గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ శాఖలకు చెందిన అధికారులు వారి వారి శాఖలకు చెందిన అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పల్లెలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం విడుదలైన నిధులను సైతం పక్కదారి పట్టించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. వారిద్దరూ రైలు, పట్టాలు లాంటి వారని, ఒకరికి ఒకరు సహకరించుకొని ఆయా పంచాయతీలను అభివద్ధి బాటలో నడిపించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేవికావని, కానీ ఇప్పుడు ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఇది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గమనించాల్సిన విషయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే పలు సభల్లో సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వాలని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సర్పంచులను పూచిక పుల్ల గా తీసివేసి ఒక్క రూపాయి కూడా నిధులు పంచాయతీలకు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. కానీ ఇప్పటి ప్రభుత్వం సర్పంచులకు తగిన నిధులు విడుదల చేసిందని అన్నారు. సర్పంచులు కూడా ఆ నిధులను మొదటగా తాగునీరు, పారిశుధ్యం, జంగల్‌ క్లియరెన్స్‌లకు వాడాలని, మిగిలిన నిధులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు కష్టపడి పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బి శ్రీనివాసులు, జడ్పిటిసి సభ్యులు నారు బాపన్‌రెడ్డి, వివిధ మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

➡️