కలెక్టరేట్ వద్ద ర్యాలీ, ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇస్తామన్నా మూడువేలు భృతి ఇవ్వాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి చేపట్టిన యువతపోరులో భాగంగా నిరుద్యోగులు, విద్యార్థులు కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. కంటోన్మెంట్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడుకొండ అప్పలనాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. ప్రకటించిన పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజలు మనోభావాలతో ఆడుకుంటోందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు పథకం, 18ఏళ్లు నిండిన మహిళలకు రూ.1800 వంటి పథకాలేవీ అమలు చేయడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్దులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం జిమ్మిక్కులు చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, పథకాలు అమలు, నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్‌మెంట్‌కోసం జలు సమస్యలు పరిష్కారం కోసం వైసిపి ఆధ్వర్యాన పోరాడుతామని, ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, రాజాం నియోజకవర్గ నాయకులు రాజేష్, శోభ హైమవతి, స్వాతిరాణి, పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు.