మహిళలు యువత ఓట్లే కీలకం

May 15,2024 22:00

సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహిళలు, యువత పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. మహిళా ఓటర్లలో ఎక్కువ మంది తమకే సహకరంచారని వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా, యువత మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టిడిపి అనుకూలంగా ఓట్లు వేశారని టిడిపి అంచనాలు వేస్తోంది. దీనికితోడు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు టిడిపి అనుకూలంగాను, వైసిపికి వ్యతిరేకంగా ఉంటాయని ఇరు పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవైపు గ్రామాలు, వార్డుల వారీగా, బూత్‌ నెంబర్ల వారీగా టిడిపి, వైసిపి నాయకులు అంచనాల వేసుకోవడంలో బిజీబిజీగా మారారు. మంగళ, బుధవారాలో ఇటువంటి సమావేశాలు, సమీక్షలతో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు తలమునకలయ్యారు. టిడిపి అభ్యర్థులు తామే గెలుస్తామంటూ దీమా వ్యక్తం చేస్తుండగా, స్వల్ప మెజార్టీతోనైనా గట్టెక్కిపోతామని వైసిపి అభ్యర్థులు, వారి అనుయాయులు అంచనాలు వేస్తున్నారు.

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: పోలింగ్‌ సరళిని ఒక్కసారి పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో మొత్తం 15,62,921 ఓట్లు ఉండగా, 12,71,173 ఓట్లు పోలయ్యాయి. 2,91,748 మంది ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకోలేదు. 18ఏళ్ల నుంచి 19ఏళ్లలోపు వయసుగల ఓటర్లు 39,612 మంది ఉన్నారు. వీరంతా తొలిసారిగా ఓటు హక్కుపొందిన విద్యార్థులు. వీరిలో చాలా వరకు జనసేన అభిమానులు, మిగిలినవారిలో టిడిపి, వైసిపిలకు చెరుసగం ఉంటారని అంచనా. ఈ లెక్కన 19ఏళ్లలోపుగల ఓటర్లంతా కూటమికి ఓట్లువేసి ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 20 నుంచి 29ఏళ్లలోపు వయసుగల ఓటర్లు 2,45,813 మంది ఓటర్లు వరకు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. సాధారణంగా ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వైసిపి ప్రభుత్వంపై గడిచిన కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమైంది. జిల్లాలో 18,869 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాల నుంచి మరో 2,773 బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. వీరంతా ఉద్యోగులే. ఉద్యోగులంతా తమవైపే ఉన్నారని టిడిపి బలంగా చెబుతోంది. అటు వైసిపి నాయకులు కూడా వీరి ఓట్లను అంతగా లెక్కపెట్టడం లేదు. అత్యధికంగా విజయనగరం అసెంబ్లీ పరిధిలో 4,201 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాయ కుల్లో గుబులు, టిడిపి నాయకుల్లో జోష్‌ కనిపిస్తోంది. ఇక మహిళా ఓటర్ల సరళిని ఒక్కసారి పరిశీలిస్తే…. జిల్లాలో మొత్తంగా 7,92,038 మంది మహిళా ఓటర్లు ఉండగా, వారిలో 6,44,844 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు మొత్తం 7,70,805 మంది ఓటర్లు కాగా, 6,26,307 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు కన్నా మహిళా ఓటర్లు 21,233 మంది అధికంగా ఉండగా, పోలైన ఓట్లలో పురుషులకన్నా 18,537 మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి మహిళా ఓట్లు కొంతమేర ఎన్నికల్లో ప్రభావితం చూపుతాయి. ప్రధానంగా టిడిపికూటమి మేనిఫెస్టోలో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, బస్సు ప్రయాణం వంటి పథకాలు మహిళలను ఆకర్షించాయని చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం మహిళల పేరునే మంజూరు చేయడం, వాటిలోనూ చేయూత, ఆసరా వంటి పథకాలతో తమకే ఓట్లు పడతాయని వైసిపి నాయకులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు, డ్వాక్రా రుణాలు మాఫీ, చేయూత, అమ్మఒడి, విద్యాదీవెన తదితర పథకాలు మహిళలను ఆకర్షించాయ నడంలో సందేహం లేదు. కానీ, ఈ పథకాలేవీ స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తింపజేయలేదు. దీనికితోడు వీరు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం అరెస్టులు, నిర్భందాలు, భయోత్పాతాలకు పాల్పడడం వల్ల మహిళా ఓటర్లలోనూ చీలిక ఉంటుందని కూడా మరో విశ్లేషణ ఉంది. వలస ఓటర్లలో ఎక్కువ శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ నాయకులు అంచనాలు వేస్తున్నారు. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా వైసిపికి కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇటువంటి చోట గతంలో టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులపై సానుభూతి కూడా కనిపిస్తోంది. రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా వైసిపి ప్రభుత్వం రైతు కుటుంబాలకు చాలా వరకు దగ్గరైనప్పటికీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై టిడిపి చేసిన ప్రచారం ఆ తరగతిలోని వైసిపి ఓట్లను చాలా వరకు చీల్చే అవకాశం కూడా లేకపోలేదు. మద్యం ధరల పెంపుతోపాటు బ్రాండ్ల మార్పు, నాసిరకం లిక్కర్‌ అందుబాటులో ఉంచడం వంటివాటిపై మందుబాబులు ప్రతికూల తీర్పును ఇచ్చి ఉండవచ్చేమో అన్న చర్చనడుస్తోంది. ఈనేపథ్యంలో వైసిపి నాయకులు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల భయం కనిపిస్తోంది.

➡️