మంచి పరిణామం

Jul 10,2024 05:59 #Articles, #edit page

నాలుగు రోజుల వ్యవధిలో వెలువడిన రెండు కీలకమైన ఎన్నికల ఫలితాలు నయా ఉదారవాద, నియో ఫాసిస్టుశక్తులను ఓడించడం సాధ్యమేనని నిరూపించాయి. ఫ్రాన్స్‌లో ఎదురు లేదనుకున్న మెరీన్‌ లీపెన్‌ నేతృత్వంలోని ఫాసిస్టు నేషనల్‌ ర్యాలీ పార్టీ, దాని మిత్రులను ఓడించి అతిపెద్ద కూటమిగా లెఫ్ట్‌ పార్టీ సంచలన విజయం సాధించడం, బ్రిటన్‌లో టోరీల పద్నాలుగేళ్ల ముదనష్టపు పాలనకు అక్కడి ప్రజలు చరమగీతం పాడడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ రెండు తీర్పులు ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకార, నయా ఉదారవాద విధానాలపై పోరాడుతున్న శక్తులకు ప్రేరణనిచ్చేవే. ఫ్రాన్స్‌లో వామపక్ష, ప్రగతిశీల శక్తులతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ సాధించిన విజయం ఎంతైనా కొనియాడదగినది.
రెండున్నర శతాబ్దాల క్రితమే ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ నినాదాన్ని ప్రపంచానికి అందించిన ఫ్రెంచి విప్లవ వారసత్వాన్ని, నాటి హిట్లర్‌ ఫాసిజాన్ని తిప్పికొట్టిన నాటి పాపులర్‌ ఫ్రంట్‌ తరహాలో ఏర్పాటైన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ మూడు వారాల్లోనే సంచలనం సృష్టించింది. మొదటి రౌండ్‌లో మూడింట రెండొంతుల ఓట్లతో మొదటి స్థానంలో ఉన్న లీపెన్‌ పార్టీ (నేషనల్‌ ర్యాలీ) నేతృత్వంలోని ఫాసిస్టు కూటమిని రెండో రౌండ్‌ తరువాత మూడవ స్థానంలోకి నెట్టేసి, అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం చిన్న విషయమేమీ కాదు. నెల రోజుల క్రితం జరిగిన యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లతో అతి పెద్ద ప్రాంతీయ శక్తిగా అవతరించడంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. జూన్‌ 30న ‘సింగిల్‌ కానిస్టిట్యుయెన్సీ డైరక్ట్‌ ఎలక్షన్‌’ పద్ధతిలో జరిగిన మొదటి రౌండ్‌ ఎన్నికల్లో 76 మంది అభ్యర్థులు గెలవగా, జులై 7న రెండో రౌండ్‌లో 501 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 577 స్థానాలున్న ఫ్రాన్స్‌ పార్లమెంటులో సాధారణ మెజార్టీకి అవసరమైన 289 స్థానాలు ఏ కూటమికీ లభించకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఫ్రెంచ్‌ రాజ్యాంగం ప్రకారం ఏకైక అతిపెద్ద కూటమిగా ఉన్న న్యూ పాపులర్‌ ఫ్రంట్‌నే ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు మొదట ఆహ్వానించాలి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, గ్రీన్‌పార్టీ, ఫ్రాన్స్‌ అన్‌బౌడ్‌ పార్టీలతో కూడిన న్యూపాపులర్‌ ఫ్రంట్‌ దేశానికి ఫాసిస్టుల నుంచి ఎదురవుతున్న ముప్పును గుర్తించి సరైన సమయంలో సరైన వ్యూహం, రాజకీయ ఎత్తుగడలతో లీపెన్‌ పార్టీని అధికారానికి ఆమడ దూరంలో ఉంచింది. అలా అని లీపెన్‌ పార్టీ ప్రమాదం తొలగిపోలేదు. పార్టీల వారీగా చూస్తే ఓట్లలోను సీట్లలోనూ అతిపెద్ద పార్టీగా నేషనల్‌ ర్యాలీ ఉన్నది.
