నిర్లక్ష్యానికి భారీ మూల్యం

May 29,2024 05:32 #editpage

ప్రాణం పోయాల్సిన ఆసుపత్రులు, వినోదాన్ని అందించాల్సిన ప్లేజోన్లు చిన్నారుల ప్రాణాలను బలిగొనడం అత్యంత విషాదకరం. పుట్టే బిడ్డ కోసం కలలు కనని, పుట్టిన బిడ్డ ఎదుగుదలను చూడాలని తపన పడని తల్లిదండ్రులు ఎక్కడా కనిపించరు. వారికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే తల్లడిల్లిపోతాం…అలాంటిది బూడిదకుప్పలా మారారంటే ఆ తల్లుల, తండ్రుల, కుటుంబాల శోకాన్ని తీర్చగలిగే వారెవరు?
అభివృద్ధి నమూనాగా ఊదరగొడుతున్న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తొమ్మిదిమంది చిన్నారులుసహా 28 మంది బూడిద కుప్పగా మారడం, డిఎన్‌ఎ ఆధారంగా వారిని గుర్తించాల్సిన దుస్థితి రావడం ఘోరం. అదే రోజు ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లోని బాలల ఆసుపత్రిలో ఏడుగురు నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు యావత్‌ దేశాన్ని కలచివేశాయి. రాజ్‌కోట్‌లోని టిఆర్‌పి గేమింగ్‌ జోన్‌లోని మొదటి ఫ్లోర్‌ పైకప్పునకు వెల్డింగ్‌ పనులు చేస్తుండగా.. ఆ నిప్పురవ్వలు పెట్రోలు డబ్బాలు లేదా ప్లాస్టిక్‌ లాంటి వస్తువులపై పడి మంటలు చెలరేగినట్లు సిసి టివి కెమెరాల్లో రికార్డయిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనపై సుమోటాగా విచారించిన గుజరాత్‌ హైకోర్టు మున్సిపల్‌ కార్పొరేషన్‌, రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. తగిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ రాష్ట్రప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై ఆగ్రహించింది. ‘మీ పరిధిలో అంత నిర్మాణం వెలిస్తే మీరు కళ్లు మూసుకుని ఉన్నారా? నిద్రపోతున్నారా? గత మూడున్నరేళ్లుగా అక్కడ గేమింగ్‌ జోన్‌ నడుస్తుంటే ఆ విషయం మీకు తెలియదా? అగ్నిమాపక అనుమతుల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారా? అక్కడికి వెళ్లే వారికి ఇచ్చే టికెట్లపై వినోదం పన్ను (మున్సిపాల్టీకి చెల్లించే పన్ను) వసూలు చేస్తారు. అదైనా మీకు తెలుసా?’ అని ప్రశ్నలు కురిపించింది. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ మరో న్యాయవాది చేసిన వాదనను కొట్టిపారేస్తూ ‘ఎవరు కఠిన చర్యలు చేపడతారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం పోయింది. నాలుగేళ్ల క్రితం మేం ఆదేశాలు జారీ చేశాం. వాటి అమలుకు రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజా ఘటనతో కలిపి ఆరు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రాణాలు పోయిన తరువాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారు. దీనినిబట్టి ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నట్టున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లో ఉన్న బేబీకేర్‌ న్యూ బార్న్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడం నవజాత శిశువుల మరణానికి కారణమని చెబుతున్నారు. ఆ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్‌ హోం నమోదు చట్టం కింద నమోదే కాలేదట. దాని యజమాని డాక్టర్‌ నవీన్‌పై క్రిమినల్‌ కేసులు సైతం ఉన్నాయి. 2021లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. ఈ రెండు ఘటనల్లోనూ ప్రమాదాలను నివారించడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటానికి అవసరమైన కనీస సదుపాయాలే మృగ్యమయ్యాయి. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలు, సహాయక చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన సిబ్బంది లేరు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా వీటిని నడపడానికి అనుమతించిన పాలకుల, అధికారుల బాధ్యతా రాహిత్యమే ప్రధాన కారణంగా ఉంటోంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఆక్సిజన్‌ అందక 2017లో 63 మంది బాలలు మరణించిన ఘటన చర్చనీయాంశమైంది. సర్కారు నిర్లక్ష్యంతో పిల్లల ప్రాణాలు పోతుండటాన్ని తట్టుకోలేక, సొంత సొమ్ముతో 250 ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ను అభినందించపోగా, వేధించిన సంగతి కూడా గుర్తించాల్సిన అంశం. 2021లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది చిన్నారులు ఆహుతయ్యారు. 2018 నాటి ఫిక్కి-పింకర్టన్‌ అధ్యయనం ప్రకారం మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అవసరమైన అగ్నిమాపక కేంద్రాలకంటే 40 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. దేశంలోని అగ్నిమాపక మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. అయినా అడుగు ముందుకుపడింది లేదు. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల, ప్రజల ఉసురు తీస్తూనే ఉన్నాయి. నిబంధనలు కఠినంగా అమలు జరిగేలా న్యాయవ్యవస్థ కొరడా ఝుళిపించడంతోపాటు ప్రజల అప్రమత్తత కూడా అవసరం.

➡️