Jul 28,2021 18:28

 ఇకనుంచి అక్కడి డిగ్రీ విద్యార్థులు కాలేజీలోకి అడుగుపెట్టేముందు 'భవిష్యత్తులో మేము కట్నం తీసుకోబోమని', కాలేజీ విద్య పూర్తయిన వారు 'కట్నం అడగబోమ'ని ధ్రువపత్రం అందజేసే రోజులు వచ్చేలా ఉన్నాయి. అందుకు ప్రారంభంగా అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు తాము కట్నం తీసుకోలేదని వివాహమైన నెలరోజుల్లో ప్రభుత్వానికి దరఖాస్తు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పత్రం మీద ఉద్యోగి భార్య, మామ, తండ్రి సంతకం ఉండాలి. ఎంత మంచి ఆలోచన!

వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చి 60 ఏళ్లవుతున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ఆ రాష్ట్రం కేరళ. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రజల్లో చైతన్యం నింపడమే కాక, కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి సిబ్బంది వరకు ఈ నియమాలు అందరూ పాటించేలా పినరయి విజయన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఈ నెల 16న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్‌ కూడా జారీ చేసింది.
కథలో రాకుమారుడు వచ్చి రెక్కల గుర్రం మీద అమ్మాయిని తీసుకెళతాడో లేదో గాని చాలా సందర్భాల్లో వరుడికి దండిగా ధనం కట్టబెడితేనే అమ్మాయి గడప దాటుతుంది. గుండెల మీద కుంపటిగా ఆడపిల్ల కనబడుతుందంటే కారణం వరకట్నమేనని చెప్పేవారు చాలామంది. అయితే కుటుంబానికి భారంగా భావించే స్థాయి నుంచి కుటుంబానికి అండగానే కాదు, తను పుట్టిన ప్రాంతానికి, దేశానికి పేరు తెచ్చే స్థాయికి ఆడపిల్ల ఎప్పుడో ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎందరో అమ్మాయిలను భవిష్యత్తులో కూడా చూస్తాం.
మన సమాజంలో ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకునే కుటుంబాలకు కొదవ లేదు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పటికీ వరకట్న వేధింపులకు చాలామంది బలవుతున్నారు. పేద, ధనిక తేడా లేని ఈ కట్నం ఎన్నో జీవితాలను అంధకారం చేస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒకచోట అడిగిన కట్నం తేలేదని, కానుకలు ఇవ్వలేదని అమ్మాయిలు మంటల్లో కాలిపోతున్నారు, దూలాలకు వేలాడుతున్నారు. కట్నానికి కుల, మతాల బేధం లేదు. ధనిక, పేద తారతమ్యం లేదు. ఎవరి తాహతు తగ్గట్టు వారు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే పెళ్లితంతు కార్యక్రమాల్లో ముఖ్యపాత్ర కట్నానిదే. అంతెందుకు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా చూస్తూ వింతగా, విడ్డూరంగా చెప్పుకుంటున్న సమాజం మనది. అంతలా ఈ కట్నం ప్రజల నరనరాన జీర్ణించుకుపోయింది.

dowry 44

వేధింపులకు పరాకాష్టే మరణాలు
ఈ ఏడాది ఫిబ్రవరి 25న గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన ఆయేషా భాను (24) వరకట్న వేధింపుల కారణంగా మరణి స్తున్నానని వీడియో సందేశం పంపుతూ సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటనకు ముందు సరిగ్గా వారం క్రితమే కలకత్తాలో రషికా అగర్వాల్‌ (25) అత్తగారింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. భర్త, ఇతర కుటుంబ సభ్యుల వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు మరణించిందని రషికా తల్లిదండ్రులు ఆరోపించారు.
వేధింపులకు పరాకాష్టే ఈ మరణాలు. వరకట్నం నెపంతో భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టే ఎన్నో భరించరాని బాధలు నేటికీ మహిళలకు అనుభవాలే. 2019లో 27 ఏళ్ల యువతి ఈ వేధింపుల కారణంగానే ఆకలితో చనిపోయింది. పోలీసు వివరాల ప్రకారం అడిగిన కట్నం తేలేదని కొన్ని వారాలుగా ఆమెకు భోజనం పెట్టడం మానేశారు. కట్నం కోసం బీహార్‌కు చెందిన నీహా యాదవ్‌ అనే మహిళకు నిప్పంటించిన ఘటన 2014లో వెలుగులోకి వచ్చింది. 2019 జాతీయ నేరగణాంకాల బ్యూరో ప్రకారం .... మనదేశంలో ప్రతి గంటకు ఒక మహిళ వరకట్న వేధింపులతో మరణిస్తోంది. ప్రతి నాలుగు నిమిషాలకు వేధింపులకు గురౌతోంది.
తరగతి అంతరాలు, ఆర్థిక, విద్య, మతపరమైన అడ్డంకులన్నింటినీ వరకట్న వేధింపులు ఎప్పుడో దాటేశాయి. మనదేశంలో 1961 నుంచి వరకట్న నిషేధ చట్టం అమలులో ఉన్నా నేటికీ ఈ దారుణాలు జరగుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజా చైతన్యం కొరవడడమే. వేధింపుల కారణంగా మరణం సంభవిస్తే తప్ప వీటిపై చర్చలు జరగకపోవడం అత్యంత విషాదకరం. కట్నం తీసుకోవడం చట్టవిరుద్ధమైనా దానిని నేరంగా పరిగణించక పోవడం వల్లనే ఇన్ని దుష్భ్రవాలు కలుగుతున్నాయి.
అక్షరాస్యతలో దేశంలోనే కేరళ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ మహిళల అక్షరాస్యతా శాతం 95 శాతం పైనే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లింగ నిష్పత్తిలో కూడా మెరుగైన స్థానంలో ఉంది. అటువంటి చోట వరకట్న మరణాలు సంభవించటం అక్కడి వామపక్ష ప్రభుత్వాన్ని ఆలోచింపచేసింది. వరకట్న నిషేధ చట్ట అమలును కఠినతరం చేస్తూ చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు; ఆ మార్పును, చైతన్యాన్ని అందిపుచ్చుకునేలా యువతలో, విద్యార్థుల్లో ప్రచారం మొదలు పెట్టింది. ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసరణీయం.

నవంబరు 26న వరకట్న వ్యతిరేక ప్రతిజ్ఞ
నవంబరు 26న వరకట్న నిషేధ రోజు జరపాలని నిర్ణయించింది కేరళ పినరయి విజయన్‌ ప్రభుత్వం. ఆ రోజు ఉన్నత పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సిబ్బంది ఇలా విద్యారంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ 'కట్నం తీసుకోబోమని, పుచ్చుకోబోమని' ప్రతిజ్ఞ చేయాలని తీర్మానించింది. వరకట్న దుష్ప్రభావాలు, చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వ ఉద్యోగుల్లో, భావి పౌరుల్లో అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అని సర్క్యులర్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వరకట్న నిషేధ అధికారులను నియమించేలా నిబంధనలను సవరించింది.

dowry