ప్రజాశక్తి-పామూరు: పామూరు పట్టణం నుంచి సీఎస్ పురం వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే కళ్లు పోతున్నాయని, నడుములు విరుగుతున్నాయని వాహన దారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇదే రోడ్డులో ఉండటంతో రైతులు, విద్యార్థులు, మండల ప్రజలు కార్యాలయాలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాల్సిన పరస్థితి ఉంది. మండల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసే కార్యాలయాలు అక్కడ ఉన్నా చిన్నపాటి పనులు పూర్తి చేయ లేకపోవడం దురదృష్టకరమని సిపిఎం మండల కార్యదర్శి షేక్ ఖాదర్ భాష, మండల ప్రజలు అంటున్నారు. పట్టణంలోని డివి పాలెం సెంటర్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సీఎస్‌పురం బస్టాండ్ నుంచి కరెంట్ ఆఫీస్ కాలనీ వరకు రోడ్లు అధ్వానంగా ఉండి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులకు పట్టటం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కరెంట్ ఆఫీస్, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఎంఈవో కార్యాలయం, వెలుగు కార్యాలయం, ఏపీవో, అగ్రికల్చర్, హార్టికల్చర్, సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఇక్కడే ఉన్నాయి. అధికారులు వాహనాలతో వెళుతూ చూసుకుంటూ పోతున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండి చిన్నపాటి వర్షానికి కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. రోడ్డుపై వెళ్తున్న అధికారులు పరిశీలించకపోవడం దురదృష్టకరం. వాహనాలు వెళ్తుంటే రోడ్డుపై లేచే దుమ్ముకు వెనక వెళ్లే వాహనదారుల కళ్ళు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని మండల ప్రజలు అంటున్నారు.