ఏడు పంచాయతీల్లోనే వైసిపికి స్వల్ప మెజారిటీ

Jun 8,2024 20:35

ప్రజాశక్తి- రామభద్రపురం : మండలంల టిడిపికి కంచుకోట అనేది మరోసారి రుజువైంది. ఈ ఎన్నికల్లో 22 పంచాయతీల నుంచి 5,322 ఓట్లు మెజారిటీతో టిడిపి ఆధిక్యత చూపింది. మేజర్‌ పంచాయతీ రామభద్రపుర లో 9 పోలింగ్‌ బూతుల్లో 1838 ఓట్లు మెజారిటీతో ఉనికిని చాటుకుంది. వైసిపికి కేవలం 7 పంచాయతీల్లో మాత్రమే స్వల్ప మెజారిటీ లభించింది. అప్పలరాజుపేటలో12, జన్నివలసలో 17, పాలవలసలో67, రావివలసలో133, పాడివానివలసలో51, పాతరేగలో 24, దుప్పలపూడిలో 38 ఓట్లు టిడిపి కంటే వైసిపికి ఎక్కువ వచ్చాయి. అయితే కొట్టక్కి, ఆరికతోట, రొంపల్లి, మిర్తివలస, నాయుడువలస గ్రామాల్లో వైసిపికి గట్టి పట్టు ఉందని ఇక్కడ అత్యధిక మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనాలు వేసినప్పటికీ తారుమారయ్యింది. ముఖ్యంగా కొట్టక్కిలో వైసిపి మహిళా నేత సామంతుల నిర్మల, మండల పార్టీ అధ్యక్షులు అప్పికొండ లక్ష్యుంనాయుడు, జెడ్‌పిటిసి సరస్వతి అన్ని తామై పార్టీ కోసం శ్రమించినా వారి స్వగ్రామం నుంచి కూడా మెజారిటీ సాధించలేక పోవడం గమనార్హం. ఇక ఆరికతోట, కొండకెంగువ గ్రామాల్లో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులుగా పెంకి అరుణ, బెల్లాన ప్రసాదు పదవుల్లో ఉన్నప్పటికీ వారి స్వగ్రామాల్లో కూడా మెజారిటీ సాధించలేక పోయారు. మండల కేంద్రంలో ఎంపిపి లక్ష్మణరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ చింతల సింహాచలం నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షుడు కిర్ల శేఖర్‌తో పాటు అధికశాతం కేడర్‌ శ్రమించినా మెజారిటీ సాధనలో వెనుక పడ్డారు. ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి చినప్పలనాయుడు ఈ ఐదేళ్లలో మండలానికి చెప్పుకో తగిన అభివృద్ది చేసిన దాఖలాలు లేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రజలందరికీ సమాన సంక్షేమం అందక పోవడం, ఇస్తున్న ప్రయోజనాలు కన్నా చెల్లించే రుసుములు, విద్యుత్‌, మద్యం, నిత్యావసరాలు ధరలు అధిక మవ్వడం, నాణ్యత లేని ‘జే ‘బ్రాండ్ల మద్యంతో అనారోగ్యాలు రావడం వంటి వాటితో ప్రజలు విసుగు చెంది ఓటు అనే ఆయుధంతో వైసిపిని చిత్తుగా ఓడించారు. ముఖ్యంగా జగన్‌ పాలన తుగ్లక్‌ పాలన కన్నా దారుణంగా ఉందని బాహాటంగానే చర్చించుకున్నారు. అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తూ ప్రశ్నించే పౌరులపై కేసులు పెట్టడం, సొంత గూండాలతో దాడులు చేయించడం వంటి ఘటనలతో ప్రజలు వైసిపిని దూరం పెట్టినట్లు గ్రామాల్లో చర్చజరుగుతోంది. అధికారంలో లేకపోయినా ఎన్నో సేవలు చేస్తూ ప్రజామోదం పొందిన బేబీనాయనకు మండల ప్రజలు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆదరించారు. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి వైసిపికి సుమారు 8వేలు మెజారిటీ రాగా ఈ దఫా సుమారు 44 వేలు మెజారిటీ బేబీ నాయనకు రావడం విశేషం. అధికారం లేనప్పుడు కూడా ప్రజా సేవలో ఉండే ‘నాయన’కు టిడిపి ప్రభుత్వం మంత్రి వర్గంలో చోటు కల్పించి బొబ్బిలి నియోజక వర్గ అభివృద్ధికి అధిక ప్రాదాన్యత కల్పించాలని పలువురు కోరుతున్నారు.

➡️