
ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
మండలంలోని వల్లాపల్లి సబ్ స్టేషన్ పరిధిలో వల్లాపల్లి, అంబడపూడి, గుంటుపల్లి గ్రామాలకు కరెంటు సరఫరా చేసే విద్యుత్ ఉపకేంద్రం వల్లాపల్లి పవర్ ఆఫీసులో అనదిఅధికారికంగా రోజుకి 15నుండి 20సార్లు కరెంటు కటింగ్ చేస్తున్నారు. దీనితో రాత్రి వేళలో పసిపిల్లలు, వృద్ధులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దోమ కాటుకి గురై విష జ్వరాలు, జబ్బులకు బారిన పడుతున్నారు. విద్యుత్ కేంద్రానికి ఫోను చేస్తే స్విచ్ ఆఫ్, నో కవరేజ్ ఏరియాలో ఉందనో చెబుతుందని ప్రజలు వాపోతున్నారు. సోమవారం రాత్రి సమయంలో దాదాపుగా రెండు గంటలకు కరెంటు సరఫరా ఆపివేశారు. కారణం తెలుసుకునేందుకు ప్రజలు పవర్ ఆఫీసుకు పోన్ చేశారు. కానీ ఫోన్ పనిచేయలేదు. మార్టూరు 132కెవి స్టేషన్‌కు ఫోను చేస్తే అక్కడి సిబ్బంది తాము ఎలాంటి కరెంటు కటింగు పెట్టలేదని సమాధానం చెప్పారు. దీనితో కొంతమంది ప్రజలు సబ్స్టేషన్ వద్దకు వెళ్లి చూశారు. కరెంటు ఆఫీస్ ఇబ్బంది జాలీగా మందు కొడుతూ దర్శనమిచ్చారు. ఇదేమిటి కరెంటు సరఫరా నిలిపివేసి డ్యూటీలో మీరు ముందు తాగడం మంచిది కాదని చెప్పిన ప్రజలపై రాయలేని బాషలో దుర్భాషలాడుతూ మీ గ్రామాలు కరెంటు ఇవ్వము దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించారు. ఉన్నతాధికారులు కూడా తమను ఏమి చేయలేరంటూ ప్రజల మీదే తిరగబడటం విస్మయానికి గురిచేసింది. సిబ్బంది పనిచేయకుండా బయట తిరుగుతున్నారు. సబ్‌స్టేషన్ బాధ్యతలను వాచ్‌మెన్‌కు అప్పజెప్పారు. ఇక్కడ పనిచేసే వాచ్మెన్ మొత్తం తానే చూసుకుంటాను, అంతా తన ఇష్టం అంటూ ప్రజలను అతను బూతులు తిట్టాడు. దీనితో ఉన్నతాధికారులకు ఫోనులో పిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫోన్ పనిచేయకపోవడంతో ప్రజలు సబ్ స్టేషన్ నుండి వెనుతిరిగి వెళ్లారు.