సెల్‌ఫోన్‌లో బందీ అవుతున్న బాల్యం

అనంతపురంలో నాలుగు సంవత్సరాల పిల్లవాడు సరిగా మాట్లాడలేకపోవడం, వింతగా ప్రవర్తిస్తుండడంతో తల్లిదండ్రులు ఆ పిల్లాడిని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లారు. మీ వాడు ఎన్ని గంటలు సెల్‌ ఫోన్‌ చూస్తాడని డాక్టర్‌ అడగడంతో వారు బిక్కమొహం వేశారు. ఆ చిన్నారి సగటున రోజుకు కనీసం మూడున్నర గంటలు సెల్‌ చూస్తున్నాడని డాక్టర్‌ నిర్ధారించుకున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఆ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. తమ పనికి అడ్డు రాకుండా, గోల చేయకుండా వుండాలంటే సెల్‌ ఇవ్వడంతో ప్రారంభించి, చివరకు సెల్‌ లేకుంటే వుండలేని స్థితికి చేర్చారు. దీనివల్ల మాటలు, పరిసరాల పరిశీలన, తిండి, విశ్రాంతి అన్నింటికీ దూరమయ్యాడు. ఇది ఆ ఒక్క పిల్లాడి సమస్య కాదు. దేశంలో కోట్లమంది పిల్లల సమస్య. తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళన పరుస్తున్న ఆధునిక సమస్య.

బాల్యాన్ని చిదిమేస్తున్న ‘సెల్‌’

చిన్నపిల్లల్లో సెల్‌పోన్‌ వాడకంపై ‘లోకల్‌ సర్కిల్‌’ అనే సంస్థ గత సంవత్సరం దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46 వేల మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. తమ పిల్లలు ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం, ఓటిటి సినిమాలు చూడటం లాంటి వాటితో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపింది. దేశంలో 47 శాతం తల్లిదండ్రులు తమ బిడ్డలకు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం ఉందని, పాఠశాలకు వస్తున్న పిల్లల్లో 67 శాతం మంది పిల్లలు పరధాన్యంగా వుంటున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆరు నెలల నుండి నాలుగు సంవత్సరాల లోపు వయసు చిన్నారుల్లో 73.34 శాతం మంది సెల్‌ఫోన్‌ చూస్తున్నారు. ఇందులో 19 శాతం మంది పిల్లలు మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారట! సెల్‌ ఫోన్‌ వాడకం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల్లో 89 శాతం మంది తమ పిల్లలకు సెల్‌ అలవాటు చేసింది తామేనని బాధపడుతున్నారు. అమెరికాలోని ‘శాండియాగో స్టేట్‌ యూనివర్శిటీ’ సైకాలజీ ప్రొఫెసర్‌ జీన్‌త్వెంగె 8 నుండి 13 సంవత్సరాల లోపు పిల్లల్లో సెల్‌ఫోన్‌ వాడకంపై చేసిన అధ్యయన నివేదిక విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. మొబైల్‌ వాడుతున్న యుక్తవయసు పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నారని, తమను తాము గాయపరచుకోవడం, దూకుడుగా, అసహనంగా, వికృతంగా ప్రవర్తించడం, ఆత్మహత్యలు చేసుకోవడం 2020-23 మధ్య పెద్ద సంఖ్యలో పెరిగిందని ప్రకటించింది. ‘అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రిసెర్చ్‌’ అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థుల్లో రోజుకు 2,617 సార్లు తమ సెల్‌ఫోన్లను క్లిక్‌ చేస్తున్నారని తెలిపింది. ఒకసారి సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వాడడం మొదలెట్టిన వారిలో 85 శాతం మంది వాటి వాడకాన్ని మానేయడం కష్టమని తెలిపారు. 33 శాతం మంది యువత భౌతికంగా స్నేహితులను కలవడం కంటే సెల్‌ ద్వారా మాట్లాడు కుంటున్నారు. సెల్‌ వాడుతున్న వారిలో 67 శాతం మంది ఆలస్యంగా నిద్ర పోవడం లేదా నిద్ర లేమితో బాధపడుతున్నారు. దేశంలో 19 సంవత్సరాల లోపు వారిలో అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య వేగంగా పెరిగిపోతున్నది. దీనివల్ల బాలనేరాలు పెరుగుతున్నాయి.

