
పాట్నా : బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జెడియు అధినేత, ఎన్‌డిఎ పక్ష నేత నితీష్‌కుమార్ సోమవారం వరుసగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. దీంతో గత 20 ఏళ్లలో నితీష్‌కుమార్ ఏడు సార్లు సిఎంగా బాధ్యతలు చేపట్టినట్లు అయింది. పాట్నాలోని రాజభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ పఘు చౌహాన్ నితీష్ చేత ప్రమాణం చేయించారు. ఇంకా నితీష్‌తో పాటు ఉపముఖ్యమంత్రులుగా ఇద్దరు, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తార్కిషోర్, రేణు దేవిలను ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాతో పాటు బిజెపి, జెడియు పార్టీలకు చెందిన పలు సీనియర్ నేతలు పాల్గన్నారు.
మంత్రివర్గంలో బిజెపికి ఏడు, జెడియుకి ఐదు, హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్ఎఎం), వికాస్‌సీల్ ఇన్సాన్ పార్టీ(విఐపి) పార్టీలతో ఒక్కొక్క పదవి చొప్పున దక్కింది. వీరిలో హెచ్ఎఎం అధినేత జితన్‌రాం మాంజీ అధ్యక్షుడు సంతోష్‌కుమార్ మాంజీ, విఐపి తరపున ముఖేష్ సాహ్నిలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా నితీష్‌కుమార్, మంత్రులకు కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఎన్‌డిఎ కూటమి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతితక్కువ మెజారిటీతో ఎన్‌డిఎ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జెడి 75 స్థానాల్లో విజయం సాధించగా, బిజెపి 74 స్థానాలను గెలుచుకుంది. నితీష్‌కుమార్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) మూడోస్థానానికి పడిపోయింది. జెడియు 2015లో 71 సీట్లను గెలుచుకోగా, ఈ ఎన్నికల్లో 43 స్థానాలకు పడిపోయింది.
ఆర్జెడి, కాంగ్రెస్ బహిష్కరణ
మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్జెడి, కాంగ్రెస్ పార్టీలు బహిష్కరించాయి. తాము ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నామని ఆర్జెడి నేత తేజస్వీయాదవ్ వెల్లడించారు. ప్రజల తీర్పును ఉల్లంఘించి.. ప్రభుత్వ ఉత్తర్వులుగా మార్చారని ఎన్‌డిఎపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్‌డిఎ మోసంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. తాము ప్రజల తరపున పోరాడతామని ఆర్జెడి ట్వీట్ చేసింది.