Apr 07,2021 22:18

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఛత్తీస్‌ఘర్‌ దండకారణ్యంలో బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3 అర్థరాత్రి భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరగ్గా, నాలుగు రోజులు దాటుతున్నా స్పష్టమైన వివరాలు బయటికి రావట్లేదు. ఎన్‌కౌంటర్‌పై అటు మావోయిస్టులు ఇటు భద్రతా దళాలు చేస్తున్న పోటీ ప్రకటనలతో కధ రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు దండకారణ్యంలో ఆ రోజు ఏం జరిగింది? దాని వెనుక నేపథ్యం ఏమిటి అనే అంశాలు వీడని మిస్టరీగానే ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌పై వెల్లడైన తొట్టతొలి సమాచారంలో ఐదుగురు జవాన్లు, పది పన్నెండు మంది మావోయిస్టులు మరణించారని, ఇరువైపులా పదుల సంఖ్యలో గాయపడ్డారని అన్నారు. రెండో రోజుకొచ్చేసరికి అసువులు బాసిన జవాన్ల సంఖ్య 22కు పెరిగింది. మొదట ఐదుగురి మృతదేహాలను గుర్తించగా, రెండో రోజు గుర్తించిన 17 మృతుల్లో ఒకరు డీహైడ్రేషన్‌ మూలంగా చనిపోయారన్నారు. గాయపడ్డ 18 మంది జవాన్లను చికిత్స నిమిత్తం రాయపూర్‌లోని ఆస్పత్రులకు తరలించారన్నారు. ఆపరేషన్‌లో పాల్గన్న కోబ్రా బెటాలియన్‌ జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వివరాలన్నీ సిఆర్‌పిఎఫ్‌ చీఫ్‌ కుల్‌దీప్‌సింగ్‌ అధికారికంగా పేర్కొన్నవి. మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందనీ ఆయనే చెప్పారు.

తేలని లెక్క
మరోవైపు మావోయిస్టు పార్టీ తరఫున దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేర విడుదలైన లేఖలో నలుగురు మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. జవాన్లు 23 మంది మరణించారని, ఒకరు తమ వద్ద బందీగా ఉన్నారని వెల్లడించారు. చనిపోయిన నలుగురు మావోయిస్టుల ఫోటోలను, పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న 14 తుపాకులు, రెండు వేల తూటాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్‌సింగ్‌ ఫోటోను మరుసటి రోజు విడుదల చేయడంతో పాటు, చర్చలకు సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే జవాన్‌ను వదిలేస్తామని షరతు విధించారు. ఎన్‌కౌంటర్‌లో ఎటువైపు ఎంత మంది మోహరించారో ఇరు పక్షాలూ చెప్పట్లేదు. అది 'యుద్ధ' తంత్రంలో ఎత్తుగడ కావొచ్చు. కానీ రెండు వేల మంది భద్రతా దళాలు పాల్గన్నారని మావోయిస్టులు, నాలుగైదొందల మంది మావోయిస్టులు పాల్గన్నారని సిఆర్‌పిఎఫ్‌ అధికారులు చెబుతున్నారు.

