సిఐటియు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ప్రజాశక్తి-మద్దిపాడు : సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం భవాని అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఉబ్బా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. అనేక రంగాల్లో తక్కువ వేతనాలు ఇస్తున్నారని సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని అన్నారు. మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, కటకం వెంకటేశ్వర్లు, దండే ఏసమ్మ, డి వెంకటమ్మ, డి మరియమ్మ, డి నాగమ్మ, అరబోలు అనూష పాల్గొన్నారు. మద్దిపాడులోని కళామందిర్‌ దగ్గర రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎలమంద అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. స్థానిక పిహెచ్‌సి డాక్టర్‌ నీరజ మాట్లాడుతూ మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారని, విద్య వైద్య రంగాలలో ముందున్నారని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి నరసింహారావు, కాకుమాను సుబ్బారావు, సత్యనారాయణ, పీహెచ్‌సి సూపర్‌వైజర్‌ బాలకోటయ్య పాల్గొన్నారు.

➡️