వ్యవసాయం తరువాత చేనేత రంగం రెండవ ప్రాధాన్యత కల్గిన రంగంగా ప్రసిద్ధి చెందింది. పాలకులు కూడా ఈ అంశాన్ని ప్రచారం చేస్తుంటారు. ఆచరణలో మాత్రం చేనేత రంగం కనుమరుగయ్యే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. మానవునికి నాగరికత నేర్పిన రంగం చేనేత. ఈ రోజు చేనేత కార్మికులు కట్టుకోవటానికి సరైన బట్ట కూడా లేని పరిస్థితికి నెట్టబడ్డారు. చేనేత రక్షణకు సహకార రంగం అవసరమని అనేక ఆందోళనలు జరిగిన నేపథ్యంలో 1964లో సహకార రంగ చట్టం వచ్చింది. ఆ చట్టం ద్వారా చేనేత కార్మికుల షేర్ ధనంతో, సొసైటీలో సభ్యులుగా చేరిన వారితో కమిటీ ఏర్పడి, ఆ కమిటీ నాయకత్వంలో ప్రభుత్వ సహకారంతో సొసైటీలు నడవాలని ఆ చట్టం చెప్తోంది.
అదే కాలంలో సహకార సంఘాలు తయారు చేసిన వస్త్రాలను మార్కెటింగ్ చేయటం కోసం ఆప్కోను ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో ప్రైవేటు సెక్టారులోని మాస్టర్ వీవర్ల దగ్గర తయారైన వస్త్రాలు కొనుగోలు చేయటానికి ఆప్టెక్సు సంస్థను ఏర్పాటు చేశారు. ఆచరణలో చేనేత కార్మికుల నాయకత్వాన సహకార సంఘాలు పని చేసినంతకాలం సహకార రంగం కొంత అభివృద్ధి చెందింది. పట్టణాలలో ఆప్కో షోరూంల ద్వారా చేనేత అమ్మకాలు జరిగి చేనేత కార్మికులకు పని దొరికింది. కానీ పాలక వర్గాలు చేనేతపై దృష్టి పెట్టకపోవటంతో సహకార సంఘాలకు ఇవ్వాల్సిన రిబేటు, చేనేత కార్మికులకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మజూరి పెంచకపోవడంతో చేనేత కార్మికులు ప్రైవేటు సెక్టారులోని మాస్టరు వీవర్ల దగ్గర నేత నేయటానికి మరలారు. దీనికితోడు సహకార రంగంలోకి రాజకీయ నాయకులు ప్రవేశించ సాగారు. దీంతో అధికార పార్టీ వారు ఆ సొసైటీ పాలక వర్గంగా ఎన్నికవుతున్నారు. ఆ పాలకవర్గం, చేనేత జౌళి శాఖ అధికారులు కుమ్మక్కై వస్తున్న నిధులను సహకార సంఘంలో ఉపయోగించకుండా దారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్న ఘటనలు ఎన్నో. సహకార రంగం దివాళా తీసే పరిస్థితికి రావటం, సొసైటీ ప్రెసిడెంట్లు అవినీతితో లక్షల రూపాయలు పోగేసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చేనేత కార్మిక సంఘాలు, చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి సహకార సంఘాలను బలోపేతం చేయాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాల రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంలో ఎన్‌టిఆర్ నష్టాలలో నడుస్తున్న సొసైటీలను లాభాలలో నడుస్తున్న సొసైటీలలో విలీనం చేశారు. ఈ విలీనంతో లాభాల బాటలో నడుస్తున్న సహకార సంఘాలు కూడా దివాళా తీశాయి. దీనికి మరొక కారణం సహకార సంఘాలు నాబార్డు దగ్గర అప్పు తీసుకొచ్చి వస్త్రాలు తయారు చేస్తాయి. ఈ వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేస్తుంది. ఆ వస్త్రాలను 6 శాతం లాభంతో కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన వస్త్రాలకు సంవత్సరాల తరబడి ఆప్కో డబ్బు చెల్లించలేకపోవటంతో సొసైటీలు నాబార్డు దగ్గర తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ మూడు నెలలకు ఒకసారి 13 శాతంతో కలిపి లెక్క కడతారు. ఆ విధంగా సొసైటీలు దివాళా తీస్తున్నాయి. ఇప్పటికి సహకార రంగంలో పని చేస్తున్న సొసైటీలకు పావలా వడ్డి, యారన్ సబ్సిడీ, రిబేటు, త్రిఫ్టు ఫండు కింద 80 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది.
