కార్మికులను రెగ్యులర్‌ చేయాలి

ప్రజాశక్తి-చీమకుర్తి: ఏపీఎండీసీలో గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న గిరిజన ట్రైనీ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన రామతీర్థంలోని కార్మికులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఏపిఎండిసి లో ట్రైనీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని గిరిజన కార్మికులను తీసుకున్నారన్నారు. అయితే వారిని 20 ఏళ్ళుగా రెగ్యులర్‌ చేయకుండా పని చేయించుకుంటున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై గతంలో ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రులను, గిరిజన సంక్షేమశాఖా మంత్రిని, మైనింగ్‌ మంత్రిని సిఐటియు రాష్ట్ర నాయకత్వం అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వీరి కంటే వెనుక చేరిన అవుట్‌ సోర్సింగ్‌ వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారనీ, కనీసం వారితోపాటు రెగ్యులర్‌ చేసే వరకైనా ఇవ్వాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, కార్మికులు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️