రాజధాని జిల్లాల్లో వైసిపి ఘోరపరాజయం

Jun 9,2024 00:03

గుంటూరు : రాజధాని జిల్లాల్లో వైసిపి ఘోర పరాజయంపాలైంది. 2019 ఫలితాలతో పోలిస్తే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కస్థానం కూడా నిలబెట్టులేకపోయింది. మూడు రాజధానుల నినాదం వైసిపికి తీవ్ర నష్టం చేకూర్చింది. రాజధానిని మార్చినా ప్రజలు పెద్దగా పట్టించుకోరని కేవలం ఒక్కటి రెండు నియోజకవర్గాల్లో కొద్ది ప్రభావం ఉంటుందంటూ వైసిపి నాయకులు వారికి వారే ప్రశ్న, జవాబులతో సర్దుకుపోయారు. ప్రజలు మాత్రం వైసిపికి దిమ్మెతిరిగే తీర్పును ఇచ్చారు. రాజధాని అమరావతి మార్పు ప్రభావం రెండు ఉమ్మడి జిల్లాల్లోనే కాదు..కోస్తా ప్రాంతంలో అన్ని జిల్లాల్లోనూ కన్పించింది. దీంతో కోస్తాలో వైసిపిఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో జనసేన విడిగాపోటీ చేయడం, బిజెపితో టిడిపి విబేధించడం వల్ల కొన్ని సామాజిక తరగతుల ఓట్లు వైసిపికి అనుకూలంగా వచ్చాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణలతో వైసిపికి కొన్ని తరగతుల ప్రజలు దూరమయ్యాయి. జనసేన, బిజెపికి అభిమానించే సామాజిక వర్గాల ఓట్లు టిడిపికి అనుకూలంగా రావడం వల్ల వైసిపికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోలుకోలేని దెబ్బతగిలింది. రాజధాని జిల్లాల్లో నష్టపోతామని తెలిసి ఈ అంశంపై చర్చలేకుండా చేశారు. కానీ ప్రజా తీర్పు మాత్రం వైసిపికి వ్యతిరేకంగానే వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా అమరావతినే రాజధానిగా ఆమోదించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సిఎం జగన్‌ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో అమరావతి నిర్వీర్యం అయి రైతులు ఆందోళన బాటపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుతూ రైతులు 1630 రోజులపాటు సుదీర్ఘకాలం ఉద్యమించారు. మూడు రాజధానుల అంశంపై గత నాలుగున్నరేళ్లుగా ఉద్యమం జరుగుతున్నా ఈ ఉద్యమాన్ని హేలన చేయడం, పెయిడ్‌ ఆర్టిస్టులంటూ రైతులపై నిందలు వేయడం, రియల్టర్లు నడిపిస్తున్నారని ఎదురుదాడి చేయడం ద్వారా వైసిపి అభ్యర్థులంగా చిత్తుగా ఓడిపోయారు. మంగళగిరిలో నారా లోకేష్‌ 91 వేల ఓట్ల ఆధిక్యతతో గెలవగా తాడికొండలో తెనాలి శ్రావణ్‌కుమార్‌ 39 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రాజధాని నిర్వీర్యం వల్ల నిర్మాణ రంగం దెబ్బతినడంతో భవననిర్మాణ కార్మికులు, నిర్మాణ దారులు, ఈ రంగాలపై ఆధారపడిన ఇతర వర్గాలు వారుకూడా వైసిపికి దూరం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపి అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు వైసిపికి తీవ్రంగా నష్టపరిచాయి. బాపట్ల అభ్యర్థి నందిగం సురేష్‌పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండగా ఆయన్ను కొనసాగించి సానుకూలత ఉన్న వి.బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయులను మార్చడం కూడా తీవ్ర నష్టం జరిగింది. గుంటూరు ఎంపి అభ్యర్థి కిలారి రోశయ్య గట్టిగా పోటీ ఇవ్వలేరని తెలిసినా పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అతిగా ఊహించుకున్న వైసిపి అభ్యర్థులకు ఊహించనిరీతిలో ఘోర పరాజయం ఎదురయింది. కేవలం కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి రూ.20 వేలనుంచి రూ.50 వేల వరకు సాయం అందిస్తే ఇక తాము ఏమి చేయక్కర్లేదన్న భావనతో ఉండిపోయిన వైసిపి నాయకత్వం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్పు వ్యవహారం ఆ పార్టీకి తీరని నష్టం చేసింది. ప్రధానంగా ఇసుక విధానం అస్తవ్యస్తంగా చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బంది పడ్డారు. అంతేగాక నిర్మాణ రంగం దెబ్బతింది. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయా తరగతులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కంటే తమకు పనులు లేక ఎక్కువగా నష్టం జరుగుతుందేనే భావన పేద వర్గాలు గ్రహించాయి. దీంతో పేదవర్గాల్లో కూడా వ్యతిరేకతకు దారితీసింది. పంచాయతీలకు నిధులు లేకుండా చేయడంపై వైసిపి సర్పంచులే చాలామంది ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. సర్పంచ్‌లకు వైసిపి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వకపోవడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. విద్యుత్‌ ఛార్జీల పెంపు వ్యతిరేకత పెరగడానికి బాగా దోహదపడింది. అంతేగాక ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు గ్రామాల్లో వైసిపిని బాగా దెబ్బతీసింది. (ఎ.వి.డి.శర్మ)

➡️