Jan 23,2022 07:13

   'కావ్యేషు నాటకం రమ్యమ్‌' అన్నారు. తెలుగులో నాటకానికి 'కన్యాశుల్కం', నవలకు 'మాలపల్లి' ఈనాటికీ సాటిలేనివి. సామాజిక ప్రయోజనంతో రాసినవి. కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి, వరవిక్రయం నాటకాలు కూడా అదే కోవకు చెందుతాయి. వీటికి వందేళ్ల చరిత్ర వుంది. ఇవి లోకవృత్తాన్ని అనుకరించే కళాత్మక వాస్తవిక రూపాలు. వీటిలో జీవం... జీవితం వుంది. జాతీయోద్యమ పోరాటాల వారసత్వం వుంది. నాటి ఫ్యూడల్‌ వ్యవస్థ చక్రబంధంలో కూరుకుపోయిన మనుషులు, వాళ్లు నిత్యం ఊపిరి పీల్చే సమస్యలు ఈ నాటకాలలో వున్నాయి. భూస్వాములు, జమిందార్లు బ్రిటిష్‌ వారితో వుంటే... మిగతా వర్గాలన్నీ జాతీయోద్యమం వైపు నిలిచిన కాలమది. పితృస్వామ్య ఆధిపత్యం, కుల వివక్షత, వెట్టిచాకిరి వంటివి ఫ్యూడల్‌ పీడనలో ఒక భాగం. దేవాలయ ప్రవేశోద్యమాలు, సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా, వితంతు వివాహాలు, కన్యాశుల్కం, వాడుక భాషోద్యమం, గ్రంథాలయ ఉద్యమాలు జాతీయోద్యమంలో భాగంగానే నడిచాయి. హరిజనోద్ధరణ ఉద్యమాన్ని గాంధీజీ స్వయంగా నడిపారు. ఫ్యూడల్‌ సమాజంలో భోగలాలసత్వం, విలాసవంతమైన జీవితం ఒక అవలక్షణం. ఫ్యూడల్‌ పెత్తనం ద్వారా స్త్రీలను ఒక సొత్తుగా మార్చింది కూడా ఈ అవలక్షణమే. ఇందులో భాగమే జోగినీ, దేవదాసీ, వేశ్యా వ్యవస్థలు.
     నాటి ఫ్యూడల్‌ సమాజంలోని భూస్వాములు, జమిందారుల భోగలాలసతకు, వాటి పట్ల సామాన్యుల నిరసనలకు సజీవరూపాలే మాలపల్లి, కన్యాశుల్కం, చింతామణి నాటకాల్లోని పాత్రలు. చింతామణి నాటకంలో ప్రధాన పాత్రలు... భవానీ శంకరం, సుబ్బిశెట్టి. ఈ పాత్రలు నాటి ఫ్యూడల్‌ భోగలాలసతకు ప్రతిరూపాలు. మాలపల్లి-సిగ్గుతో తల వంచుకోవాల్సిన కులవివక్షకు వ్యతిరేకంగా రాసిన నాటకం. కన్యాశుల్కం-ఒక దురాచారానికి వ్యతిరేకంగా రాసినది. అలాగే చింతామణి కూడా ఒక దురాచారానికి వ్యతిరేకంగా రాసిన నాటకరాజం. ఇవన్నీ సంస్కరణోద్యమంలో భాగంగా వచ్చినవి...ప్రజాదరణ పొందినవి. భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటంలో భాగంగానే 'మా భూమి' నాటకం వచ్చింది. 'మధ్య యుగాల నాటి పశుప్రాయమైన కార్యోత్సాహం సనాతనవాదుల ప్రశంసలు పొందవచ్చుగానీ, దాని వెంట, దానికి సరిగ్గా తగిన అనుబంధంగా, పరమ సోమరితనపు నిష్క్రియాపరత్వం కూడా ఏ విధంగా వున్నదీ బూర్జువా వర్గం వెల్లడి చేసింది' అంటూ... భోగలాలసత్వం గురించి 'కమ్యూనిస్టు ప్రణాళిక' చెబుతుంది. ఈ భోగలాలసతను, నిష్క్రియాపరత్వాన్ని ఎదిరించాలి. మధ్య యుగాల నాటి పశుప్రాయ స్వభావాన్ని బయటపెట్టి, వారందరినీ జాతీయోద్యమంలో భాగస్వాములను చేసేవిధంగా ప్రేరేపించడానికి ఇటువంటి నాటకాలు ఉపయోగపడ్డాయి.
   ఇన్నేళ్ల తర్వాత చింతామణి నాటకాన్ని నిషేధించాలని కోరుకునేవారికి ఫ్యూడల్‌ భావజాలం పట్ల మక్కువైనా వుండాలి, లేదా ఆ నాటకం అర్థం కాకపోయైనా వుండాలి. చరిత్రను చెరిపేయాలనుకునే మనువాద భావజాలం వెంట పరుగులు పెట్టినంతకాలం... చరిత్ర ప్రాధాన్యత, జాతీయోద్యమ స్ఫూర్తి అర్థం కావు. ఫ్యూడల్‌ భావజాలానికి వ్యతిరేకంగా... ప్రజలందరూ ఆదరించిన నాటకాన్ని, చరిత్రలో గర్వించదగిన ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా నిషేధించడం అంటే ఆధునిక కాల స్పృహ లేకపోవడమే. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అవగాహనను మెరుగుపర్చుకోకపోతే నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఆంగ్ల భాషా వ్యామోహంతో తెలుగు భాషకు మంగళం పాడారు. ఇలాంటి నిషేధాల ద్వారా జాతీయోద్యమంతో తెలుగు వారసత్వాన్ని కూడా తుడిచిపెట్టేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకూ కేంద్ర గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి మనది. తెలుగు పట్ల, తెలుగు వారసత్వం పట్ల వున్న చిన్నచూపు వలనే ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం 'మా భూమి' నాటకాన్ని, బ్రిటిష్‌ ప్రభుత్వం 'మాలపల్లి' నవలను నిషేధించడం ఎంత తప్పో... ఫ్యూడల్‌ సంస్కృతికి వ్యతిరేకంగా గొప్ప సందేశాన్నిచ్చిన 'చింతామణి' నాటకాన్ని నిషేధించడమూ అంతే తప్పు.