2024 Results: మళ్లీ ఎజెండాలోకి ఆర్థిక న్యాయం

Jun 9,2024 05:20 #Articles, #edit page

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయని నమ్మిన వారిని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ప్రధాన ప్రసార ముద్రణా మాద్యమాలు మోడీ రాయమన్నట్టల్లా తూచా తప్పకుండా రాశాయి మరి. చాలామంది పండితులు, ఎంతో ఆత్మవిశ్వాసంతో తాము ప్రకటించిన తప్పుడు భవిష్యవాణిని, వాస్తవ ఫలితాలతో లంకె చేసుకుని, సమర్ధించుకునే పనిలో పడ్డారు. ‘ఇండియా’ వేదిక సామాజిక న్యాయంపై మరింత ఎక్కువ ధ్యాస పెట్టి, కుల జన గణన చేస్తానని అన్నందువలన, మిత్ర పక్షంలోకి అన్ని రకాల పార్టీలను కలుపుకున్నందువలన, సభ్యుల ఎన్నిక కులాధారంగా జరపడంలో మరింత నిక్కచ్చిగా వ్యవహరించినందువలన లాభపడిందనే సమర్ధన అందులో ప్రధానమైనది.

స్పష్టమైన సందేశం
సామాజిక న్యాయం అమలు కాదన్న భయం, రాజ్యాంగం మనుగడపై భయాందోళనలు ఏర్పడడం వంటివి ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవమే. రాష్ట్రాలలో స్థానిక సమస్యలు కూడా సముచిత పాత్ర పోషించి ఉంటాయి. కానీ, రాబోయే కాలంలో ఏ కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకున్నా ఓటర్లిచ్చిన సందేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి: ఆర్థిక సమస్యల ప్రాధాన్యత-నిరుద్యోగ సంక్షోభం, నిరంతరంగా కొన సాగుతున్న అత్యల్ప వేతనాలు, స్వయం ఉపాధి కల్పించు కుంటున్నా, ఆ ఆదాయాలతో జీవితాలు దుర్భరంగా కొనసాగుతుండడం. వీటికి తోడుగా నిరంతరంగా పెరుగుతున్న ధరలు-మోడీ ప్రభుత్వం వీటిని వేటినీ పట్టించుకున్న పాపాన పోలేదు. విధానపరమైన చర్యలు తీసుకునేటప్పుడు గాని, ఎన్నికల ప్రచారాలలో గాని ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ, ఈ కూడు గూడు సమస్యలే దేశంలో అత్యధిక ప్రజల జీవిత నిర్ణయాత్మక సమస్యలుగా ఇప్పటికీ మిగిలి ఉన్నాయి.
దీని ఫలితంగానే, వీటిని అందిస్తామని వాగ్దానం చేసిన ప్రతిపక్షం, ప్రధానంగా కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో జరిగిన ఎన్నికలలో ముందంజ వేశాయి. మోడీ పాలన లాగా కాకుండా లేదా వారి అనుయాయుల ప్రచార వాగాడంబరపు ఉపన్యాసాలకు భిన్నంగా ప్రతిపక్షాలు నిరుద్యోగ, జీవనభృతి సమస్యలను, సామాజిక న్యాయంతో పాటుగా చర్చించాయి. ఓటర్లను ఈ వాగ్దానాలు ఆకట్టుకున్న మాట నిజం.

