గ్యాస్‌ సిలిండర్‌ పేలి కార్మికుడు మృతి

వివరాలు వెల్లడిస్తున్న సిఐ ధనుంజరురావు

– మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

– ఫూజన్‌ ఇటుకల ఫ్యాక్టరీ కార్మికుల నివాస షెడ్‌లో ప్రమాదం

ప్రజాశక్తి-యలమంచిలి

యలమంచిలి మండల మర్రిబంద గ్రామ సమీపంలోని ‘ఫ్యూజన్‌’ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద కార్మికుల నివాసముంటున్న షెడ్‌లో శనివారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి యలమంచిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనుంజరురావు ఆదివారం అందించిన వివరాలు ప్రకారం… ‘ఫ్యూజన్‌’ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద అందులో పని చేస్తున్న కార్మికుల నివాసం కోసం నిర్మించిన షెడ్‌లో శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ముగ్గురు కార్మికులు వంటకు ఉపక్రమించి గ్యాస్‌ స్టవ్‌ వెలిగించారు. అప్పటికే గ్యాస్‌ లీకు కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ఆ షెడ్‌లో వంట చేస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, పత్రిపుట్టుగ గ్రామానికి చెందిన బడకల కేశవరావు (52), ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సుహాని గ్రామానికి చెందిన ఎం.లోకనాథ్‌ (27), జి.కృష్టారెడ్డి (40) తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన ఫ్యాక్టరీ వారు ముగ్గురిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు క్షతగాత్రులు ముగ్గురిని విశాఖ కెజిహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి బడకల కేశవరావు (52) మృతి చెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న యలమంచిలి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. యలమంచిలి సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ ధనుంజరురావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుని కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : సిఐటియు’ఫ్యూజన్‌’ బ్రిక్స్‌ కంపెనీలో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ప్రమాదం వల్ల మరణించిన బడకల కేశవరావు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాయపడి కెజిహెచ్‌లో ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎం.లోకనాథ్‌, కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు ఎలమంచిలి మండల కార్యదర్శి చింతకాయల శివాజీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తరువాత తీవ్రమైన గాయాలైన ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించడంలో కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్‌ తీవ్రమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారని ఆరోపించారు. శనివారం రాత్రి కెజిహెచ్‌కి తరలించగా ఆదివారం కూడా వారు ఎలా ఉన్నారో చూడడానికి కూడా రాలేదని, బంధువులకు సమాచారం ఇవ్వడంలో కూడా లోపం ఉందని తెలిపారు. మృతుడు కేశవరావు కుమారుడు శశి శనివారం రాత్రి 8.20 గంటల సమయంలో కేశవరావుకు ఫోన్‌ చేస్తే మీ నాన్న బయటికి వెళ్లారని వచ్చిన తర్వాత మరల కాల్‌ చేస్తామని చెప్పారని, రాత్రి పది గంటలకు ప్రమాద సంఘటన గురించి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్‌.లోకనాథ్‌ 93 శాతం, జి.కృష్ణారెడ్డికి 73శాతం శరీరం కాలిపోయిందని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య ధోరణిని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని శివాజీ డిమాండ్‌ చేశారు.

➡️