ప్రజాశక్తి-బాపట్ల మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ జిల్లా కన్వీనర్ చిమటా వీరస్వామి తెలిపారు. స్తానిక పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాస్వామి మాట్లాడుతూ గతంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచి జీవో ఇవ్వాలన్నారు. మట్టి ఖర్చులకు ఇస్తున్న మొత్తాన్ని రూ 20 వేలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. మజుందర్ మాట్లాడుతూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు సేవలు అందించడంలో మున్సిపల్ కార్మికులు ఎనలేని సేవ చేస్తున్నారనన్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల్లో వ్యత్యాసాన్ని తొలగించి అందరికీ ఒకే వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సుబ్బారావు, రత్నం పాల్గొన్నారు.అద్దంకి : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, గతంలో కార్మికుల సమ్మె సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 10 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని మున్సిపల్ మేనేజర్ బి. శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులకు రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. మట్టిఖర్చులకు ఇచ్చే నగదును రూ.20 వేలకు పెంచాలన్నారు. ఎన్‌ఎంఆర్ కోవిడ్ బదిలీ కార్మికుల కు జీవో నెం 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. పై సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.ఆదాం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అద్దంకి కార్యదర్శి జి. భీష్మ, అలివేలమ్మ ఇంజనీరింగ్ వర్కర్స్ విభాగం నాయకులు ఉసురుపాటి సామ్యూలు, జాను, కె. మారుతి మార్కు పాల్గొన్నారు.