లైంగిక వేధింపులతో యువతి ఆత్మహత్య

Apr 14,2025 00:47

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : లైంగిక వేధింపులు, ఫొటోలతో బెదించడంతో ఈ మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నరసరావుపేట మండలం పమిడిమర్రులో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మురికిపూడి సిఫోర (23)కు, అదే గ్రామానికి చెందిన రాజేష్‌తో ఏడేళ్ల కిందట వివాహం కాగా వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా ఆమెను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నాగరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మృతురాలి ఇంటిపక్కనే ఉండే మరో మహిళ సిఫోరను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ఆటో డ్రైవర్‌ నాగరాజుకు ఇవ్వడంతో వాటి ఆధారంగా నాగరాజు లైంగిక వేధింపులకు, బెదిరింపులకు దిగాడు. వాటిని సోషల్‌ మీడియాలోసైతం పెట్టడంతో ఈ విషయాన్ని మృతురాలు తన ఇంట్లో చెప్పడంతోపాటు ఈనెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేశారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన సిఫోర ఈనెల 8న ఎలుకల మందు తినగా 12న తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదేమీ తెలియని కుటుంబీకులు ఆమెను స్థానిక వైద్యని వద్దకు తీసుకెళ్లగా ఆమె ఎలుకల మందు తిన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే నరసరావుపేటలోని ఆస్పత్రికి ఈసుకెళ్లగా మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబీకులు, బంధువులు హాస్పిటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఘటన చోటుచేసుకునేది కాదని మృతురాలి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన నిందితుడు నాగరాజు, మరో మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ పోలీసుల అదుపులో ఉండగా ఆటో డ్రైవర్‌ నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

➡️