే కంగారులో హెల్మెట్‌లను సరిగ్గా ధరించక పోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని వివరించారు. డిఎస్‌పి మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.10 వేలతో సెల్‌ ఫోన్‌ కొంటేనే దానికి రక్షణ కోసం స్క్రీన్‌ గార్డ్‌ వేస్తున్నారని, అంతకంటే విలువైన ప్రాణాలు రక్షించుకోవటం కోసం హెల్మెట్‌ మాత్రం ధరించడంలేదని అన్నారు. ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అని, ఇక నుంచి శుభకార్యాలకు, పుట్టిన రోజు సందర్భంగా ఇతరులకు గిఫ్ట్‌గా హెల్మెట్‌ ఇస్తే అది అనేక మంది ప్రాణాలను రక్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొంత మంది హెల్మెట్‌ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్‌లు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్‌ హెచ్‌.అమరరంగేశ్వరరావు, తుళ్లూరు ట్రాఫిక్‌ సిఐ బి.కోటేశ్వరరావు, అసిస్టెంట్‌ సెక్రటరీ ఎన్‌.జేజేశ్వరరావు పాల్గొన్నారు.

➡️