బూమ్‌రాంగ్‌
ఏదో చేయబోతే ఏదో అయిందనే చర్చ భద్రతాదళాల మాటల బట్టి అర్థమవుతోంది. 'మావోయిస్టులు వ్యూహం మార్చుకున్నారు. అధ్యయనం చేయాలి. పాఠాలు నేర్చుకోవాలి' అని సిఆర్‌పిఎఫ్‌ చీఫ్‌ పేర్కొనగా, ఆపరేషన్‌లో పాల్గన్న జవాన్లు 'మావోయిస్టులు అధునాతన ఆయుధాలు వాడారు' అని తెలిపారు. మార్చి 23న నారాయణ్‌పూర్‌ జిల్లాలో మావోయిస్టులు మందుపాతరతో బస్సును పేల్చి ఐదుగరు జవాన్లను మట్టుబెట్టారు. అందుకు ప్రతిగా వేల సంఖ్యలో సిఆర్‌పిఎఫ్‌, డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌ దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) చీఫ్‌ హిడ్మా ఆధ్వర్యంలో టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపియన్‌ (టిసిఒసి) నిర్వహిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అడవిలో గాలిస్తుండగా, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో గెరిల్లా దాడి చేశారు. వ్యూహాత్మకంగానే ఎత్తయిన ప్రదేశాల నుంచి పోలీసులపై మావోయిస్టులు విరుచుపడ్డారు. సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ అధిపతి హిడ్మాను టార్గెట్‌ చేయబోగా, బస్సు పేల్చివేత, కూంబింగ్‌కు రప్పించడం, టిసిఒసి నిర్వహణ ఇవన్నీ మావోయిస్టులు వేసిన వల అని, ఆ వలలో పోలీసులు పడ్డారన్నది భద్రతా దళాల విశ్లేషణ.

రగులుతున్న రెండు పక్షాలు
2018లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు మావోయిస్టులు చేసిన దాడిలో 73 మంది జవాన్లు చనిపోయారు. అనంతరం అంతటి తీవ్ర దాడి ఇప్పటి బీజాపూర్‌-సుక్మా ఎన్‌కౌంటర్‌. ఈ సంఘటనను కేంద్రంలోని బిజెపి సర్కారు రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. సమస్యను రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో పరిష్కరించే బదులు మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. దశాబ్దంన్నర క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాల్పుల విరమణ, చర్చల ప్రక్రియ విఫలమయ్యాక ఇంతకాలం తర్వాత చర్చలకు సిద్ధమని, మధ్యవర్తులను ప్రకటించాలని ముందుకొచ్చారు. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం వైపే అడుగులు వేస్తోంది. దాంతో రాకేశ్వర్‌సింగ్‌ కుటుంబం జమ్ములో ఆందోళనకు దిగింది. మొన్న అక్టోబర్‌లో మావోయిస్టులను ఏరివేసేందుకు 'ఆపరేషన్‌ ప్రహార్‌-ఆపరేషన్‌ సమాధాన్‌' అనే ప్రణాళికను స్వయంగా అమిత్‌షా సమక్షంలో రచించారు. తమిళనాడులో గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను మట్టుపెట్టే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన విజయకుమార్‌ను కేంద్రం భద్రతా దళాల సలహాదారుగా వేసుకుంది. ఆయన ఆధ్వర్యంలో ఇటీవల రాయపూర్‌లో మావోయిస్టుల వేటపై ఐదు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరిగింది. కాగా మావోయిస్టులు సైతం భద్రతా దళాలపై ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఎన్‌కౌంటర్‌ కోసం తెరం, మరికొన్ని గ్రామాల నుంచి మావోయిస్టులు గిరిజనులను ఖాళీ చేయించి అనుకూల ప్రాంతాలుగా మార్చుకున్నారన్నది నిఘా సమాచారం. ఇంకోవైపు కూంబింగ్‌ సందర్భంగా భద్రతాదళాలు ఇష్టారీతిన గిరిజనులను, ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు ముందు ఒక గ్రామస్థుడిని కొరియర్‌ అనే అనుమానంతో చంపేశారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత అటు పోలీసులు ఇటు మావోయిస్టుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో జన్నగూడెం, తెరం, టేకులగూడెం గ్రామాల గిరిజనులు, ప్రజలు ఇళ్లను, ఊళ్లను ఖాళీ చేసి పోతున్నారు.

మావోయిస్టుల బంద్‌ పిలుపు
'వికల్ప్‌' కరపత్రం ప్రధానంగా మోడీ ప్రభుత్వ విధానాల మీదనే విమర్శనంతా ఎక్కుపెట్టింది. రైతాంగ ఉద్యమం, మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కాలంలో జరిగిన దేశ వ్యాప్త సమ్మెలు కలిగించిన ప్రభావం, కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం.. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రం ప్రజల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో రచించినట్టు కనిపిస్తోంది.