చిత్తశుద్ధి ‘క్షయం’

Mar 22,2024 05:15 #Editorial, #TB Disease

2025 సంవత్సరాంతానికి క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలిస్తామని ఏడేళ్ల క్రితం బడ్జెట్‌ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన మోడీ ప్రభుత్వం… ఆ లక్ష్యసాధనకు ఆమడదూరంలో ఉంది. 2020 నాటికి పెట్టుకున్న మధ్యంతర మైలురాయిని కూడా చేరుకోలేకపోయింది. 204 దేశాల్లో జరిగిన సాంక్రమిత వ్యాధుల అధ్యయనం సారాంశాన్ని లాన్సెట్‌ జర్నల్‌ తాజాగా ప్రచురించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నిర్దేశించిన లక్ష్యాలను భారత్‌ సహా చాలా దేశాలు సాధించలేకపోయాయని పేర్కొంది. 2035 నాటికి క్షయను నిర్మూలించాలనేది డబ్ల్యుహెచ్‌ఒ లక్ష్యం. 2015లో నిర్దేశించుకున్న ఈ మైలురాయికి అనుగుణంగా మన జాతీయ క్షయ నియంత్రణా పథకం 2017లో ఒక ప్రణాళికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా ఫలితాలను సాధించటానికి ప్రభుత్వం తగినన్ని నిధులు సమకూర్చాలని నివేదించింది. 2014 – 17 మధ్య కేటాయించిన రూ.3323 కోట్లు అంతంతమాత్రమేనని, ఆ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచాలని కోరింది. ప్రభుత్వం నిధుల కేటాయింపును పక్కన పెట్టి, 2025 నాటికే నియంత్రణలో గణనీయమైన ప్రగతిని సాధిస్తామని మాత్రం పార్లమెంటులో ప్రగల్బాలు పలికింది. సాధించిన ఫలితాలను ఇప్పుడు మదింపు చేస్తే – పాలకుల పూనకమంతా మాటలకే పరిమితమని, తరువాతి బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆ స్పహ లేనేలేదని తేటతెల్లమైంది. 2020 నాటికి లక్ష జనాభాలో క్షయ సంక్రమణ 171 మందికే పరిమితం కావాలనేది లక్ష్యం కాగా, 213 కేసుల వరకూ నమోదయ్యాయి. ప్రతి ఏటా ప్రపంచంలో కోటీ 40 లక్షల కేసులు నమోదైతే, అందులో 27 శాతం మనదేశంలోవే! 18 లక్షల మంది మరణిస్తుంటే, అందులో 5 లక్షల 22 వేల మంది భారతీయులే! ఈ మరణాల సంఖ్యను 2020 నాటికి 2.7 లక్షలకు తగ్గించాలనేది మరొక లక్ష్యం. ఈ చావులను నియంత్రించటంలోనూ కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

క్షయవ్యాధి అనేది అనారోగ్యకరమైన వాతావరణానికి, పోషకాహార లోపానికి కొండగుర్తుగా భావించవొచ్చు. ఈ వ్యాధి ఉనికి, తీవ్రత, విస్తృతి, మరణాలూ ఆధారంగా ఆయా సమాజాల, దేశాల ఆరోగ్యం తీరుతెన్నులను అంచనా వేయవచ్చు! పేదరికం, కరువు, ఆకలి మూకుమ్మడిగా దాడి చేసే ఆఫ్రికా దేశాల్లో క్షయవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఆవరించిన చీకటి కుహరాల్లోనూ ఊపిరి తిత్తులను తినేసే ఈ మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతుంది. అయితే, అలాంటి పరిస్థితులు మోహరించిన దేశాలు సైతం క్షయ నియంత్రణకు, నిర్మూలనకు కట్టుదిట్టుమైన చర్యలను చిత్తశుద్ధితో చేపడుతున్నాయి. లాన్సెట్‌ కథనం ప్రకారం … చాలా ఆఫ్రికన్‌ దేశాలు వ్యాధి కట్టడిలో మెరుగైన ఫలితాలను సాధించాయి. మాల్దోవా, ఈక్వెడార్‌ లాంటి దేశాలు సైతం సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేయడం, వ్యాధి బాధితులను గుర్తించి, క్రమం తప్పకుండా చికిత్సను అందించటం ద్వారా క్షయవ్యాధిని గణనీయంగా నియత్రించగలుగుతున్నాయి.
ఒకపక్క సంపన్నులు పెరుగుతుంటే- అంతకంతకు జీవన ప్రమాణాలు దిగజారిపోతున్న కోట్లాదిమంది ప్రజలు ఉన్న దేశం మనది. ఉపాధి అవకాశాలు తగ్గిపోయేకొద్దీ కుటుంబ సభ్యులకు అందే పోషకాహారం అడుగంటుకుపోతుంది. వివిధ కారణాల చేత దేశంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. జీవించటానికి వీలు కాని కలుషిత ప్రదేశాల్లో బతుకుతున్నవారు కోట్లలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో క్షయ వంటి దీర్ఘకాలిక రుగ్మతను అరికట్టటానికి పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (ఎన్‌ఎస్‌పి)లో పేర్కొన్నట్టుగా, ”ఇప్పటివరకూ అమలు చేస్తున్నది సరిపోదు. నిధులను కనీసంలో కనీసం ఐదు రెట్లు పెంచాలి.” ”పూర్తిగా నిర్మూలన లక్ష్యాన్ని సాధించాలంటే- మాటలు చెబితే సరిపోదు. కనీసం 40 ఏళ్ల పాటు కొత్తగా ఒక్కరు కూడా క్షయ బారిన పడకుండా చూడాలి. ఈలోగా పాత రోగులకు చికిత్స కొనసాగిస్తూనే, కొత్త వ్యాక్సిన్లను, నివారణోపాయాలను కనుక్కోవాలి.” అన్న డబ్ల్యుహెచ్‌ఒ ఉన్నతాధికారి సౌమ్యా స్వామినాథన్‌ మాటలు ఆచరణీయాలు.

➡️