మౌలిక మార్పు
కాంగ్రెస్‌ మేనిఫెస్టో యువకులకు, మహిళలకు, కార్మికులకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉదాహరణకు, ఇవన్నీ సాధించడానికి ఆర్థిక విధానాల్లో పెద్ద మార్పు తేవలసి ఉంటుంది. నిజం చెప్పాలంటే మౌలికమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. అత్యున్నత నాయకుడు లేదా రాజ్యం, ప్రజలకు సేవలందించడం, అవసరాలకు తగిన వస్తువులను ‘బహుమతులుగా’ సమకూర్చడం సరిపోదు.
ఈ వాగ్దానాలను అమలు చేయాలంటే విధానపరమైన మౌలిక మార్పులు చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా, పని హక్కును కల్పించాలి (అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మరింత సౌలభ్యంగా మలచాలి. దానికి నిధుల కేటాయింపులు మరింత పెంచాలి. అంతేకాక, పట్టణాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి.). ఇప్పటికీ ఆహార హక్కు కనీసం పది కోట్ల మంది పేదలకు కూడా అందుబాటులో లేదు. ఖరీదైన, ఉన్నత ప్రైవేటు విద్య కొందరికే అందుతున్నదిగాని ప్రజలకు విద్య హక్కుగా అందుబాటులో ఉండటం లేదు. విద్యాహక్కు సార్వజనీనం కాలేదు. సామాజిక భద్రతా హక్కు (అంటే ఏదైనా కారణంగా పనిచేయలేని వారికి, వృద్ధులకు, కనీస వేతనంలో సగం ఇవ్వడం) కల్పించాలి. ఆరోగ్య భద్రతా హక్కును కూడా ప్రజారోగ్యం ద్వారా సమకూర్చాల్సి ఉంటుంది.
రెండో ప్రధానమైన అంశం, కోట్లాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం. నిరాశా నిస్పృహలకు గురైన యువకుల ఆశలు నెరవేర్చడం. అదే ప్రధానమైన ఆర్థిక విధానపర లక్ష్యంగా ఉండాలి. ఈ లక్ష్యం సాధించాలంటే, ప్రభుత్వో ద్యోగాలు పెరగాలి. స్కీమ్‌ వర్కర్లతో సహా అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. క్రమబద్దీకరించాలి. దశాబ్దాల తరబడి ప్రభుత్వ విధానాల లోపం ఫలితంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ప్రాణం పోయాలి. వారందరికీ రుణ పరపతి కల్పించాలి. కొత్త యంత్రాలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించాలి. శిక్షణ అవకాశాలు కల్పించాలి. వారి ఉత్పత్తుల అమ్మకాలకు వసతులు కల్పించాలి. ఇప్పటికీ వ్యవసాయం సంక్షోభంలోనే ఉంది. రైతుల న్యాయమైన డిమాండ్లను పార్లమెంటులో ప్రత్యేక సెషన్‌లో సమగ్రంగా చర్చించి పరిష్కరించాలి. దేశంలో పర్యావరణం మార్పులకు లోనవుతుండడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చర్చించాలి. అత్యది óక ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘కొత్త సంస్కరణల’ గురించి గొప్పగా ప్రచారం జరిగింది. కానీ నిజానికి అదంతా ”సంస్కరణలకు కొత్త అందాలు అద్దడం” మాత్రమే. అంతర్గతంగా పెద్ద మార్పులు చేసిందేమీ లేదు. దేశంలోని పేదరికాన్ని, అత్యంత హీనమైన మానవాభివృద్ధి సూచికలను దృష్టిలో పెట్టుకుంటే, కేంద్రంగాని, రాష్ట్రాలుగాని ఈ మాత్రం సంస్కరణలు అమలు చేయక తప్పని పరిస్థితి. కానీ మోడీ ప్రభుత్వం ఇవన్నీ తమ హయాంలో మాత్రమే అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంది. ప్రచారం చేసుకుంది. నిజానికి వాటిని పౌర హక్కులు నిర్వర్తించే పథకాలుగా చెప్పుకుని ఉండవలసింది. ఉదాహరణకు, ఉచిత రేషన్‌ అందించడం ద్వారా దేశంలోని 80 కోట్ల పేదలకు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత కల్పించడం. ఇంతకీ ఇదేంటంటే గత యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఆహార భద్రత చట్టం కొనసాగింపే. ఈ పథకం కింద కిలో గోధుమలు 2 రూపాయలకి, కిలో బియ్యం 3 రూపాయలకి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించేవారు. ప్రభుత్వం వీటికి అత్యధిక సబ్సిడీ ఇచ్చేది. అందువలన ఇవేమీ కొత్త పథకాలు కావు. మనకిప్పుడు కావలసింది, ప్రజలకి అందించవలసిన హక్కులను ”బహుమతులుగా” ఇచ్చే విధానానికి స్వస్తి పలకడం.

సమాఖ్య స్వరూపాన్ని పునరుద్ధరించాలి
ఈ ఎన్నికల తరువాత…ప్రజాతంత్ర విధానానికి వ్యతిరేకంగా గత పదేళ్లుగా జరుగుతున్న అధికార కేంద్రీకరణ మారి మరింత నిజమైన సమాఖ్య స్వరూపం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజా సేవలు అందించడంలో రాష్ట్రాలదే ప్రధాన పాత్ర. రాష్ట్రాలు ఈ సేవలను కేంద్రం జోక్యం, పక్షపాతం, నియంత్రణ లేకుండా అందించే పరిస్థితిలో వుండాలి.

వ్యాసకర్త – జయతీ ఘోష్‌… మసాచుసెట్స్‌ ఆమెర్స్‌ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆమె న్యూ ఢిల్లీ లోని జవహర్‌ లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయంలో 35 ఏళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. /

(‘ది హిందూ’ సౌజన్యంతో)

➡️