పెళ్లి అనే రెండక్షరాల పదం… ఇద్దరు వ్యక్తులను ఒక్కటిగా ముడివేసే బంధం. జీవితంలో ఓ మధుర ఘట్టం. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోవాలని యువతీయువకులు కలలు కంటారు. ‘మంచి వివాహం కంటే మనోహరమైన, స్నేహపూర్వకమైన సంబంధం మరొకటి లేదు’ అంటారు మార్టిన్ లూధర్. కానీ, చాలా భారతీయ వివాహాలు ఇప్పుడు మునుపటిలా లేవు. దేశంలో విభిన్న సంస్కృతులున్నట్లే వివాహాలు కూడా ఆయా సంస్కృతులు, సాంప్రదాయాల కనుగుణంగా జరిగేవి. సోషల్ మీడియా అల్గారిథమ్‌లను మార్చగల శక్తి వున్న సెలబ్రిటీల వివాహాల క్లిప్పింగ్స్… ఇప్పుడు మధ్య తరగతిపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణ కుటుంబాల్లో జరిగే వివాహాలు కూడా వేరే ప్రాంతాలో, తాహత్తుకు మించిన ఖర్చుతో చేస్తున్నారు. సంగీత్‌ల కోసం కొరియోగ్రాఫర్‌లను, మెహందీ డిజైనర్లను నియమించడం మొదలుపెట్టారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ట్యాగ్ వుండేలా ఇతర ప్రాంతాల్లో స్టేజీపై డాన్స్ చేయడానికి కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. ‘వివాహం నెగ్గాలంటే భార్యాభర్తలకి నటనలో కొంత తర్ఫీదు అవసరం’ అంటాడు బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ల తంతులో జరిగే ఫొటో సెషన్లు, మెహందీలు, సంగీత్‌లు చూస్తే… ఇక్కడి నుంచే నటన మొదలవుతుందేమో అనిపిస్తుంది.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే దేశంలో అదొక వ్యాపారంలా సాగుతుంది. సెలబ్రిటీలు, బడాబాబులు అయితే ఏకంగా కోట్లు ఖర్చు చేసి విదేశాల్లోనో, దేశంలోని చారిత్రక ప్రాంతాల్లోనో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అదొక స్టేటస్ సింబల్‌గా మారింది. దీంతో వెడ్డింగ్ అనేది అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా మారింది. మొన్నటికి మొన్న అనంత్ అంబానీా రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబానీ వివాహంలో ప్రదర్శన ఇవ్వడానికి బియాన్స్, రిహన్నా వంటి వారికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించి దిగుమతి చేసుకొంటున్నారు. దావోస్ సమ్మిట్‌తో పోల్చదగిన అతిథుల జాబితాను ఈ వివాహాల్లో చూస్తాం. 2024 జనవరి 15నుంచి, జూలై 15 వరకు వున్న పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా 42లక్షల వివాహాలు జరుగుతాయి. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.5.5లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ‘పెళ్లిళ్ల పేరుతో ఖర్చయ్యే డబ్బంతా కలిపితే భారతదేశంలో బిచ్చగాళ్లందరినీ పోషించవచ్చు’ అంటారో రచయిత. మన్ కి బాత్‌లో భారతీయులు దేశంలోనే వివాహాలు చేసుకోవాలంటూ ‘వెడ్ ఇన్ ఇండియా’ అంటూ నినాదమిచ్చారు ప్రధాని మోడీ. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెలబ్రిటీల వివాహాలు భారీగా జరుగుతున్నాయని, ఆ డబ్బంతా దేశంలోనే వుండిపోతుందని ప్రచారం హౌరెత్తిస్తున్నారు. వికసిత భారత్ పేరుతో పథకాలు, విజయాలతో పాటు సోషల్‌మీడియాలో, టెలివిజన్‌లో ప్రొజెక్ట్ చేయబడిన పెద్దపెద్ద వివాహాలను చూపించే భారీ బిల్‌బోర్డుల వెనుక… కనబడకుండా నెట్టివేయబడిన, ఎవరూ పట్టించుకోని పేదరికం, దారిద్య్రం వుంది. నిరుద్యోగం, ఆకలి కేకల గురించి మోడీ ఏనాడూ పెదవి విప్పడు. ‘దేశ జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం ఒక్క శాతం మంది చేతిలో వుండిపోయిందని’ వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది.
సెలబ్రిటీలకైనా, సామాన్యుడికైనా పెళ్లి జీవితంలో ఒక మధుర ఘట్టమే. బడాబాబుల పెళ్లిళ్లను చూసి, లేని ఆడంబరాలకు పోకుండా వున్నంతలో ఆనందంగా చేసుకునే పెళ్లి వేడుక జీవితంలో నిజంగానే మధురంగా, జీవితాంతం నెమరువేసుకునే అద్భుతమైన జ్ఞాపకంగా వుంటుంది. ‘వికసిత్ భారత్’లో పెళ్లిలో గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించిన దళితుడిని కొట్టిన సంగతి ఎవరికీ తెలియకుండా దాచిపెడతారు. ఇవి ఏ టీవీలోను, బిల్‌బోర్డులలోనూ కనబడవు. మిగతా 99శాతం మంది ప్రజల గొంతును నొక్కడం ఎల్లకాలం సాధ్యం కాదు. జీవితంలో జరిగే ఏ వేడుకైనా ఒక మధుర ఘట్టంగా, ఓ జ్ఞాపకంగా మిగలాలి. అందుకు భారీగా ఖర్చు చేయనవసరంలేదు. తమ శక్తికొద్దీ వెచ్చించి, మనస్ఫూర్తిగా పెళ్లి ప్రక్రియ సాగిస్తే చాలు.
