ప్రజాశక్తి – కడప ప్రతినిధి మార్క్సిస్టు మేధావి, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంస్మరణ సభ శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వ హించనున్నారు. సీతారాం ఏచూరి జిల్లా ప్రజానీకానికి అందించిన సేవలను స్మరిం చుకునే ప్రయత్నం చేస్తోంది. సంస్మరణ సభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్మరణ సభకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, మాజీ ఎంపీలు సాయిప్రతాప్, తులసిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ మంత్రి అహ్మదుల్లా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కందుల రాజమోహన్‌రెడ్డి, టిడిపి, వైసిపి, కాంగ్రెస్, జనసేన జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎన్.డి.విజయజ్యోతి, ఎస్.శ్రీనివాసులు హాజరుకానున్నారు. వారితో పాటు జిల్లాలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు, వైద్యులు, పట్టణ ప్రముఖులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ శక్తులు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరు కానున్నారు. పార్టీలకు అతీతంగా సంస్మరణ సభకు ప్రజలు, నాయకులు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామ్మోహన్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏచూరికి జిల్లా ఉద్యమాలతో కలిగిన అనుబంధాన్ని నెమరువేసుకుని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రకటించనున్నారు.
