భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
ధవళేశ్వరం వద్ద వేగంగా పెరుగుతున్న వరద ప్రవాహం
లంక గ్రామాల పాఠశాలలకు సెలవులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి (కోనసీమ) : గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నది ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ ప్రభావం దిగువ ప్రాంతాలైన పోలవరం, ధవళేశ్వరం, కోనసీమ జిల్లాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం ఉదయానికి నీటిమట్టం 55.10 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.20 అడుగులకు చేరుకుని, 13,24,981 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం నదిలో ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లు, పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతాల్లో అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద శనివారం ఉదయం 8 గంటలకు గేజ్ స్థాయి 11.30 అడుగులు, రాజమహేంద్రవరం లోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జి దగ్గర నీటి మట్టం 14.11 మీటర్లుగా ఉంది. కాలువలకు 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిగిలిన 8,93,607 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇంకా పెరుగుతున్న ధోరణిలోనే ఉందని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంలోని సర్ ఆర్థర్ కాటన్ గ్యారేజీ వద్ద వరద ప్రవాహం మరో కొన్ని గంటల్లో 10 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉండటంతో ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక, అనంతరం 13 లక్షల క్యూసెక్కులు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశముందని కూడా పేర్కొంటున్నారు.గోదావరి ఉధృతి నేపథ్యంలో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో అప్రమత్త చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా లంక గ్రామాల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా నది వద్దకు వెళ్లవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక బృందాలు సిద్ధంగా ఉంచి, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)