మనం గుర్తించని మహా శాస్త్రవేత్త

ఆయన మానవ శరీరంలో విటమిన్‌ బి నిర్వహిస్తున్న అత్యంత కీలకమైన పాత్రను కనుగొన్నాడు. దాన్ని గుర్తించడమే కాదు, వెలికితీసి కృత్రిమంగా తయారు చేయడానికి మార్గం సుగమం చేశాడు. విటమిన్‌ బి ని ప్రజారోగ్యం కోసం ఇప్పటికీ ప్రపంచం ఉపయోగిస్తోంది. ఆయన పరిశోధన విటమిన్‌-12 తయారీకి దారితీసింది. దాన్ని కూడా నేడు ప్రపంచ వ్యాపితంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆయన ఈ రోజు క్యాన్సర్‌ చికిత్సలో ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ల్యుకేమియా చికిత్సలో కీలకమైన మెథోట్రెగ్జేట్‌ ఔషధాన్ని రూపొందించాడు. ఆయన ఉష్ణ మండలాల్లో దోమకాటు వల్ల వచ్చే బోదకాలు వ్యాధిని నయం చేసే మందు డిఇథైల్‌కార్బమజైన్‌ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాపితంగా బోదకాలు వ్యాధి నివారణలో ఇది అమోఘంగా పనిచేసింది. అన్నిటికీ మించి యాంటీబయాటిక్స్‌ తయారీలో ఆయన కృషి నేటికీ ఏనాటికీ ప్రపంచం ఆయనకు రుణపడి ఉంటుంది. విభిన్న రకాల బ్యాక్టీరియా వ్యాధులను నయం చేసే మందుల్లో ఉపయోగించే టెట్రాసైక్లిన్‌ అభివృద్ధిలో కీలక పాత్ర నిర్వహించాడు. ఇంత గొప్ప పరిశోధనలు చేసి మానవాళి ఆరోగ్యానికి మహోపకారం చేసిన ఆ వ్యక్తి డా||యల్లాప్రగడ సుబ్బారావు మన ఆంధ్రుడనీ, భీమవరంలో పుట్టి ప్రాథమిక చదువులు చదివి, మద్రాసులో ఉన్నత విద్యనభ్యసించి, అమెరికా వెళ్లి గొప్ప పరిశోధనలు చేసి ప్రపంచ ప్రజలకు కలకాలం ఉపయోగపడే పరమౌషధాలు తయారీకి తోడ్పడ్డాడనీ చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి యల్లాప్రగడ సుబ్బారావు చేసిన పరిశోధనలు, ఆయన కనుగొన్న ఆవిష్కరణలకన్నా తక్కువ చేసిన వారికి నోబెల్‌ బహుమతులు లభించాయి. ఆయన కన్నా తక్కువ కృషి చేసిన వారికి మన దేశంలో మరణానంతర భారత రత్న బిరుదులు లభించాయి. కానీ సుబ్బారావు పరిశోధనా ఫలితాలు నేటికీ అనుభవిస్తున్న ప్రపంచం గానీ, ఆయన భారతీయుడై పుట్టినందుకు మన దేశం గానీ ఆయనకు తగిన గుర్తింపు నివ్వలేదు. కారణం ఏమై ఉండొచ్చు?
బహుశా యల్లాప్రగడ సుబ్బారావు భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త గనుక వందేళ్ల క్రితం పశ్చిమ దేశాల్లో నెలకొన్ని ఉన్న వివక్ష ఆయనకు నోబెల్‌ బహుమతిని దూరం చేసి ఉండవచ్చు, ఆయన భారత్‌లో పుట్టినా అమెరికాలో పరిశోధనలు చేశారు కాబట్టి మన దేశం ఆయనను విస్మరించి ఉండవచ్చు. కానీ ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ్డంలో చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలకుగాను ఆయన సర్వ మానవాళికీ ప్రాత:స్మరణీయుడుగా నిలిచిపోతాడు.

ఈ రోజు యల్లాప్రగడ సుబ్బారావు 130వ జయంతి. ఆయన భీమవరం పట్టణంలో 1895 జనవరి 12వ తేదీన జన్మించి 1948 ఆగస్టు 8న అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 53వ ఏట కన్నుమూశారు. కేవలం 53 ఏళ్ల లోనే ఆయన అన్ని విజయాలు సాధించారంటే ఇంకా నిండు జీవితం గడిపి ఉంటే ఇంకా ఎన్ని గొప్ప ఆవిష్కరణలు చేసేవాడో కదా!

