ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఆరోగ్య రంగంలో ప్రాథమిక స్థాయిలో వైద్య సేవలు నిర్వహించే ఆశాలు తీవ్రమైన పని భారం, ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహన్ రావు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు మహాలక్ష్మి, వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం అర్బన్ & రూరల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పని భారం , ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని, వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన తమ బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదని, పైగా 23 రకాల రికార్డులతో పాటు యాప్ లో వర్కు పెరుగుతుందన్నారు. రికార్డులు కూడా ఆశాలే కొనుక్కోవాల్సి వస్తుందని, ఎన్ఎల్ఈపి, ఎన్సిడి సిడి, టీబి, ఏఎన్సీ వంటి సర్వేలు , ప్రజల కపాన్ని సేకరించి హాస్పిటల్ కు పరీక్షల నిమిత్తం తీసుకురావటం తో పాటు మెడికల్ కిట్ లు కూడా అశా కార్యకర్తలే తెస్తున్నారని, వీటికి అయ్యే ఖర్చులు కూడా భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాబ్ షాట్ లో లేని పనుల ఆశాలతో చేయించకుండా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్టమైన పనిగంటలు ఉండాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేయక తప్పదన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న సాయంత్రం 4గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మ, కనకమహాలక్ష్మి, నాగమ్మ, పైడ్రాజు, సునీత, తదితరులు పాల్గొన్నారు.
