సాక్షులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : వివేకా వర్థంతిలో వైఎస్‌.సునీత

ప్రజాశక్తి పులివెందుల టౌన్‌ (కడప) : మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలయింది. న్యాయం కోసం ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాననీ, సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారని , సాక్షులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్‌ సునీతా అన్నారు. నేడు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి వర్ధంతి వేడుకలను  నిర్వహించారు. శనివారం ఆరవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వైయస్‌ వివేకా సమాధి వద్ద కుమార్తె వైయస్‌ సునీత, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌ రెడ్డి , వైఎస్‌ కుటుంబ సభ్యులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ వివేకా అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్‌.సునీత మీడియాతో మాట్లాడుతూ … హత్య కేసులో నిందితులంతా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని, విచారణ జరగడం లేదని చెప్పారు. ట్రైల్స్‌ నడవడం లేదని, న్యాయం జరుగుతుందా ? అని అనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ మళ్లీ విచారణ చేపడుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఈ కేసులో నిందితుల కంటే తమకు, తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్టు అనిపిస్తుందని తెలిపారు. న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటానని సునీత స్పష్టం చేశారు.

➡️