Jul 27,2021 15:42

లక్నో : ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త రామసాగర్‌కు ముగ్గురు పిల్లలు. ఆయన యుపిలోని నొయిడాలో నివసిస్తున్నారు. ఆయన మొదటి, చివరి సంతానం చెవిటి వారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు గురించి తెలిసినప్పటి నుండి... వికలాంగులైన తన పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ  బిల్లు చట్టంగా రూపొందినట్లైతే.. తన ఇద్దరు వికలాంగ పిల్లల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చట్టం ప్రకారం వారిని కూడా సంతానం కింద లెక్కిస్తే.. తన లాంటి తల్లిదండ్రులకు వారు భారంగా మారతారని రామసాగర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యోగి ఆధిత్యనాథ్‌ ప్రవేశపెట్టనున్న ఈ చట్టం వికలాంగుల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చనుంది.

జనాభా నియంత్రణ పేరుతో యుపి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ అభ్యంతరకర ముసాయిదా బిల్లును అమలు చేస్తే... వైకల్యం కలిగిన చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. సెక్షన్‌ 15 ప్రకారం.. ఒక జంట మొదటి, రెండవ సంతానం వికలాంగులైతే.. ఆ దంపతులు మూడో సంతానాన్ని పొందవచ్చని పేర్కొంది. అంటే సెక్షన్‌ 15 అనుసరణీయం కాని విధంగాను, వంశవృద్ధి పేరుతో హేతుబద్దతను ప్రశ్నించే విధంగానూ ఉంది. ఈ చట్టం వికలాంగులైన వారిని మరణించిన వారితో సమానంగా చూస్తుంది. దీంతో వికలాంగులైన పిల్లలను తల్లిదండ్రులు మరింత భారంగా భావించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం శాపంగా భావించే అపనమ్మకాన్ని ఇది బలపరుస్తుంది. వికలాంగులు అసమర్థులనే భావనను బలపరచడంతో పాటు అటువంటి సంతనాన్ని కలిగి ఉండటం మంచికాదన్న వాదనను ప్రజలపై రుద్దుతోంది. ఐఎఎస్‌ అధికారి ఇరాసింఘాల్‌తో పాటు పలువురు వైకల్యం భవిష్యత్తుకు అడ్డంకి కాదని నిరూపించినప్పటికీ .. ఈ సెక్షన్‌ను రూపొందించడం సరికాదు.

దురదృష్టవశాత్తు వికలాంగులైన చిన్నారులను పలువురు తల్లిదండ్రులు చంపిన ఘటనలు అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. ఈ సెక్షన్‌తో మరింత మంది ఇదే దారిలో వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సామాజిక భద్రత, ఇతర రక్షణ చర్యలను అందించాల్సిన ప్రభుత్వం ఇటువంటి విపరీత ధోరణులు అవలంబించడం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. ఈ సెక్షన్‌ ద్వారా తల్లిదండ్రులు మూడో సంతానాన్ని ఎంచుకోవాల్సిందేనన్న అభిప్రాయాన్ని బలవంతంగా వారిపై రుద్దుతోంది. శారీరకంగా బలంగా ఉన్న పిల్లలే కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారనే వాదనలోకి తల్లిదండ్రులను నెడుతోంది.

వైకల్యాన్ని నిర్వచించడానికి వికలాంగుల హక్కుల చట్టం 2016ను తీసుకున్నప్పటికీ.. ఈ ముసాయిదా బిల్లులో వైకల్యంపై సరైన నిర్వచనాన్ని ప్రభుత్వం పేర్కొనలేదు. వికలాంగులను ప్రభుత్వం చూసే విధానాన్ని ప్రతిబింబిస్తోంది. వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి చేసిన సూచనలను పూర్తిగా విస్మరించింది. భారత్‌ ఆమోదించిన వికలాంగుల హక్కుల చట్టం 2016ను కూడా వ్యతిరేకిస్తోంది. యుఎన్‌సిఆర్‌పిడి ప్రకారం.. వైకల్యం అనేది మానవ వైవిధ్యంలో భాగంగా గుర్తించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొంది. అయితే ముసాయిదా చట్టం పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. రాజస్తాన్‌ కూడా యుపి ముసాయిదా బిల్లుకు సమానమైన విధానాన్ని అనుసరిస్తోంది. 2017లో అసోం ప్రవేశపెట్టిన జనాభావిధానం కూడా ఇదేవిధానాన్ని సమర్థిస్తోంది. ప్రతిపాదిత యుపి బిల్లు వంశవృద్ధిని ప్రోత్సహిస్తోంది. ఈ బిల్లు వికలాంగులను తక్కువ జాతిగా, తమ వంశానికి కళంకం తీసుకువచ్చేవారుగా ప్రోత్సహిస్తోంది. భావితరాలను తిరోగమనం వైపుకు తీసుకెళుతోంది. ముసాయిదా బిల్లులోని సెక్షన్‌ 15లో వైకల్యం గల పిల్లలు మరణించిన వారితో సమానమని పేర్కొనడం యాథృచ్ఛికం కాదని పేర్కొంటోంది. ఈ రెండు ఒకటేనన్న వాదనను ముందుకు తీసుకెళుతోంది.