దివాళాలో బిఎస్‌ఎన్‌ఎల్‌-లాభాల్లో ప్రైవేట్‌ కంపెనీలు

దేశంలో దశాబ్దన్నర కాలంలో పెద్ద సంఖ్యలో విజృంభించిన అతి పెద్ద వ్యాపారం మొబైల్‌ సర్వీసే. 2015లో భారతదేశ జిడిపిలో టెలికాం రంగం వాటా 6.5 శాతం వుండగా, 2023 నాటికి 14.5 లక్షల కోట్ల వ్యాపారంగా మారింది. ఇందులో ప్రభుత్వ బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ నష్టాల్లో కూరుకుపోతుంటే ప్రైవేట్‌ కంపెనీలు కోట్లకు పడగలెత్తాయి. రిలయన్స్‌ జియో కంపెనీ 2018-19లో రూ.48,660 కోట్ల వ్యాపారం చేస్తే 2019-20లో రూ.68,462 కోట్లకు, ఇదే కాలంలో ఎయిర్‌టెల్‌ రూ.80,780 కోట్ల నుండి రూ.87,539 కోట్లకు, ‘వి’ కంపెనీ 37,823 కోట్ల నుండి 45,996 కోట్లకు వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. రిలయన్స్‌ జియో 40 శాతం, ‘వి’ 21 శాతంగా పెరిగితే, అనేక కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ మాత్రం రూ.19,308 కోట్ల నుండి రూ.18,906 కోట్లకు దిగజారింది. నష్టాలు వస్తున్నాయనే సాకుతో 2019లో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన 93 వేల మంది ఉద్యోగులను ‘స్వచ్ఛంద’ పదవీ విరమణ పేరుతో ఇంటికి పంపారు. ఇది చాలదని ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 19 వేల మంది ఉద్యోగులను బలవంతాన బయటకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. అంపశయ్యపై వున్న భీష్ముని లాగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ పరిస్థితి వుంటే అమృతం తాగిన సురుల వలే ప్రైవేట్‌ కంపెనీలు వెలుగుతున్నాయి.

సెల్‌ఫోన్లను నియంత్రిస్తున్న దేశాలు

సెల్‌ఫోన్‌ వినియోగం చిన్నారుల జీవితాలను నాశనం చేస్తోంది. పొరపాటున పెద్దలు ‘చందమామ రావే’ అంటే సెల్‌ ఇవ్వవే అని పిల్లలు అంటున్నారు. అమ్మమ్మ, నానమ్మ కథలు వినేవారిని వెతుక్కోవలసి వస్తున్నది. ముక్కుపచ్చలారని పిల్లలు సెల్‌ ఇవ్వకపోతే తిండి తినే పరిస్థితి లేని దౌర్భాగ్యం అలుముకుంది. సెల్‌ చేతిలో వుంటే ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో కూడా తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో బాల్యం బందీ అయిపోయింది. అభం, శుభం తెలియని వయసులో ప్రేమలు, వ్యసనాలు పెరిగిపోవడానికి సెల్‌లు కారణమం అవుతున్నాయి. చిన్న వయసులో కంటి చూపు, వెన్నెముక, మెడనొప్పులు పెరిగిపోతున్నాయి. భావితరాలకు వస్తున్న సెల్‌ ప్రమాదాన్ని ప్రపంచంలో చాలా దేశాలు గుర్తించాయి. నివారణా చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలోకి సెల్‌ ఫోన్‌ రావడానికి కారణమైన అస్ట్రేలియా 2020 నుండి అన్ని పాఠశాలల్లో సెల్‌ ఫోన్‌ను నిషేధించింది. 18 సంవత్సరాల లోపు వున్న పిల్లలు సెల్‌ వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఇటీవల ఆ దేశ పార్లమెంట్‌ చట్టం చేసింది. జులై 2024 నుండి ప్రాథమిక, సెకండరీ విద్యార్థులు సెల్‌ వాడడాన్ని బెల్జియం నిషేధించింది. కెనడా 2024 నుండి పాఠశాలలతో పాటు, జూనియర్‌ కాలేజీలలో సెల్‌ఫోన్ల అనుమతి రద్దు చేసింది. చైనా 2021 నుండి పిల్లలు సెల్‌ వాడాలంటే తల్లిదండ్రులు సమ్మతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సిందేనని చట్టం చేసింది. ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌, బ్రిటన్‌, అమెరికా, ఇటలీ, డెన్మార్క్‌ ఇలా 19 దేశాలు చిన్న పిల్లలు సెల్‌ఫోన్‌ వాడకాన్ని నిషేధించాయి.

కానీ స్వయం ప్రకటిత మన విశ్వగురువుకు మాత్రం సెల్‌ ప్రమాదం నుండి పిల్లల జీవితాలను కాపాడడానికి తీరిక లేదు. పైగా ఆ సెల్‌ నెట్‌వర్కులనే మతోన్మాద భావజాల వ్యాప్తికి, మూఢనమ్మకాల విస్తృతికి, ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయడానికి వినియోగిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, విజ్ఞాన వికాసం, బంగారు భవిష్యత్తును కాపాడుకునేందుకు అనేకమంది తెలుగు నేలపై బాలోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ‘మీదే మీదే సమస్తం’ అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుస్తున్నారు. సెల్‌ఫోన్ల నుండి పిల్లలను విముక్తి కల్గించాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూనే, ఇలాంటి బాలోత్సవాలను ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం.

-అన్విత్‌

➡️