వైసిపి ఓటమి టిడిపికి గుణపాఠం

Jun 8,2024 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో వైసిపి ఓటమి టిడిపికి గుణపాఠం వంటిది. ఔను..! దీన్ని గుణపాఠంగా తీసుకోకపోతే రానున్న ఐదేళ్ల తరువాత పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. తాజా రాజకీయ పరిణామాలే ఇందుకు తార్కాణం. ఈ మాటలు అంటున్నది రాజనీతి శాస్త్రజ్ఞులు, కాకలుతీరిన రాజకీయ నాయకులు మాత్రమే కాదు సుమా..! సాధారణ ప్రజానీకం కూడా చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో హాట్‌హాట్‌గా సాగుతున్న పబ్లిక్‌ టాక్‌ ఇది. ఇందుకు కారణం లేకపోలేదు. వైసిపికి రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంట్‌ స్థానాలైనా వచ్చాయి. మన జిల్లాలో ఏంటబ్బా అందులో ఒక్కటి కూడా లేదు. ఇంత ఓటమికి జగన్‌, ఆయన అనుసరించిన విధానాలే కారణమా? ఇందులో ఎమ్మెల్యేల పాత్ర ఎంత? అనే దానిపై సర్వత్రా చర్చ వినిపిస్తోంది. వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతగానో సంతృప్తి పరిచాయి. కానీ, బిజెపి ప్రవేశపెట్టిన చెత్తపన్ను, విలువ ఆధారిత ఆస్తిపన్ను, ఇంటిపన్ను, విద్యుత్తు సంస్కరణల అమలుకు అత్యుత్సాహం చూపడంతో అవి పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారాలుగా మారాయి. దీనికితోడు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన, భాష జనాన్ని విసిగించాయి. ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో జరిగిన లోపాలు. ఈ సంగతి అటుంచితే జిల్లాలోని ఎమ్మెల్యేల తీరు నష్టాలను మరింతగా పెంచింది. మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణను మినహాయిస్తే దాదాపు ఎమ్మెల్యేలంతా గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రయివేటు భూములు కబ్జాలు చేశారని, ఇసుక, కంకర, అటవీ సంపద వంటి సహజ వనరులను సొమ్ము చేసుకున్నారనేది ప్రజలు కోడైకూస్తున్నారు. మరికొందరైతే సంపాదన అనే యావలో పడి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. చివరికి పార్టీ కార్యకర్తలను సైతం పక్కనబెట్టారు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగ, ఉపాధి మార్గాలను ప్రభుత్వం ఎలాగూ చూపలేకపోయింది. కనీసం ఉన్న ఉద్యోగాలు ఊడిపోకుండా చేయలేకపోయారు.జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడినా నోరు మొదపకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు బదిలీ సిఫార్సులు, అధికారులకు పోస్టింగులు కావాలంటే రూ.లక్షలు ముట్టజెప్పాల్సిన దుస్థితి కూడా కనిపించింది. ఫైలు స్పీడుగా నడవాలంటే మరో రేటు. ఇక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గౌరవ వేతనంతో బతుకీడుస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మధ్యాహ్న భోజన కార్యకర్తలపై కూడా రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడ్డారు. వీరిలో ఎంతో మందిని బాధ్యతల నుంచి తొలగించి, తమ ఆనుయాయులను పెట్టుకున్నారు. నిరసన తెలిపితే నిర్బంధాలు, బెదిరింపులు, కేసులు. వీటి వెనుక కూడా ఎమ్మెల్యే జోక్యం ఉందన్నది జనం మాట. ఇటువంటి చర్యలు కేవలం బాధిత కుటుంబాల్లోనే కాకుండా పేద, మధ్య తరగతి ప్రజలను ఒకింత ఇబ్బందులకు, మనస్తాపానికి గురిచేశాయి. దాదాపు అందరు ఎమ్మెల్యేలూ అధినేత జగన్మోహన్‌రెడ్డి బాధ భరించలేక ఇంటింటికీ వైసిపి ప్రభుత్వం అన్న పేరుతో జనాల వద్దకు వెళ్లినప్పటికీ, స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి వంటివాటికి చొరవ చూపలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగూ కల్పించలేదు. కనీసం ప్రకటిచిన ధర ప్రకారమైనా క్రయవిక్రయాలు జరిగేలా ఎమ్మెల్యేలెవరూ ప్రయత్నం చేయలేదు. మరో మాటలో చెప్పాలంటే ధాన్యం కొనుగోళ్లలో జరిగిన దోపిడీలో సాక్షాత్తూ ఎమ్మెల్యేల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా రైతుల నుంచి వినిపించాయి. జిల్లా ప్రజలకు సాగునీరో తాగునీరో కల్పించేందుకు కనీసం చొరవ తీసుకోలేదు. సాగునీటి కోసం మంత్రి బొత్స కొంత చొరవ చూపినప్పటికీ ప్రభుత్వం సహకరించలేదు. మొత్తం ఇవన్నీ కప్పిపుచ్చేందుకు జిల్లాలోని పార్టీ పెద్దలు లేనిపోని ప్రచారం పదేపదే చేస్తుండేవారు. ఎంతసేపు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా వచ్చిన నగదు బదిలీ పథకాల ఏకరువే పెట్టారు. దీంతో, ఎమ్మెల్యేలను జనాలు విశ్వసించలేదు. దాదాపు అన్ని చోట్లా ఇదే అంచనాకు వచ్చిన జనం వైసిపి తరపున పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అందుకే టిడిపి గెలిచింది. ప్రజలంతా మార్పును కోరుకున్నారు. ఈ సత్యాన్ని టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్‌పిలు ప్రతి క్షణం గుర్తుంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇదే ఆదరణ చూపుతారని చెప్పలేం. తాజాగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కొత్తవారే ఉన్నారు. వీరైనా ప్రజలకు అందుబాటులో, అండగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అందుకే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వైసిపి ఎమ్మెల్యే, ఎమ్‌పిల ఓటమిని గుణపాఠంగా తీసుకోవాలని జనం చర్చించుకుంటున్నారు.

➡️