మొదటి రౌండ్‌లో ఫలితాలను చూశాక ఫాసిస్టు పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానీయకుండా చూడాలన్న దృఢ సంకల్పంతో న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ రాజకీయ ఎత్తుగడల్లో మార్పు చేసింది. ఫాసిస్టు వ్యతిరేక ఓట్లలో చీలికను నివారించాలన్న ఉద్దేశంతో తాను గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న 200 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకుంది. ఇది మాక్రాన్‌ నేతృత్వంలోని రినైజాన్స్‌ కూటమికి కొంత లాభించినా, ఫాసిస్టు శక్తులను ఒంటరిపాటు చేయడానికి ఇది దోహదపడింది. ఈ వాస్తవాన్ని మాక్రాన్‌ పార్టీ గుర్తెరిగి వ్యవహరించాలి. అది అనుసరించిన నయా ఉదారవాద విధానాలే పచ్చి మితవాద శక్తులకు ఇంతగా ఊతమిచ్చాయి. 2019లో వచ్చిన ఎల్లో వెస్ట్‌ ఉద్యమం, రిటైర్మెంట్‌ వయసును 64 ఏళ్లకు పెంచడం, పెన్షన్లలో కోత, విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, జీవన వ్యయం భారం కావడం, నిరుద్యోగం, చివరికి నిరుద్యోగ భృతిని తిరస్కరిస్తూ ఆదేశాలివ్వడం.వంటి చర్యలు మాక్రాన్‌ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను, అసంతృప్తిని రేకెత్తించాయి. తొలి రౌండ్‌ ఫలితాలతో నిరుద్యోగ భృతి తిరస్కరణ ఆదేశాలను పక్కనపెట్టడం లాంటి చర్యలు తీసుకోవడం మాక్రాన్‌ పార్టీ రెండో స్థానంలోకి రావడానికైనా దోహదపడింది. వామపక్షాల నేతృత్వంలో సంకీర్ణం ఏర్పడాలన్న ఫ్రాన్స్‌ ప్రజల అభిమతాన్ని నెరవేర్చాల్సిన బాధ్యతను నెరవేర్చాల్సి ఉంది
బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీతో చేకూరిన విజయం ఆ పార్టీ గొప్పతనం అనే దాని కన్నా టోరీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఈ తీర్పులో ఎక్కువగా ప్రతిబింబించింది. కీర్‌ స్టార్మర్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 14 ఏళ్ల పాలనలో దూకుడుగా అనుసరించిన నయా ఉదారవాద విధానాలతో కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) చరిత్రలోనే అతిఘోర ఓటమిని మూటగట్టుకుంది. 650 స్థానాలున్న సభలో 412 స్థానాలను సాధించినా, లేబర్‌ పార్టీకి వచ్చిన ఓట్లు 33.8 శాతమే. ఐదేళ్ల క్రితం కంటే పెరిగినవి రెండు శాతమే. లేబర్‌ పార్టీలో వామపక్ష భావాలున్న నేత జెరెమీ కార్బిన్‌ నాయకత్వంలో 2017లో సాధించిన 40 శాతం ఓట్లకు కూడా చేరువ కాలేదన్నది చేదు వాస్తవం. ఇజ్రాయిల్‌పై మెతక వైఖరిని వ్యతిరేకిస్తూ కార్బిన్‌తోపాటు లేబర్‌ పార్టీ నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేసిన ఐదుగురు అభ్యుదయవాదులు, సామ్రాజ్యవాద వ్యతిరేకులు గెలుపొందడం సానుకూల అంశం. పచ్చి మితవాది, అల్ట్రా రైట్‌ వింగ్‌ నాయకుడు నిగెల్‌ పరాజ్‌ నేతృత్వంలోని యుకె రిఫార్మ్స్‌ పార్టీ నాలుగు స్థానాలే గెలుచుకున్నా, గత ఎన్నికల్లో 1.7 శాతంగా ఉన్న ఓట్లను ఈ ఎన్నికల్లో 14 శాతానికి పెంచుకోవడం ఆందోళనకరం.
బ్రెగ్జిట్‌, ఆరోగ్యం, విద్యా రంగాల్లో తీవ్ర వైఫల్యం, పార్టీగేట్‌, పోస్టాఫీస్‌ తదితర వరుస కుంభకోణాలతో రెండేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే బ్రిటన్‌ ప్రధాని పీఠం నుంచి బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌ వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత 20 నెలలపాటు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ 121 స్థానాలకే పరిమితమైంది. బడా కార్పొరేట్ల మీద, సంపన్న వర్గాల మీద అదనపు పన్నులు వేస్తామని, శ్రామిక వర్గాలకు సంపద చేరేలా చేస్తామని, దేశాన్ని పునర్నిర్మిస్తామని ఇక్కడి లేబర్‌ పార్టీ, ఫ్రాన్స్‌లోని లెఫ్ట్‌ కూటమి ప్రకటించాయి. స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా నయా ఉదారవాద విధానాలను విడనాడి ప్రజానుకూల విధానాలను అవలంభించాలి. లేకుంటే శ్రమజీవుల నుంచి ప్రతిఘటన తప్పదు.

➡️