ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతో ప్రజలకు మేలు జరిగేనా?

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను సంస్కరణల ప్రయోగశాలగా మార్చేసింది. భూములను కార్పొరేట్‌ కంపెనీలకు మరింత సులభంగా అందించేందుకు వీలుగా భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే భూ వ్యవహారాలపై చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకుగాను మోడీ ప్రభుత్వం సహకారం అందించింది. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా చేయని ప్రయోగాలను ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే నూతన విద్యా విధానం, పట్టణ సంస్కరణలు, 2020 విద్యుత్‌ చట్టాన్ని అమలు చేస్తున్నారు. వాటి ఫలితంగా ప్రజల నడ్డివిరిచేలా భారాలు తీవ్రంగా పడుతున్నాయి. తీర, అటవీ ప్రాంతాలను అదానీ, అంబానీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎ.పి ల్యాండ్‌ టైటిల్‌ చట్టం 27/2022తో వీటికన్నా తీవ్రమైన ప్రమాదం పొంచి వున్నది. ఈ చట్టం అమలు కోసం జీవో నెం 512 తీసుకొచ్చారు. దీనిపై న్యాయవాదులు, సన్న, చిన్నకారు రైతులు, ప్రజాతంత్రవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.

దేశంలో ఎక్కడా అమలు కాని ఒక కొత్త పద్ధతిని రాష్ట్రంలో తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఒక చట్టం తీసుకురావాలంటే విస్తృతంగా ప్రజలలో చర్చ పెట్టాలి. భూ సమస్యలపై పనిచేస్తున్న నిపుణులు, న్యాయకోవిదులను భాగస్వాలములను చేయాలి. అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా ఎ.పి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలని చూస్తోంది. ఈ చట్టం వలన ప్రజలకి లాభమా? నష్టమా అనేదాని చుట్టూ అనేక అనుమానాలున్నాయి. కాని ఈ చట్టంపై అపోహలు వద్దని ప్రైవేట్‌ భూములకు ఎలాంటి ఢోకా లేదని…భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్యపు హక్కులపై పూర్తి భరోసా వుంటుందని ప్రభుత్వ పెద్దలు సెలవిస్తున్నారు. కాని భూ-మ్యుటేషన్‌ ప్రారంభం నుండే భూ తగాదాలు మొదలైనట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతమున్న పద్ధతి ఏమిటి? కొత్తగా తీసుకొచ్చిన ఎ.పి ల్యాండ్‌ టైటిల్‌ గ్యారంటీ పద్ధతి ఏమిటి? ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టం భూ సమస్యలు పరిష్కారం చేసే చట్టమా? లేదా మరిన్ని సమస్యలను సృష్టించే చట్టమా అనేది పరిశీలించాలి.ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పద్ధతి ప్రాస్పెక్టివ్‌ టైటిల్‌ అంటారు. భూమి/భవన యాజమానుల హక్కులను ప్రభుత్వం గుర్తించడానికి 30 రకాల రికార్డులు వున్నాయి. గ్రామ స్థాయిలో 11 రిజిస్టర్లు వుంటాయి. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌ డీడి, అడంగల్‌…వంటి వాటి ద్వారా భూ యజమాని ఎవరనేది గుర్తిస్తున్నారు. అయితే రెవిన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, గ్రామ పెత్తందార్ల జోక్యంతో అనేక వివాదాలు వస్తున్నాయి. భూమి సాగులో ఒకరుంటే రికార్డుల్లో వేరొకరి పేరు దర్శనమిచ్చే సందర్భాలు కోకొల్లలు. ఈ తప్పులు జరగటానికి ప్రధాన కారణం ఇప్పుడున్న రెవిన్యూ వ్యవస్థ అనేది తెలిసిన విషయమే. అటువంటి రెవిన్యూ అవకతవకల వలనగాని మరే ఇతర విధంగా అయినా భూ వివాదాలు వచ్చినప్పుడు ప్రజలు వెంటనే కోర్టుని ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు. ఇప్పుడున్న చట్టం ప్రకారం కోర్టు, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను అనుసరించి వాదోపవాదాలు, విచారణలు జరిపి న్యాయబద్దమైన తీర్పులు ఇస్తున్నారు. భూ యజమానులకు ఎంతోకొంత ఉపశమనం, భరోసా వుంది. కాని నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం కోర్టులకు సంబంధం లేకండా చట్టంలో పేర్కొన్నారు. భూ హక్కుకు సంబంధించిన సమస్యలను కోర్టుకు వెళ్ళి పరిష్కరించుకొనే హక్కును హరిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన అంశం. న్యాయ వ్యవస్థకు సంబంధం లేకుండా చేయడం అంటే భూ హక్కుదార్లును భూమి నుండి దూరం చేయడమే. న్యాయస్థానం ప్రాధాన్యతను పూర్తిగా తొలగించింది. కొత్తగా ఎ.పి ల్యాండ్‌ టైటిల్‌ చట్టం ద్వారా తీసుకొచ్చిన పద్ధతి కన్‌క్లూజివ్‌ టైటిల్‌ పద్ధతి. ఇదే తుది రికార్డు అని ఈ చట్టం చెబుతుంది. ప్రభుత్వం ఇచ్చిన భూమి హక్కుకు ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ ఇస్తుందని చట్టంలో పేర్కొన్నారు. భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా భూ యజమాని తరపున ప్రభుత్వం వకల్తా పుచ్చుకొని వివాదాలు పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఇది సాధ్యమా? సదరు భూమిని భూ హక్కుదార్లు తప్ప ఎవరూ క్రయవిక్రయాలు జరపలేరన్నది ప్రభుత్వ వాదన. ఈ చట్టం ప్రకారం రెవిన్యూ డిపార్టుమెంట్‌ కీలకమైనది. మొదట భూమి సర్వే గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జిపిఎస్‌) ద్వారా సర్వే చేయాలి. భూమి సర్వేకు సంబంధించి ఏ రైతులయితే ఆ భూమిలో వున్నారో వారికి నోటీసుల జారీ చేయాలి. ఒక నోటీస్‌ తన దగ్గర పెట్టుకోవాలి. సర్వే అయిన తరువాత భూ యజమాని సర్వే రిపోర్టుపై సంతృప్తి వ్యక్తం చేయాలి. డిప్యూటీ తహశీల్దార్‌ పర్యవేక్షణలో నిర్వహించాలి. సర్వే పూర్తి అయిన తరువాత జాయింట్‌ కలెక్టర్‌ ఆన్‌లైన్లో లాగిన్‌ అవ్వాలి. రాష్ట్ర రికార్డులతో అనుసంధానం అవుతోంది. రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలను పునర్‌ వ్యవస్థీకరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ల్యాండ్‌ టైటిల్‌ ఆధారిటీలను ఏర్పాటు చేయాలి. దీనికి రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించి రెవిన్యూ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి.

