ప్రజాశక్తి- అద్దంకి : సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను ఎపి వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు డి.గంగాధర్ ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10 వరకూ 17 రోజులు పాటు సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వం కార్మికులతోత చర్చలు జరిపి దశలవారీగా మున్సిపల్ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చినా హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు తెలిపారు. కార్మికుల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దీక్షల్లో శానిటేషన్ ఇంజినీర్ విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. ఆదాం, అద్దంకి మున్సిపల్ వర్కర్ యూనియన్ కార్యదర్శి జి. భీష్మ,డి.అలివేలమ్మ, ఇంజినీరింగ్ విభాగం నాయకులు ఉసురుపాటి సామ్యూలు. వి. జాను, కె.మారుతి, డి.జాషువా,మార్కు,లక్ష్మీనారాయణ,అంజమ్మ పాల్గొన్నారు. బాపట్ల : గతంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. మజుందర్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చర్యలు వెంటనే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలన్నారు. దహన సంస్కారాలకు ఇస్తున్న మొత్తాన్ని రూ.20, 000 పెంచాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకుడు కె. శరత్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రమాదకరమైన పనులలో విధులు నిర్వహిస్తున్నారని, అయినప్పటికీ వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించక పోతే రాబోవు కారల్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు రత్నం ,అశోక్ సుబ్బారావు, హరిబాబు, సామిరెడ్డి ,ప్రమీల, ఏసమ్మ, అనసూయ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.చీరాల: మున్సిపల్ కార్మికులకు గతంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్యం వ్యవహరిస్తుందన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.కార్మికుల సర్వీసును బట్టి పర్మినెంట్ చేయాలన్నారు.జీవో నంబరు 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినట్లు తెలిపారు. సమ్మెకాలపు ఒప్పందాల జీవోను జారీ చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖామంత్రి డాక్టర్ పి. నారాయణ, ఉన్నతాధికారులను అనేక సార్లు కలిసినా స్పందన లేదన్నారు. ఇంజినీరింగ్ కార్మికులు సుమారు 13 వేల మంది అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా కన్వీనర్ చిమటా వీరాస్వామి అధ్యక్షత వహించారు. దీక్షల్లో యూనియన్ నాయకులు వై. సింగయ్య , ఎన్.రాజు, ఎం. శంకర్, షేక్ చాంద్ బాషా, పండ్లూరి సురేష్, కాంతారావు, సుమన్, నిర్మల, సుభాషిణి కూర్చున్నారు. కార్మికుల దీక్షలకు పురపాలక సంఘం ఉద్యోగుల సంఘం నాయకుడు మర్రి మాల్యాద్రి, రాజశేఖర్, కె.శ్రీనివాసరావు, జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, యుటిఎఫ్ నాయకులు పాలేటి సురేష్, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు రామిరెడ్డి, సిఐటియు నాయకులు ఎన్. బాబూరావు, ఎం.వసంతరావు, పి. కొండయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె. మనోజ్, బి. సుబ్బారావు, మున్సిపల్ ఫెడరేషన్ నాయకులు ఇమ్మనియెల్, డి. ప్రభాకర్ తదితరులు మద్దతు తెలిపారు.