తక్షణమే వేతనాలు పెంచాలి - సెక్రటేరియట్, హౌస్ కీపింగ్ కార్మికుల ఆందోళన
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : ఆగస్టు, సెప్టెంబర్ నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించడంతోపాటు మాటలతో మభ్యపెట్టడం మాని వేతనాల పెంపుకు చర్యలు తీసుకోవాలని అమరావతిలోని సెక్రటేరియట్, అసెంబ్లీ హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర సెక్రటేరియట్, అసెంబ్లీ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం మల్కాపురం సెంటర్లో ప్రభుత్వ సాచివేత వైఖరి పట్ల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ .... హౌస్ కీపింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలు పెంచి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల రెండు నెలలు గడిచిందని, ఈ కాలంలో నిత్యావసర సరుకులు, ఇతర అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగి సామాన్య కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయని అన్నారు. ధరలు మూడు రెట్లు పెరిగినా ఎనిమిదేళ్లలో కార్మికుల వేతనం మాత్రం కేవలం రూ.30లు మాత్రమే పెంచడం దారుణమని విమర్శించారు. గత మూడు నెలలుగా మంత్రులు, అధికారులు, సిఆర్డిఎ కమిషనర్ తదితరులు వేతనాల పెంపుపై సానుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ, ఆ హామీల అమలు మాత్రం ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదన్నారు. 'మాటలు చాలాయి.. ఇక వేతనాల పెంపు ఉత్తర్వులు కావాలి 'అని స్పష్టం చేశారు. వేతనాల పెంపు కోసం ఇప్పటికే దశలవారీగా ఆందోళనలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మె బాట పట్టక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు, పెన్షన్లు చెల్లించడం మంచి విషయమేనని అన్నారు. అయితే, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకు మాత్రం చాలీచాలని వేతనాలు కూడా సకాలంలో చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. ప్రతినెలా ఐదో తేదీ దాటినా వేతనాలు అందకపోవడం వల్ల కార్మికులు అప్పులు చేయాల్సి వస్తోందని,డ్వాక్రా రుణాలు,ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల పెండింగ్ వేతనాలను ఇక ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతిరోజూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కార్మికులతో పని చేయించుకుని వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని లక్ష్మణరావు ఆక్షేపణ వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు, హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలను గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజధాని డివిజన్ నాయకులు జె నవీన్ ప్రకాష్, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె గ్రేస్, శాంత కుమారి, బుజ్జి,చిట్టిబాబు, యేసు మరియమ్మ, శ్రీలత, మరియమ్మ, వెంకటలక్ష్మి,భవ్య, శాంతి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)