Jun 23,2022 21:55
  • పది రోజులు దాటినా సడలని సంకల్పం

క్విటో: ఈక్వెడార్‌లో మితవాద గులెర్మో లాసో ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా మూలవాసులు చేపట్టిన దేశవ్యాపిత సమ్మెకు పది రోజులైంది. అయినా వారిలో పట్టుదల ఏమాత్రం సడలలేదు. కీలకమైన నేతలను అరెస్టు చేసి, ఆందోళనకారులపై ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించినా లెక్క చేయకుండా రెట్టించిన పట్టుదలతో ప్రజలు ముందుకు సాగుతున్నారు. రాజధానికి చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి జనం తండోపతండాలుగా కదలి వస్తున్నారు. క్విటోలోని ఎల్‌ ఎజిదో పార్కు ఏరియాలోను, యూనివర్సిటీల వద్ద గుడారాలు వేసుకుని నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈక్వెడారÊ మూలవాసీ తెగల సమాఖ్య (సిఒఎన్‌ఎఐఇ) ఇచ్చిన పిలుపునందుకుని ప్రజలు పెద్దయెత్తున ఈ సమ్మెలో పాల్గంటున్నారు. సమ్మెను అణచివేసేందుకు అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని లాసో ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయినా ప్రజలు లెక్కచేయడం లేదు. ఈ సమ్మెకు సంఘీభావంగా మధ్య తరగతి ప్రజలు కూడా వీధుల్లోకి వస్తున్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని, అమాయక పౌరులను ఉగ్రవాదులన్న ముద్ర వేసి వేధించడాన్ని ఆపాలని, ఉపాధి చూపాలని, ఆందోళనకారులపై సాగిస్తున్న విద్వేష ప్రచారాన్ని ఆపాలని, నయా ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి ప్రభుత్వం తప్పుకోవాలని తదితర పది డిమాంద్లను వారు ప్రభుత్వం ముందు పెట్టారు. వాటిని నెరవేర్చేవరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.