జ్యూట్‌ కార్మికుల ఆకలి కేకలు

May 4,2025 21:10

మూడేళ్లుగా తెరుచుకోని జీగిరాం మిల్లు

అధికారంలోకి రాగానే తెరిపిస్తానన్న మంత్రి

ఏడాదవుతున్నా ఒక్క అడుగు పడని వైనం

ప్రజాశక్తి – పార్వతీపురం :  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకాలో జ్యూట్‌ కార్మికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మూడేళ్లుగా మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు తెరుచుకోకపోవడంతో కార్మికుల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. మన్యం జిల్లాలో గల ఏకైక పరిశ్రమ మూతపడి ఉండడంతో కార్మికుల కుటుంబాలు ఉపాధి కోసం వలస బాట పట్టాయి. ఎక్కడ పని దొరికితే అక్కడకి వెళ్లిపోతున్నారు. రాజాం, చిన్నాపురం, నెల్లిమర్ల, ఏలూరు ప్రాంతాలకు వెళ్లి జూట్‌ మిల్లుల్లో పని చేస్తున్నారు. మరికొందరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరి కొందరు సాలూరు పట్టణంలో పండ్ల దుకాణాలు నడుపుతూ, హొటళ్లలో పని చేస్తూ, ఆటోలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మిల్లు మూతపడి మూడేళ్లు దాటినా తెరిచే అవకాశం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో బతుకుతెరువు కోసం దూరప్రాంతాలకు వలస పోతున్నారు. 1986లో ఎన్టీఆర్‌ నాయకత్వంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఎపి ఫైబర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరిట జీగిరాంలో జ్యూట్‌ మిల్లు ఏర్పాటైంది. అత్యంత వెనుకబడిన గిరిజన నియోజకవర్గంలో నిరుపేద గిరిజనులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ రంగంలో ఏర్పడిన జూట్‌ మిల్లు క్రమేణా ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకదశలో మూడు వేలమంది పని చేసిన మిల్లులో క్రమేణా కార్మికుల సంఖ్య 1200కు పడిపోయింది. ముడిసరుకు రేటు పెరగడం, బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడడం వంటి అంశాలను సాకుగా చూపి మిల్లు యాజమాన్యం మూడేళ్ల క్రితం లాకౌట్‌ ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో లాకౌట్‌ సమయం రెండేళ్లు గడిచిపోయింది. అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజన్నదొర మిల్లును తెరిపించేందుకు కొంత ప్రయత్నం చేశారు. కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిగేలా చూశారు. రిటైరైన కార్మికులకు రావాల్సిన బకాయి లను యాజమాన్య ంతో ఇప్పించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఎన్నికలు రావడంతో మిల్లు తెరిపించే ప్రయత్నాలు అటకెక్కిపోయాయి. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి గెలుపు కోసం ప్రచారం చేపట్టిన టిడిపి యువనేత లోకేష్‌ కూడా జ్యూట్‌ మిల్లు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మిల్లు తెరిపిస్తానని భరోసా కల్పించారు. ఆమె హామీలపై నమ్మకంతో కార్మికులు ఏకపక్షంగా ఓటు వేసి టిడిపి గెలుపునకు దోహదపడ్డారు.మరణించినా, ఉద్యోగ విరమణ చేసినా చెల్లింపుల్లేవు గత మూడేళ్లలో లాకౌట్‌ సమయంలో జీగిరాం జూట్‌ మిల్లులో పని చేస్తున్న చాలా మంది కార్మికులు అనారోగ్యంతో మరణించారు. మరికొంతమంది ఉద్యోగాలకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఇంకొందరు ఉద్యోగ విరమణ చేశారు. కొంతకాలం పని చేసిన అనారోగ్యంతోనో, ప్రమాదాల వల్లనో మరణిస్తే అలాంటి కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలబడాలి. వారికి చెల్లించాల్సిన పిఎఫ్‌, గ్రాట్యుటీ బకాయిలు వెంటనే చెల్లించాల్సి ఉంది. అదే విధంగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం బకాయిలు ఏళ్ల తరబడి చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కుటుంబ యజమాని అయిన కార్మికుడు మరణిస్తే రావాల్సిన బకాయి మొత్తంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనో, పెళ్ళిళ్లు చేయాలనో వారి కుటుంబాలు ఆశిస్తాయి. అదే విధంగా విఆర్‌ఎస్‌ ఇచ్చిన, రిటైరైన కార్మికుల కుటుంబాలు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటాయి. మిల్లు యాజమాన్యం ఇలాంటి కార్మికుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లును నడపడమా లేదా కార్మికులకు సెటిల్మెంట్‌ చేసి సాగనంపడమా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన యాజమాన్యం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. మిల్లు లాభాల్లో నడిచినంతకాలం వచ్చిన లాభాల సొమ్ముతో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన యాజమాన్యం కార్మికుల ఆకలి తీర్చే ప్రయత్నం చేయడం లేదు. గడిచిన మూడేళ్లలో సుమారు 20 మంది కార్మికులు అనారోగ్యంతో మరణించారు. వీరికి చెల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం చెల్లించలేదు. ఈదుబిల్లి తిరుపతి, ఆల్తి బంగారు నాయుడు ఉపాధి లేక అనారోగ్యం కారణంగా ఏడాది క్రితం మరణించారు. వీరి బకాయిలు చెల్లించలేదు. ముద్రగిరి పద్మ, వేణు అనే కార్మికులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రిటైరైన తర్వాత వచ్చిన డబ్బులతో కుమార్తెల పెళ్ళిళ్లు చేయాలని భావించారు. అప్పులు చేసి కుమార్తెల పెళ్ళిళ్లు చేశారు. ఏడాది గడుస్తున్నా వీరికి బకాయిలు చెల్లించలేదు.

