Nov 25,2021 13:16

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్‌ కథా నేపథ్యమున్న సినిమాలనే ఎంచుకుంటూ.. విజయాలను తన ఖాతాలో వేసుకుంటారు. అందుకే ఆయన్ని విక్టరీ వెంకటేష్‌నే పిలుస్తారు. ప్రధానంగా రీమేక్‌ చిత్రాల్లో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన దృశ్యం మూవీ తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌ నటించి మెప్పించారు. 2014 విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 మూవీ నవంబర్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌లో విడులైంది. అదే తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ మరోసారి ప్రేక్షలను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందామా..!
కథ
కుమార్తె కోసం అనుకోని పరిస్థితుల్లో యువకుడిని హత్య చేసిన భార్య, పిల్లల్ని, కుటుంబ పరువుని నిలబెట్టుకోవడానికి కేబుల్‌ ఆపరేటర్‌గా ఉన్న రాంబాబు.. తనకున్న సినీ పరిజ్ఞానంతో ఎత్తులకు పై ఎత్తులు వేసి ఆ హత్య కేసు నుంచి ఎలా తప్పించుకున్నది దృశ్యం సినిమాలో చూస్తాం. దృశ్యం - 2లో ఆరేళ్ల క్రితం జరిగిన ఆ హత్య కేసు నుంచే సినిమా మొదలవుతుంది. అయితే ఈ చిత్రంలో కేబుల్‌ ఆపరేటర్‌గా ఉన్న రాంబాబు.. థియేటర్‌ ఓనర్‌ స్థాయికి ఎదిగి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నా.. ఆ కుటుంబాన్ని వరుణ్‌ హత్యకు సంబంధించిన భయాలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పెద్ద కుమార్తె అంజు ఆ హత్య కళ్లారా చూడడంతో.. సంవత్సరాలు గడిచినా డిప్రెషన్‌ నుంచి బయటకు రాలేకపోతుంది. ఎంత నచ్చజెప్పినా ఆమె మానసికంగా కోలుకోలేని స్థితిలో ఉంటే.. పెళ్లి చేస్తేనే అయినా కోలుకుంటుందన్న నమ్మకంతో ఆమెకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వరుణ్‌ హత్య కేసు మరోసారి రాంబాబు తలుపు తడుతుంది. వరుణ్‌ తల్లిదండ్రులైన గీతా ప్రభాకర్‌ (నదియా), ప్రభాకర్‌ (నరేష్‌)లు రాంబాబుపై పగ తీర్చుకోవడానికి తన స్నేహితుడైన గౌతమ్‌ సాహు (సంపత్‌ రాజ్‌)చేత కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేయిస్తారు. ఈసారి పక్కా, ఆధారాలు, సాక్ష్యాలతో దొరికిపోయిన రాంబాబు పట్టుకొని పోలీసులు కోర్టు ముందుంచుతారు. మరి ఆధారాలతో దొరికిపోయిన రాంబాబు ఈ కేసులో దోషిగా నిలబడతాడా? లేక తన తెలివితేటలతో.. మరోసారి కుటుంబాన్ని రక్షించి.. ఆ హత్య కేసు నుంచి తప్పించుకుంటాడా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

venkatesh 2

విశ్లేషణ
దృశ్యం - 2 చిత్రం మలయాళ వెర్షన్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అదే తెలుగు వెర్షన్‌ కూడా అమెజాన్‌ ప్రైమ్‌ బాటే పట్టింది. మొదట థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించినా.. చివరికి అమెజాన్‌వైపే మొగ్గుచూపారు. ఇక దృశ్యం - 2 చిత్రానికొస్తే.. ప్రథమార్థమంతా కూడా దృశ్యం సినిమాను తలపించేవిధంగానే దర్శకుడు తెరకెక్కించాడు. రాంబాబు ఆర్థికంగా ఎలా ఉన్నాడు? ఆ కుటుంబాన్ని ఆ హత్యా తాలుకు భయాలు ఎలా వెంటాడుతున్నాయనేది చూపించాడు. అయితే రాంబాబు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో గ్రామంలో కొంతమంది అతనికి వ్యతిరేకమవుతారు. ఆ హత్యను కూడా రాంబాబే చేసి ఉంటాడని ఆ గ్రామ ప్రజలు కూడా భావిస్తుంటారు. అలాంటి సమయంలో కొంతమంది గ్రామస్తుల సహాయంతో పోలీసులు మళ్లీ ఆ హత్య కేసును సీక్రెట్‌గా విచారిస్తున్నది ప్రేక్షకులకు తెలిసిన దగ్గర నుంచి రాంబాబు ఇప్పుడెలా తప్పించుకుంటాడనే ఉత్కంఠ పెరుగుతుంది. మరోసారి ఈ కేసులో రాంబాబు తన తెలివితేటలతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కుటుంబాన్ని రక్షించడం ఆసక్తికరంగా సాగుతుంది. కోర్టు సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. చివరికి ఆధారాలతో దొరికిపోయిన రాంబాబు పనైపోయింది, ఇంకేముంది హత్య చేసింది తనే అని ఒప్పుకోవాల్సి ఉంటుంది అనే అనుకునేసరికే మరో మాస్టర్‌ ప్లాన్‌తో పోలీసులకు షాక్‌నిస్తాడు. ఈ క్లైమాక్స్‌ మళ్లీ దృశ్యం 3 కూడా తెరకెక్కుతందనిపించేలా ఉంది.

venky 2

ఎవరెలా చేశారంటే..
దృశ్యం సినిమాలోని తారాగణంతోనే దృశ్యం -2 చిత్రం కూడా తెరెక్కింది. ఈ చిత్రంలో వెంకటేష్‌ కథనంతా తన భుజాలపై వేసుకుని నడిపించారు. మోహన్‌లాంల్‌ రేంజ్‌లో వెంకటేష్‌ నటించకపోయినా.. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వెంకటేష్‌ అద్భుతంగా నటించారు. ఇక తల్లిగా మీనా నటన ఆ పాత్రకు న్యాయం చేసింది. కుమార్తెలుగా నటించిన కృతిక, ఏస్తర్‌ అనిల్‌ నటనపరంగా పర్వాలేదనిపిస్తారు. ఇక రాంబాబు లాయర్‌గా పూర్ణ కూడా బాగా నటించారు. తల్లిదండ్రులుగా నదియా, నరేష్‌ మరోసారి తమ నటనతో మెప్పించారు. ఐజిగా సంపత్‌, కానిస్టేబుల్‌గా సత్యం రాజేష్‌, ఇక రచయితగా తనికెళ్లభరిణి నటన కూడా హైలెట్‌గా నిలుస్తోంది. ఈ చిత్రం గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే దర్శకుడు జీతుజోసెఫ్‌ తెలివితేటల్ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక సినిమా సీక్వెల్‌ని.. మరోసారి కూడా ఏమాత్రం ఆసక్తి తగ్గకుండా.. రక్తికట్టించేలా తీయడమంటే మామూలు విషయం కాదు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లలతో రాంబాబు ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠను కొనసాగించాడు. ఫైనల్‌ ట్విస్ట్‌తో పోలీసులకు షాక్‌నిచ్చేది దర్శకుని ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది. ఇక సంగీతం విషయానికొస్తే అనూప్‌ రూబెన్స్‌ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. పరవాలదేనిపిస్తోంది. సతీష్‌ కురుప్‌ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు జీతూ స్క్రీన్‌ ప్లేకి ఫిదా అవ్వాల్సిందే.

venky 2