పనిచేస్తున్న సొసైటీలు ఈ డబ్బులేవీ రాక, కార్మికులకు పని చూపించలేక, చేసిన పనికి మజూరి సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. సొసైటీలో ఒక్క మగ్గం కూడా పని చేయకుండా సొసైటీ పేరు మాత్రమే ఉండి, పని చేస్తున్నట్లు రికార్డులు తయారు చేసి, వస్తున్న రాయితీలు మొత్తం సొసైటీ ప్రెసిడెంటు చేనేత జౌళి శాఖ అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ దిగమింగుతున్న పరిస్థితి ఉన్నది.
చేనేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు ఉచితంగా చేనేత వస్త్రాలు ఇవ్వాలని చట్టం చేసింది. దీంతో మన రాష్ట్రంలో చేనేత మగ్గాలపై వస్త్రాలు తయారు చేయిస్తే సంవత్సరం పొడవునా చేనేత కార్మికులకు పని దొరుకుతుందని, చట్ట ప్రకారం మజూరి తగినంత వస్తుందని ఆశించిన చేనేత వర్గానికి పాలకులు వెన్నుపోటు పొడిచారు. చేనేత వస్త్రాలకు బదులు పవర్‌లూం వస్త్రాలు ఇచ్చి చేనేత వస్త్రాలుగా రికార్డులు తయారు చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆప్కో చైర్మన్లు అధికారులతో కుమ్మక్కై దిగిమింగి చేనేత కార్మికులకు తీరని అన్యాయం చేయడం మనం చూస్తున్నాము. ఆప్కో చైర్మన్‌గా ఉన్న వ్యక్తి రూ.1000 కోట్లు దిగమింగారని కేసులు పెట్టడాన్ని మనం చూస్తున్నాము.
మరొకపక్క చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాలు పవర్‌లూంపై తయారవుతుంటే, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్న వైనం చూస్తున్నాము. ఈ రోజు పట్టు చీరల రంగంలోకి కూడా పవర్‌లూంలు ప్రవేశించటంతో ఆ రంగం సంక్షోభంలో పడి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరొకపక్క చేనేతకు అవసరమైన నూలు పట్టు ధర 2021లో రూ.1100 నుంచి 2 వేల రూపాయలకు పెరిగింది. పట్టు ధర రూ.3800 నుంచి 8 వేల రూపాయలకు పెరిగింది. దీనికి తోడు జిఎస్‌టి నూలుపై 5 శాతం, రంగులపై 8 శాతం, రసాయనాలపై 18 శాతం, తయారైన తర్వాత వస్త్రంపై 18 శాతం జిఎస్‌టి వేయటంతో చేనేత రంగం, సొసైటీలు మరింత ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే బోగస్ సొసైటీలను రద్దు చేసి పని చేస్తున్న కార్మికులకు మాత్రమే సహకార సంఘంలో సభ్యత్వం ఇచ్చి వారితో సొసైటీలు ఏర్పాటు చేయాలి. పని చేస్తున్న వారితోనే ఎన్నికలు జరిపి సక్రమంగా పని జరిగేటట్లు సహకార రంగాన్ని పటిష్టపరచాలి.
