17న జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డిఆర్‌ఒ ఆదేశాలు
ప్రజాశక్తి-విజయనగరం : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే రాతపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 17న జరిగే పరీక్షకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ రెండు పరీక్షలకు సంబంధించి తమ ఛాంబర్లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకు జరుగుతాయని చెప్పారు. చింతలవలసలోని ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, గాజులరేగలోని అయాన్ డిజిటల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు, వివిధ శాఖల ప్రతినిధులు, ఎపిపిఎస్‌సి అధికారులు పాల్గొన్నారు.