ఘోర వైఫల్యం

అంధ విశ్వాసాలపై అలుపెరగని పోరాటం చేసిన సుప్రసిద్ధ హేతువాది డాక్టర్‌ నరేంద్ర దబోల్కర్‌ హత్య కేసులో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఆ అంధ విశ్వాసాలతోనే అందలాలెక్కుతున్న నేతల ఒత్తిళ్లే ఈ కేసులో అసలు సూత్రధారులను తప్పించాయి. దబోల్కర్‌ను కాల్చి చంపిన సనాతన సంస్థకు చెందిన ఇద్దరికీ పుణె ప్రత్యేక కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. తొలుత మహారాష్ట్ర పోలీసులు, ఆ తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) పదేళ్లకుపైగా సాగదీసి ఆధారాలు సేకరించని అసమర్థత వల్లే ప్రధాన నిందితుడు వీరేంద్ర తవాడేతోపాటు సంజీవ్‌ పునలేకర్‌, విక్రమ్‌ భవే విడుదలయ్యారు. ఈ ముగ్గురి పాత్ర లేకపోవడం వల్ల విడుదల చేయడం లేదని, వారిపై అభియోగాలను నిరూపించడంలో మహారాష్ట్ర పోలీసులు, సిబిఐ వైఫల్యం వల్లే నిర్దోషులుగా విడుదల చేస్తున్నామని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల లోపాలను కళ్లకు కడుతున్నాయి.
రాజ్యాంగంలో నిర్దేశించినట్లు శాస్త్రీయ, హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం ప్రాధాన్యతను చాటిచెప్పి, ప్రజల్లో ఐక్యత సాధించేందుకు డాక్టర్‌ దబోల్కర్‌ విశేష కృషి చేశారు. 2005 మహారాష్ట్ర మూఢ నమ్మకాల నిరోధక బిల్లు రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మూఢ నమ్మకాలపై డ్రాఫ్ట్‌ తయారు చేసి ఇచ్చినా అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని పాలక పక్షాలను నిలదీశారు. తాను రూపొందించిన బిల్లుపై చర్చించి ఆమోదించాలని ఒత్తిడి చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అనేక సమావేశాలు నిర్వహించారు. తమకు అభ్యంతరాలున్నాయంటూ బిజెపి, శివసేనతోపాటు పలు మితవాద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మూఢనమ్మకాలపై పోరాడుతున్న తనను హత్య చేసేందుకు మితవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన స్వయంగా చెప్పినా రక్షణ కల్పించడంలో అప్పటి రాష్ట్రప్రభుత్వ విఫలమైంది. సైద్ధాంతిక విరోదులను హత్య చేయడానికి ప్రణాళికలు రూపొందించిన సనాతన సంస్థ సభ్యులిద్దరు 2013 ఆగస్టులో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఆయనను దారుణంగా కాల్చి చంపారు. దబోల్కర్‌ హత్య జరిగిన మరునాడే ఆయన రూపొందించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్‌, అసెంబ్లీ ఆమోదం తెలిపాయి. ఇది రాష్ట్రపతి ఆమోదం పొందడం, చట్టం రూపం దాల్చడం ఇప్పటివరకూ జరగకపోవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటక దర్యాప్తు సంస్థలందించిన వివరాల ప్రకారం దబోల్కర్‌ హత్యతోపాటు మహారాష్ట్రలోని కౌల్హాపూర్‌లో 2015లో వామపక్ష నేత గోవింద్‌ పన్సారే హత్య కేసులోనూ గోవాకు చెందిన సనాతన సంస్థ, దాని సోదర సంస్థ హిందూ జనజాగృతి పాత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. 2015 ఆగస్టులో ప్రముఖ కన్నడ కవి, విద్యావేత్త డాక్టర్‌ ఎంఎం కల్బుర్గిని ధార్వాడ్‌లోనూ, కర్ణాటకకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను బెంగళూరులో 2017 సెప్టెంబర్‌లోనూ హత్య చేయడానికి ఉపయోగించిన తుపాకీ ఒక్కటేనని దర్యాప్తు సంస్థల పరిశోధనల్లో తేలింది. సనాతన సంస్థకు చెందిన ముఠానే ఈ దారుణాలకు పాల్ప డిందని తొలుత నిర్ధారించింది కర్ణాటక పోలీసులే కావడం గమనార్హం. సనాతన సంస్థకు చెందిన ఐదుగురిని ప్రధాన కుట్రదారులుగా పేర్కొన్న సిబిఐ.. ఈ కుట్ర మూలాల్లోకి వెళ్లడంలో, కీలక పాత్రదారులను గుర్తించడంలో వైఫల్యం మూటగట్టుకుంది. హేతువాదులు, ప్రజా చైతన్యం కోసం కృషి చేసేవారు, రచయితలు, జర్నలిస్టులు… ఇలా ఒక జాబితా తయారు చేసుకుని దారుణంగా హత్యలు చేసిన ఈ ముఠా ఆటకట్టించకపోవడం క్షమార్హం కాదు. 2013 తరువాత రాజకీయంగా వచ్చిన మార్పులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఈ కేసుపై ప్రభావం చూపాయి. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేయడంతోపాటు నిందితులందరికీ శిక్ష పడేలా చేయాలి. మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి విజ్ఞానాన్ని, ఆలోచనలను పెంచడంతోపాటు అందుకు అవసరమైన చట్టాలు చేయాలని పోరాడిన దబోల్కర్‌ ఆశయాల సాధనకు చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. దబోల్కర్‌ హత్య కేసుతోపాటు గోవింద్‌ పన్సారే, డాక్టర్‌ కల్బుర్గి, గౌరీ లంకేష్‌ హత్యల వెనుకవున్న కుట్రలను బయటపెట్టి, భాగస్వాములందరినీ, ముఖ్యంగా హత్యల వెనుక ఉన్న సైద్ధాంతిక సూత్రధారులను శిక్షించినప్పుడే ఈ కేసులో న్యాయం జరుగుతుంది.

➡️