2021లో కరోనా సమయంలో మాస్కులను రాష్ట్రం మొత్తం సప్లయి చేయటానికి చేనేతవి ఇవ్వాలని చెప్పినా తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వెళ్లి పవర్‌లూం బట్టతో కుట్టించి చేనేతవని కోట్ల రూపాయలు దిగమింగడం చూశాము. అదే కాకుండా గతంలో ప్రభుత్వాలకు తెలియకుండా అధికారులు, ఆప్కో చైర్మన్లు పవర్‌లూంలు కొని కోట్లకు పడగలెత్తారు. జగన్ హయాంలో పవర్‌లూం మగ్గంపై తయారైన బట్టను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆప్కో గోడౌన్లలో పెట్టింది. మీటరుకు 20 రూపాయల అదనపు బిల్లులతో 20 లక్షల మీటర్లు కొనుగోలు చేసి 4 కోట్ల రూపాయలు దిగమింగారు. ఇందులోనూ అధికారులు, పాలక పార్టీల వారు భాగస్వాములే.
ఇకపోతే, చేనేత కార్మికులకు కనీస వేతన చట్టాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కాని మన రాష్ట్రంలో 2009లో సవరించారు. మరల ఇంతవరకు కనీస వేతన చట్టం సవరించకపోవటంలో చేనేత కార్మికులకు వస్తున్న ఆదాయం చాలక అప్పులపాలై ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలౌతున్నారు. చేనేత సహకార రంగాన్ని రక్షించటానికి చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాలు పవర్‌లూమ్‌లపై తయారు కాకుండా చర్యలు తీసుకోవాలి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి.
సహకార రంగాన్ని పటిష్టంగా నడుపుతున్న కేరళ
కేరళలో వామపక్ష ప్రభుత్వం చేనేత రక్షణకు కొన్ని చర్యలు తీసుకున్నది. అక్కడ సహకార సంఘాలదే ప్రధాన పాత్ర. ప్రైవేటు రంగంలో మాస్టర్ వీవర్లు నామమాత్రమే. 1951 నుంచి ఇప్పటి వరకు ఒక్క సహకార సంఘం మూతపడలేదు. 1989లో 15 మందితో కేరళ హ్యాండ్లూమ్ వర్కర్సు వెల్‌ఫేర్ ఫండ్ బోర్డు ఏర్పాటు చేశారు. దీనిలో ఐదుగురు అధికారులు, ఐదుగురు యూనియన్ నాయకులు, కార్మికులు సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయిస్తుంది. కమిటీ లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆధీనంలో పనిచేస్తుంది. 5 కేంద్రాలలో ప్రాంతీయ బోర్డులు ఉన్నాయి. వీటిలో 96 వేల మంది సభ్యులుగా ఉన్నారు. 58 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు నేరుగా వెల్‌ఫేర్ ఫండ్ బోర్డు నుంచి పెన్షన్ అందజేస్తున్నారు. ఆ సభ్యుని కుమార్తె వివాహం ఉంటే 5 వేల రూపాయలు, మహిళా చేనేత కార్మికురాలి ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసూతి అనంతరం మూడు నెలలపాటు నెలకు 2 వేల రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు. డెత్ బెనిఫిట్ కింద రూ.5 వేలు ఇస్తున్నారు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు చిన్నారులకు ఉచితంగా చేనేత వస్త్రాలు ఇస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు నెలకు 500 రూపాయలు, డిగ్రీ చదివే విద్యార్థులకు 800 రూపాయలు ఇస్తున్నారు. మండలంలో ఉండే స్కూలు పిల్లలకు అదే మండల పరిధిలో ఉన్న సహకార సంఘాలే బట్టలు కుట్టించి ఇస్తాయి. ఆ సహకార సంఘాలకు ప్రభుత్వం నేరుగా డబ్బు చెల్లిస్తుంది. సహకార సంఘంలో పనిచేసే చేనేత కార్మికులకు ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్, డి.ఎ సౌకర్యం కల్పించారు. ఈ విధంగా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా కేరళ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకుంటోంది. పైగా సహకార రంగంలో తయారయ్యే వస్త్రాలను పెద్ద పెద్ద షోరూమ్‌లకు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కేరళ మార్గం అనుసరణీయం.
వ్యాసకర్త : పిల్లలమర్రి బాలకృష్ణ,
ఎ.పి చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్ : 9849431258