ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు కు దోహదపడుతుందని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ముదరందొడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పలమనేరు అండర్ 17వ జోనల్ కోకో గేమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం వారు ముఖ్యఅతిథిగా పాల్గన్నారు .ఈ సందర్భంగా క్రీడలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ … పలమనేరు నియోజకవర్గం అండర్ 17 వ జోనల్ కోకో గేమ్స్ వి.కోట మండలంలో జరగడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మరిన్ని గేమ్స్ లలో పోటీపడే విధంగా మన విద్యార్థులు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ముదరందొడ్డి జిల్లా పరిషత్ పాఠశాల నందు త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నదని ప్రధానోపాధ్యాయులు తెలియజేయడంతో వెంటనే సమస్య పరిష్కారానికి జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల నుంచి పోటీలో పాల్గనేందుకు విచ్చేసిన విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దామోదర్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రెడ్డి , టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రంగనాథ్, వైస్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంఈఓ చంద్రశేఖర్ , విద్యానికేతన్ విద్యా సంస్థ ల అధినేత దామోదర్ రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.