
ఏంట్రా అబ్బాయ్ ... ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావ్..వంట్లో, ఇంట్లో అంతా సౌఖ్యమే కదా?
అంతా బాగానే ఉంది బాబాయ్...కాని బయటకి రావాలంటే భయంగా ఉండి రావటం లేదు.
ఎందుకోయ్ భయం?
ఏం లేదు బాబాయ్... ఈ మధ్య నాకు కొంత సమయం దొరుకుతోంది. ఇంటికి వచ్చే రెండు మూడు వార్తా పత్రికలూ ఆసాంతం చదివేస్తున్నాను...దాంతో నాకు కొన్ని సందేహాలు వస్తున్నారు. సందేహ నివృత్తికి ఎవరినన్నా అడుగుదామంటే భయంగా ఉంది.
దానికి భయమెందుకోయ్...వచ్చిన సందేహాన్ని తీర్చుకుంటేగా జ్ఞానం పెరిగేది. ఇంకొకరికి ఆ జ్ఞానం పంచేది.
నీకేం బాబాయ్.. అలానే అంటావ్. అసలు ఒక విషయం చెప్పు. మీ పిల్లలు చిన్నప్పుడు ఏదయినా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేవాడివా..లేదా?
నీకెందుకొచ్చింది ఆ సందేహం? ఏ తల్లిదండ్రులయినా పిల్లలు అడిగిన వాటికి సమాధానం చెబుతారు. సమాధానం తెలియకపోతే తెలుసుకొనల్లా చెప్పటం వారి బాధ్యత, కాదంటావా? ఆ..కొన్ని ప్రశ్నలకి పిల్లలు కాబట్టి, వారికి చెప్పలేనివి ఉంటే అప్పుడప్పుడు కసురుకోవటం సహజం. అవునంటావా..కాదంటావా?
కసురుకోవటం, కోప్పడటం అనేది తప్పు నా దృష్టిలో. చెప్పాల్సిన పద్ధతిలో అన్ని విషయాలను పిల్లలకి చెప్పటం కరక్ట్. తద్వారా వారి జ్ఞానం పెరుగుతుంది..ఆలోచనా శక్తీ పెరుగుతుంది. ఇంతకీ ప్రశ్నించడం తప్పంటావా బాబాయ్.
ఏ మాత్రం కాదు. అంతెందుకు...మన పురాణేతిహాసాలను చూడు. యక్షుడు వేసిన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పి ధర్మరాజు తన సోదరులను రక్షించుకోలేదా? విక్రమార్కుడు భేతాళుడి ప్రశ్నలకు విసుగు విరామం లేకుండా సమాధానాలు చెప్పలేదా? ఇవన్నీ మన చిన్నప్పుడు విన్న కథలే కదా? అంతెందుకు శ్రీశ్రీ 'ప్రజ' పేరుతో ప్రశ్నలు జవాబుల శీర్షికను నడపలేదా? ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదా? మాలతి చందూర్ తన 'ప్రమదావనం' శీర్షికలో ఎంతమంది ఆడవారి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేదు! ఇప్పుడు 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ప్రశ్నలు అడిగేగా డబ్బులు ఇస్తున్నది.
మరెందుకు బాబాయ్, ప్రశ్నించడం మహా నేరం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో మనకొచ్చిన సందేహాలను అడిగితే రాజ ద్రోహం అంటారు. చెప్పుకోలేని పదప్రయోగాలు వాడి, వాడిని మళ్ళీ ప్రశ్నించకుండా చేస్తారు. పార్లమెంటులో ప్రశ్నోత్తర సమయాన్ని వాళ్ళ నాయకుల గొప్పలు చెప్పుకోవడానికి, చేయనివి చేసినట్లు నిరూపించటానికి వాడేస్తారు. పార్లమెంటులో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తే వాళ్ళని సభలోకి రానివ్వకుండా సభా కాలమంతా సస్పెండ్ చేస్తారు. వాళ్ళు అడిగేది ప్రజల సమస్యల గురించే కదా?
సమాధానాలు చెప్పతానికేం? తెలియక..చెప్పలేకా? వాళ్ళు చిన్న పిల్లలేం కాదే..అడగకూడని ప్రశ్నలు అడగటానికి...వినకూడని సమాధానాలు వినటానికి. పరీక్షలలో అడిగిన ప్రశ్నలకి సరయిన సమాధానాలు రాస్తే కదా వాళ్ళను పాస్ చేసి పట్టాలు ఇస్తున్నది.
నేను సమాధానాలు రాయనంటే కుదురుతుందా? పట్టా దక్కుతుందా? పార్లమెంటులో సరయిన సమాధానం చెప్పగలిగితే గా మళ్ళీ పట్టం దక్కేది.
సమాధానాల సంగతి అటుంచి ప్రశ్నించిన వాళ్ళ పై ఈడి, సీబీఐ వాళ్ళని ఉసికొల్పి ప్రశ్నల వర్షం కురిపింప చేస్తారు. వాళ్లకి సమాధానం చెప్పటంలోనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఇక ప్రతిపక్షాలు దేనికి. అందుకనే ఏమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను వలవేసి తమవైపు తిప్పుకొని ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచనలా కనిపిస్తుంది. పైకి మాత్రం ప్రతిపక్షం పటిష్టంగా ఉండాలని మాటలు చెప్పటం విచిత్రంగా లేదూ?
అవునురా అబ్బాయి. నువ్వన్నది కరక్టే. ప్రశ్నించడం అనేది వాళ్లకి తప్పుగా కనిపిస్తుంది. అలా అని మనం ప్రశ్నించకపొతే అది మన తప్పు అవుతుంది.
ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించాల్సిందే..గట్టిగా నిలబడాల్సిందే. అప్పుడే మన ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది.
నిరంజన్