Aug 08,2022 07:15

మా అమ్మను తలచుకున్నపుడెల్లా
మా పల్లె పల్లెంతా నా ముందు
పచ్చని పౌడర్‌ ముఖానికి పూసుకున్న వనదేవతలా
ప్రత్యక్షమవుతుంది!

ఇంటిముందు సున్నపుగోడపై
కోడిపుంజు గడియారం అలారం కూత మ్రోగేదో లేదో...
కప్పుకున్న ఆకాశం దుప్పటిని
అలా పక్కకు విసిరేసి...
ఉలిక్కిపడి లేచేది అమ్మ!

పడుకున్న పిల్లలవైపు
కోడిపెట్ట పిల్లల్ని చూసినట్టు
ప్రేమతో... చూసేది!
లేవండ్రా అని అందరినీ లేపేది!
ఇంటిముందు చెట్టుపై పక్షులు
రెక్కలల్లారుస్తూ ఎగిరినట్టు
ఒళ్ళు విరుచుకొని ఒకరి తర్వాత ఒకరు
నిద్ర లేవడం గుర్తుంది!

మట్టి పొయ్యిలో కట్టెపుల్లలు దూర్చి
ఇంత కిరసనాయిల్‌ వాటిపై కొట్టి
అగ్గిపుల్ల వెలిగించి డికాషిన్‌
గ్లాసులో పోసి ఇచ్చేది!
డికాషన్‌ తాగడం మాకొక ఫ్యాషన్‌!
డికాషిన్‌ ఇసంగా ఉందమ్మా అంటే
కన్న కొడుకును అమ్మినందుకు
ముసలి ఆవు అలిగి పాలివ్వలేదనేది అమ్మ!

రాత్రంతా నిద్రపోకుండా
మంచంపై కూర్చొని మౌనిలా
దేనిగురించో ఆలోచిస్తున్నాడు నాన్న!
మీ ఎద్దును కబేళాకు అమ్మేశారు
ఇంటిముందు తలారి కంఠస్వరం!
కళ్ళు చెమరిస్తుంటే...
చుట్ట వెలిగించేవాడు నాన్న!
గుప్పుమని నాన్న వొదిలిన
పొగలు పైకెళ్ళి మేఘాలై వర్షించేవి!

కరువువేటగాని రక్తపంజరం కదా కబేళా!
రాత్రి కబేళాలో ఒక్క వేటుకు
నరకబడ్డ ఎద్దు తల...
ఉదయమే... రెండు కొమ్ముల మధ్య
సూర్యబింబాన్ని బొట్టుగా పెట్టుకుని..
పల్లె వైపు నడిచి వచ్చేది!
ఎద్దు మా ఊరి పొద్దు పొడుపు!
- కళారత్న బిక్కి కృష్ణ
83744 39053