మాట్లాడుతున్న టిడిపి కౌన్సిలర్
ప్రజాశక్తి-చిలకలూరిపేట : పరస్పర ఆరోపణలు, ప్రశ్నలతో వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం సాగగా పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్‌లో కోటప్పకొండకు వెళ్లేదారిలో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరు పెట్టాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వైసిపి కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఆర్చి నిర్మాణానికి విడదల రజిని సొంత నిధులు కేటాయించారని, అందుకే ఆమె పేరు పెట్టారని చెప్పారు.మున్సిపల్ కౌన్సిపల్ సమావేశం కౌన్సిల్ హాలులో చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన గురువారం నిర్వహించారు. 42 అంశాలతో కూడిన ఎజెండా చదవడం పూర్తి కాగానే టిడిపి పక్ష కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నరసరావుపేట రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని ఇంటి నిర్మాణంలో డ్రెయిన్ల డైవర్షన్ మార్చారని, దీనిపై ఎన్నిసార్లు చెప్పిన టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. నరసరావుపేట రోడ్డులో ఓ భవనాన్ని రోడ్డు ఆక్రమించి నిర్మించారని చెప్పారు. వైసిపి కౌన్సిలర్ వలేటి లక్ష్మీనారాయణ, యూసఫ్‌ఆలీ స్పందిస్తూ రజినీ నిర్మాణంపై చర్యలు తీసుకునే ముందు పట్టణంలోని అన్ని అక్రమ నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలకు వాగ్వాదం తలెత్తింది. ఇదిలా ఉండగా తాను ఎస్టీని కావడం వల్ల తాను చెప్పిన అంశాలపై స్పందించడం లేదని వైసిపి కౌన్సిలర్ కోట్యా నాయ క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వార్డు పరిధిలో 15 సెంట్ల రిజర్వ్ స్థలం ఆక్రమణకు గురైందన్నారు. కమిషనర్ శ్రీహరిబాబు స్పందిస్తూ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా ఆక్రమించుకున్న వారు ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. లీకుల పేరుతో నీటి సరఫరాను నిలిపేస్తున్నారని, ట్యాంకర్లయినా పంపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిడిపి సభ్యుడు బేరింగ్ మౌలాలి అన్నారు. గతంలో తాగునీరు సరఫరా చేసిన ట్యాంకర్లకు డబ్బులివ్వలేదన్నారు. నిధుల లభ్యత అధారంగా బిల్లులు మంజూరు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. కుక్కల బెడదపై పలువురు కౌన్సిలర్లు ప్రస్తావించగా ఇప్పటికే 100 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించామని, మిగతా వాటికీ చేయిస్తామని కమిషనర్ తెలిపారు.