సుబ్బారావు తండ్రి పేరు జగన్నాథం. చిరు ఉద్యోగిగా రిటైర్‌ అయ్యాడు. దాంతో సుబ్బారావు తల్లి పట్టుబట్టి రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్‌ చదివించింది. ఫెయిలయ్యాడు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో కొడుకు చదువు కోసం పుస్తెలు అమ్మి మద్రాసుకు పంపించింది. మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. మద్రాసు ఇండియన్‌ మెడికల్‌ కాలేజీలో ఎల్‌.ఐ.ఎం చేసి, కార్పొరేషన్‌ ఆయుర్వేద హాస్పటల్‌లో నెలకు అరవై రూపాయల జీతం మీద పని చేశాడు. విదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయాలని వైద్య శాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయాలనే దృఢమైన కాంక్షతో అమెరికా వెళ్లి హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో చేరి పరిశోధనలు చేపట్టాడు. ఆయన భార్య పేరు శేషగిరి. మామ కస్తూరి సూర్యనారాయణ మూర్తి, సుబ్బారావు ఉన్నత చదువులకు ఆర్థికంగా సహకరించారు.
హార్వర్డ్‌లో యల్లాప్రగడ సుబ్బారావు ఆవిష్కరణల పరంపర 1925లో ప్రారంభమైంది. సైరస్‌ ఫిస్కే అనే శాస్త్రవేత్తతో కలిసి ఆయన మానవ శరీరంలోని ద్రవంలో భాస్వరం ఎంత ఉందో కనుగొనే పద్ధతిని కనిపెట్టాడు. దీన్ని అప్పటి నుండి ఫిస్కే-సుబ్బారావు పద్ధతిగా పేర్కొంటున్నారు. తరువాత 1927లో ఫాస్ఫోక్రియాటైన్‌, 1929లో అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఎటిపి)లను ఆయన కనుగొన్నాడు. 1930లో ఆయన హార్వర్డ్‌ నుండి పిహెచ్‌డి పొందాడు. 1940 వరకు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో టీచింగ్‌ ఫెలోగా పనిచేశారు. తరువాత లెడెర్లె లాబరేటరీలో రిసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేరి, 1942లో దాని డైరెక్టర్‌ అయ్యారు.
ఈ కాలంలో ఆయన వైద్య రంగానికి సంబంధించిన నాలుగు అతి ముఖ్యమైన పదార్ధాలను కనుగొన్నాడు. వాటిలో మొదటిది, టెట్రాసైక్లిన్‌ యాంటీ బయోటిక్స్‌లో మొదటిదైన ఆరియోమైసిన్‌. తరువాత 1947లో బోదకాలు నయం చేసే హెట్రాజన్‌ (డైథీలెర్బామాజైన్‌ సిట్రేట్‌) కనుగొన్నాడు. 65 ఏళ్ల తరువాత ఇప్పటికీ ఈ మందును వాడుతున్నారు. తరువాత ఆయన కనుగొన్న మూడోది, విటమిన్‌-బి (ఫోలిక్‌ యాసిడ్‌). తరువాత ఆయన పరిశోధనలు విటమిన్‌-బి కనుగొనే వరకు వచ్చాయి. కానీ వాస్తవంగా ఆయన పరిశోధనలపై ఆధారపడి తరువాత దాన్ని కనుగొన్నారు. నాల్గవది, శరీర కణాల పెరుగుదలను నిలువరించి క్యాన్సర్‌ను నయం చేయగల అమినోప్టెరిన్‌ను ఆయన కనుగొన్నాడు.

యల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న ఈ మందులన్నీ దశాబ్దాలు గడిచిపోయినా నేటికీ ఉపయోగంలో ఉన్నాయంటే ఆయన ఆవిష్కరణల విశిష్టత అర్ధమవుతుంది. ఇవే కాకుండా ఆయన కనుగొన్న విషయాలు చాలా ఉన్నాయి.
మానవాళికి ఉపయోగపడే ఇంత గొప్ప పరిశోధనలు చేసిన సుబ్బారావు అవి ప్రజలకు ఉపయోగ పడాలనుకున్నాడే గాని వాటికి పేటెంట్లు ఆశించలేదు. అలా ఆశించి ఉంటే ఆయన శతకోటీశ్వరుడై ఉండవాడు. అలాగే ఆయన ఎటువంటి గుర్తింపును కూడా ఆశించలేదు. నిజానికి గుర్తింపు కోసం తాపత్రయపడడం ఆయన నైజం కాదు. ”ఈ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప వైద్య ఆలోచనాపరుడు” అని సుబ్బారావు చనిపోయినప్పుడు ఆయన నుద్దేశించి హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ వ్యాఖ్యానించింది.
వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు స్ఫూర్తి మంతమైన కృషినీ, విజయాలనూ నేటి తరం యువతకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-ఎస్‌. వెంకట్రావు

➡️