డయేరియా మృతుల కుటుంబాలకు వైసిపి ఆర్థిక సాయం

Nov 26,2024 21:27

 ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణ నష్టం : బొత్స
ప్రజాశక్తి-గుర్ల  : గుర్లలో గతనెలలో సంభవించిన డయేరియా మృతుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ డయేరియా మృతుల పట్ల అధికారులు, ప్రభుత్వం అనుసరించిన తీరు ఆక్షేపనీయమని అన్నారు. గత నెలలో డయేరియాతో మృతి చెందిన మతుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారని, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనా, అందజేస్తున్నామని తెలిపారు. గుర్లలో 10 కుటుంబాలకు, కోటగండ్రేడు ఒక కుటుంబానికి, నాగళ్లవలసలో ఇద్దరి కుటుంబాలకు ఈ సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. డయేరియాను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. తన రాజకీయా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. శాసన మండలలిలో ఈ విషయమై ప్రస్తావిస్తే మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చెయ్యలేని పని వైసిపి చేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ చేతుల మీదుగా మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్య నారాయణ రాజు, జిల్లా నాయకులు పొట్నూరు సన్యాసి నాయుడు, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు జమ్మూ స్వామి నాయుడు, ఇజ్జిరోతు ప్రసాద్‌, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

➡️