కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Jul 19,2024 22:03
ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పురపాలక సంఘంలో పనిచేసే పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. కావలి పట్టణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సి.ఐ.టి.యు) జనరల్‌ బాడీ సమావేశం శుక్రవారం సిఐటియు కార్యాలయంలో తురక సీనయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు గౌరవాధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన జనవరి, ఫిబ్రవరి నెలల హెల్త్‌ అలవెన్స్‌ గత సంవత్సరం డిసెంబర్‌ సమ్మె కాలపు 16 రోజుల జీతంతో పాటు డైలీ కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉందన్నారు. డైలీ కార్మికులకు మూడు నెలల జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్సులు, సమ్మెకాలం జీతం సుమారు ఇప్పటికీ ఏడు నెలలు అయినప్పటికీ బకాయిలు చెల్లించలేదన్నారు. దానివల్ల కార్మిక కుటుంబాలు పలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మున్సిపల్‌ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అంతేకాకుండా కార్మికులకు గ్లౌజులు, మాస్కులు, పనిముట్లు, ఇవ్వటం లేదన్నారు. దాని వల్ల పనులలో కార్మికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులు, యూనిఫారం, ఇతర వస్తువులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సంవత్సరాలు గడచినా ఇవ్వడం లేదన్నారు. కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు తప్ప, మున్సిపల్‌ అధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించట్లేదన్నారు. ఇది చాలా అన్యాయమని, కార్మికులకు పని భారం పెరిగిందని, సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. దానికి తోడు కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించకపోవడంతో కార్మికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా కార్మికులకు ఇవ్వాల్సిన జీతబకాయిలతోపాటు, పనిముట్లు ఇతర వస్తువులను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆగస్టు 5, 6 తేదీలలో నెల్లూరులో జరగబోతున్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను కార్మికులంటరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బిరదల మహేష్‌, ఒంగోలు రమేష్‌, పరుసు జేమ్స్‌ జలదంకి బాబు, వై క్రాంతికుమార్‌, ఎస్‌.ఆనందరావు, మహిళా కార్మికులు లేటి రాజ్యలక్ష్మి, అప్పాడి జ్యోతి, పరుసు చిన్నమ్మతో పాటు కార్మికులు పాల్గొన్నారు.

➡️