జూ ్యట్‌ కార్మికుల ఆకలి కేకలు

ఏడాదైనా ఒక్క అడుగూ వేయని మంత్రి

జీగిరాం జూట్‌ మిల్లును తెరిపించేందుకు గడిచిన 11నెలల కాలంలో టిడిపి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఒక్క అడుగు కూడా వేసిన దాఖలాలు లేవు. యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో కలిసి చర్చలు జరిపిన సందర్భం కూడా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తమ బతుకుల్లో మార్పు వస్తుందని నమ్మి టిడిపికి ఓటు వేసిన కార్మికులు నేడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన రాజన్నదొర మిల్లు తెరిపించలేకపోయారని, టిడిపి ప్రభుత్వం మంత్రిగా ఉన్న సంధ్యారాణి తమ జీవితాల్లో వెలుగు రేఖలు తీసుకొస్తారని కార్మికులు ఆశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో ఇటీవల జ్యూట్‌ కార్మికుల నాయకులు, మహిళలు మంత్రి సంధ్యారాణిని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా జ్యూట్‌ మిల్లు తెరిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అడగడానికి ఆమె వద్దకు వెళ్ళారు. అయితే ఆ సమయంలో కార్మిక సంఘాల నాయకులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముందస్తు అపాయింట్మెంట్‌ తీసుకోకుండా ఎవరు రమ్మన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్మిక సంఘం నాయకులు ఖంగుతిన్నారు. మంత్రి వైఖరితో తీవ్ర నిరాశకు కార్మికులు కక్కలేక మింగలేక అంతర్మధనం చెందుతున్నారు.

పక్క జిల్లాల్లో తెరుచుకున్న జ్యూట్‌మిల్లులు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పునఃప్రారంభమైంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిన్నా పురం జూట్‌ మిల్లు కూడా ఇటీవలే తెరుచుకుంది. అయితే టిడిపి ప్రభుత్వంలో రెండు కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి జీగిరాం జూట్‌ మిల్లు విషయంలో మౌనం వహించడం చర్చనీయాంశమవుతోంది.

దేనికైనా సిద్ధమే

జీగిరాం జ్యూట్‌ మిల్లును తెరిపిస్తే పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కార్మికులు చెపుతున్నారు. లేదంటే తమకు రావాల్సిన పిఎఫ్‌, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించి సెటిల్‌ చేసినా అంగీకారమేనని భావిస్తున్నారు. తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిన జ్యూట్‌ మిల్లులు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల మూతపడ్డాయి. మిల్లులు నడపలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేశారు. జ్యూట్‌ మిల్లుల స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. అటు కార్మికులకు ఇబ్బందులు కలిగించకుండా, తాము నష్టపోకుండా జ్యూట్‌ మిల్లు యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాయి.

మిల్లు తెరిపించాలి

జీగిరాం జ్యూట్‌ మిల్లు మూసివేసి మూడేళ్ల వుతోంది. కార్మికులు ఆకలి మంటల్లో కొట్టుమిట్టాడు తున్నారు. అధికా రంలోకి రాగానే మంత్రి సంధ్యారాణి మిల్లు తెరిపిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఏడాది కావస్తున్నా మిల్లు తెరిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేసిన దాఖలాల్లేవు. మరణించిన, రిటైరైన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం బకాయిలు చెల్లించాలి. ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వలసపోయారు. మిల్లు యాజమాన్యంపై మంత్రి ఒత్తిడి పెంచి కార్మికులకు న్యాయం చేయాలి.

– ఎన్‌వై నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి

➡️