ప్రతి గ్రామంలో రెవిన్యూ రికార్డులు సవరించాలి. మొత్తం స్థిరాస్తులకు 1. శాశ్వత రిజిస్టర్‌, 2. వివాదాల రిజిస్టర్‌, 3. కొనుగోలు రిజిస్టర్‌ ఇలా మూడు రిజిస్టర్లు ఉంటాయి. ఈ రిజిస్టర్‌పై ఎవరికైనా అభ్యంతరాలుంటే సదరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ఒకవేళ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలుంటే కింది కోర్టులకు కాకుండా హైకోర్టులో రివిజన్‌ వేసుకొనే అవకాశం మాత్రమే ఈ చట్టం కల్పిస్తుంది. దీనివలన చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 15 నాటికి 25 లక్షల 2 వేల ఎకరాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నేటికి మూడు లక్షల ఎకరాలు మాత్రమే భూ సర్వే అయ్యింది. సర్వేలు చేసిన చోట భూమి ఎక్కువ తక్కువ చూపిస్తున్నారు. పాత పట్టాదారు పాసుబుక్కులో ఉన్న భూమి విస్తరణకు కొత్తగా సర్వే చేసిన వాటికి వ్యత్యాసాలు ఉన్నాయి. భూ హక్కుదార్ల మధ్య వివాదాలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సర్వేలు సక్రమంగా జరగాలంటే సర్వే అండ్‌ సెటిల్మెంట్‌కు పూర్తి స్థాయి విభాగం నెలకొల్పాలి. ఈ చట్టం ప్రకారం భూ యజమాని తరఫున ప్రభుత్వమే వాదిస్తుందని చెబుతున్నారు. కాని గతంలో ఎస్సీ, ఎస్టీలకు ఢిపారం పట్టాలు ఇచ్చారు. అమ్మాకాలు, కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగానే 9/77 చట్టం తీసుకొచ్చారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు కూడా చేసి వుంది. కాని నేడు ఢిపారం భూములు కొనుగోలు అమ్మకాలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ చేయవచ్చని నేడున్న ప్రభుత్వం చెబుతుంది. మరో వైపు ఢిపారం భూములు ప్రభుత్వానివని, మేము ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖపట్నంలో 6116 ఎకరాల ఢిపారం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విఎంఆర్‌డిఎ కి ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో కట్టబెట్టారు. ఇది అన్యాయమని పేదలు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. పేదలు తరుపున న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. నేడు ఈ కొత్త చట్టం ప్రకారం న్యాయ స్థానాలను ఆశ్రయించ వద్దంటే సహజ న్యాయ సూత్రాలకు భిన్నమైనది. సివిల్‌ కోర్టు పరిధి నుండి తొలగించి అధారిటీ తీర్పును పైనల్‌ చేయడం టైటిల్‌ డిక్లరేషన్లో ఎటువంటి చట్టబద్దమైన విచారణ లేకపోవడం, ఈ చట్టం సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ పరిధిలో లేకపోవడం కేవలం పబ్లికేషన్లు మాత్రమే టైటిల్‌ను నిర్ణయించడం ప్రమాదకరం.మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు జమీందారీ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో దాదాపు 70 సంవత్సరాల క్రితం సమగ్ర సర్వే నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో రైతు వారి పద్ధతిని థామస్‌ మన్రో చొరవతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ బ్రిటిష్‌ వారు ఏర్పాటు చేసిన స్టాండింగ్‌ ఆపరేషన్‌ ప్రొసీడింగ్స్‌ (ఎస్‌ఓపి) ప్రకారం ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి సమగ్రమైన సర్వే సెటిల్మెంట్‌ జరపాల్సి ఉంది. భూశిస్తు ఆదాయం సరిపోకపోవడంతో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టి సర్వేలు చేయడానికి ముందుకు రాలేదు. నేడున్న ప్రభుత్వం సైతం నిధులు కేటాయించకుండా ప్రత్యేక యంత్రం సమగ్ర సర్వే నిర్వహించలేదు. సంవత్సరాల తరబడి జరగాల్సిన సర్వేలు రోజులలో నిర్వహించి ఫలితాలు సాధించడం సాధ్యమేనా?భూమి అనేది కీలకమైన అంశం. దాని చుట్టూ ఆర్థిక, రాజకీయ, సామాజిక సంబంధాలు ముడిపడి ఉంటాయి. ఇంత ముఖ్యమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు ఒక్క హైకోర్టు తప్ప… కింది స్థాయి కోర్టులను ఆశ్రయించి సివిల్‌ కేసులు దాఖలు చేయడానికి వీలు లేదు. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారితో ఒక ట్రిబునల్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 26 ట్రిబునళ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 563 కోర్టులలో భూ వివాదాల పరిష్కరించలేనివి…26 ట్రిబ్యునళ్లలో ఎలా పరిష్కరిస్తారో ప్రభుత్వమే చెప్పాలి.ఇప్పటి వరకు కార్పొరేట్‌ కంపెనీలకు భూములు కావాలంటే భూ యజమానుల దగ్గర నుండి ఎపిఐఐసి భూములను సేకరిస్తుంది. ఈ భూ సేకరణలో నష్టపోయిన వారు కోర్టులకెళ్లి న్యాయం పొందుతున్నారు. నేడు ఈ చట్టం అమల్లోకి వస్తే రైతులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కార్పొరేట్‌ శక్తులకు భూములు ధారాదత్తం చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం దీనినెవరూ కోర్టుకెళ్లి సవాలు చేసి న్యాయం పొందే అవకాశం లేదు. కార్పొరేట్‌ కంపెనీల అవసరాలకు భూములకు కేటాయింపులు చేస్తారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఆంధ్ర రాష్ట్రం ఎర్ర తివాచీ పరిచినట్లే. ప్రపంచంలో అనేక దేశాలలో భూ యాజమాన్యాలలో అనేక మార్పులు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ‘టోరెన్సు సిస్టమ్‌’ పేరుతో టైటిల్‌ గ్యారెంటీ పద్ధతి అమలులో ఉంది. వేలాది ఎకరాలు కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం అవుతున్నాయి. మన వంటి పేద దేశాలకు రాష్ట్రాలకు ఈ చట్టం సరైనది కాదు. మన రాష్ట్రంలో ప్రధానంగా చిన్న, సన్నకార రైతులు ఉన్నారు. ఇన్ని రకాల రికార్డులు వుంటేనే ప్రజలకు న్యాయం జరగడంలేదు. అలాంటిది ఇప్పుడు కొత్త చట్టం అమలైతే భూముల నుండి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం వుంది. ఈ ప్రమాదాన్ని న్యాయవాదులు గుర్తించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు ప్రమాదకరమని గుర్తించారు. ప్రభ్వుత్వం వెంటనే ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని పున:పరిశీలించాలి.

వ్యాసకర్త : లోకనాథం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

➡️