ప్రజాశక్తి -తగరపువలస: చిట్టి వలస జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా మంగళవారం జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబరాల్లో భాగంగా చెకుముకి పోటీలు నిర్వహించారు. మండలంలోని 22 పాఠశాలల నుంచి ఈ పోటీల్లో 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ ఆధారంగా చిట్టి వలస జెడ్‌పి బాలురు, బాలికల హై స్కూల్స్, శారద పబ్లిక్ స్కూల్, భీమిలి సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేథరిన్ పబ్లిక్ స్కూల్, జివిఎంసి హైస్కూల్, ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ స్కూల్ విద్యార్థులతో కూడిన ఏడు జట్లు ఈ నెల 27న విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగు జిల్లాస్థాయి చెకుముకి పోటీలకు ఎంపికయ్యారన్లి నిర్వాహకులు తెలిపారు జనవిజ్ఞానవేదిక మండల గౌరవాధ్యక్షులు పొట్నూరు మురళీ మోహనరావు, అధ్యక్షులు పక్కి నాగేశ్వరరావు, కార్యదర్శి నయీముద్దీన్ అన్సారీ, ప్రతినిధి మురళీధర్ , డైట్ అధ్యాపకులు సోమయాజులు పాల్గొన్నారు
ఆనందపురం: స్థానికజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి జోనల్‌స్థాయి పోటీలను నిర్వహించారు. మండలంలోని 18 పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈపోటీల్లో గిడిజాల జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్దులు ప్రధమ స్థానంలో, ఆనందపురం విద్యార్దులు ద్వితీయ, బోయపాలెం తృతీయ స్థానంలో నిలిచారు. వీరందరూ ఈనెల 27న జరుగబోవు జిల్లాస్థాయి పోటీలో పాల్గొంటారు. విజేతలకు హెచ్‌ఎం కె.రామకృష్ణ్ణ పట్నాయక్ బహమతులు అందజేసారు. జన విజ్ఞాన వేదిక కన్వీనర్ పెద్దింటి త్రినాధరావు, ఉపాధ్యాయులు కేజియా, భాస్కరరావు, పిఇటి ప్రసాద్ పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 6వ వార్డు పీఎం పాలెం సృజన స్కూల్‌లో మంగళవారం జన విజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో చెకుముఖి సైన్స్ సంబరాలలో భాగంగా జోనల్ స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 14 స్కూల్స్ నుంచి 22 బృందాలుగా 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మురళీధర్, జిల్లా సభ్యులు అప్పల రెడ్డి, నరసింహమూర్తి, రఘురామ, సృజన స్కూల్ కరస్పాండెంట్ షరీఫ్, ప్రసాద్ పాల్గొన్నారు.