సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేసే సామర్ధ్యమున్న కంపెనీలు టెండరు ప్రక్రియలో పాల్గొంటే, అలాంటి సామర్ధ్యం లేని కంపెనీలు పేర్కొన్న ధరల కన్నా తక్కువ ధరలను పేర్కొనాలి. అదేవిధంగా, వేలాది మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరాకు టెండరులో పాల్గొనే కంపెనీలు అంత భారీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని నెలకొల్పే అవకాశంతో (ఎకానమీ ఆఫ్ స్కేల్) తక్కువ ధరలను పేర్కొనాలి. అదానీ ఎనర్జీ విషయంలో అలా జరగలేదు. ఆనాడు పోటీ బిడ్డింగులలో అలాంటి సదుపాయంలేని కంపెనీలు తక్కువ సామర్ధ్యానికే అదాని రేట్లకన్నా చాలా తక్కువగా రేట్లను పేర్కొనటం వల్ల కొన్ని విషయాలు స్పష్టం అవుతున్నాయి. అదాని చివరకు అంగీకరించిన యూనిట్‌కు రూ.2.42 రేటు చాలా అధికం. సౌర విద్యుత్ ఫలకాలు, తదితర సామాగ్రిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీలు మాత్రమే బిడ్డింగులో పాల్గొనటానికి అర్హులని మోడి ప్రభుత్వం సెకీ బిడ్డింగ్ షరతులలో చేర్పించటం, నిజమైన పోటీ లేకుండా అదాని కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చటానికే. అలాంటి ఉత్పత్తి సామర్ధ్యం ఉందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా, ఎవరు అతి తక్కువ రేటును బిడ్డింగులో పేర్కొంటే, ఆ కంపెనీనే ఎంపిక చేసి, సాపేక్షికంగా తక్కువ ధరలకే సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం ఈ షరతుల తొత్తడంతో లేకుండా పోయింది.
అజూర్ కంపెనీ 4000 మె.వా. విద్యుత్ విక్రయాలతో సుమారు 20 ఏళ్ళలో పన్ను చెల్లింపు తరువాత 2 బిలియన్ డాలర్ల గణనీయమైన లాభాలు లభిస్తాయని అంచనా వేసిందని అమెరికా కోర్టులో గౌతమ్ అదానికి, ఇతరులకు వ్యతిరేకంగా దాఖలైన అభిశంసన అభియోగ పత్రంలో (పేరా 45) పేర్కొన్నారు. సాధారణంగా, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఈక్విటీపై 16 శాతం లాభం లెక్కగట్టేవారు. ఉత్పత్తిదారులకు లాభం ఎంత గణనీయంగా ఎక్కువగా ఉంటే, సౌర విద్యుత్ కొనుగోలుదారులకు చార్జీల భారం అంత అధికంగా ఉంటుంది. అదాని-సెకితో ఎపిడి స్కాముల ఒప్పందంలో జరిగింది ఇదే.
టెండర్లు వేశాక 2019 డిసెంబరు 10న సెకి అదాని గ్రీన్‌కు, అజూర్‌కు లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌ఒఎ) ఇచ్చింది. టెండరులోని రిక్వెస్ట్ ఫర్ సెలెక్షన్ (ఆర్‌ఎఫ్‌ఎస్) నిబంధనల ప్రకారం ఎల్‌ఒఎ జారీ చేసిన 90 రోజులలోగా సెకి ఎంపికైన కంపెనీలతో పిపిఎలు చేసుకోవాలి. అయితే పిపిఎలు చేసుకొనేందుకు 18 నెలలకు పైగా ఆలస్యమైంది. ఎందుకంటే, వివిధ రాష్ట్రాల డిస్కాంలకు సెకీ అదాని, అజూర్‌ల నుండి కొనుగోలు చేయడానికి అంగీకరించిన రేట్లకు పిఎస్‌ఎలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఆ రేట్లు అధికంగా ఉన్నాయని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కాములు అంగీకరించలేదు. ఆ తరువాత అదాని, అజూర్ కంపెనీలు వాటి అధికారుల ద్వారా ‘భారీ ముడుపుల పథకం’ నడిపాక, పిపిఎలు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. మె.వా.కు రూ.25 లక్షల చొప్పున ముడుపులను లెక్కగట్టారని, ఆంధ్రప్రదేశ్ అధికారులకు రూ.1750 కోట్ల మేరకు లంచాలు ఇస్తామని హామీ ఇచ్చారని లేదా చెల్లించారని, ఆ అధికారులలో ముఖ్యమంత్రి ఉన్నారని 2021 ఆగస్టులో అదాని గ్రీన్ రికార్డులలో ఎప్‌బిఐ దర్యాప్తు అధికారులు కనుగొన్నారని అమెరికా కోర్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు. గౌతం అదాని, సాగర్ అదాని ముఖ్యమంత్రిని 2021 ఆగస్టులో, సెప్టెంబరులో వేర్వేరుగా కలిశారని, ప్రోత్సాహకాలతో సెకితో డిస్కాంలు పిఎస్‌ఎ చేసుకొనకపోవటాన్ని చర్చించారని అభియోగ పత్రంలో పేర్కొన్నారు (పేరాలు 29, 33, 34, 51, 53, 54). ఆ తరువాత రాష్ట్ర మంత్రి వర్గం సెకితో 7000 మె.వా. పిఎస్‌ఎ చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. అధిక ధరలకు ఆ సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రోత్సాహకాలు పని చేశాయని అభియోగ పత్రంలో వ్యాఖ్యానించారు.
అదాని సౌర విద్యుత్‌ను రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు సరఫరా చేయడానికే కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతమున్న మూడు డిస్కాములు లేదా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామీణ వ్యవసాయ విద్యుత్ పంపిణీ కంపెనీ, ఈ విద్యుత్‌ను రాష్ట్ర మంతటా సరఫరా చేయాలి. ఆయా ప్రాంతాలలో వ్యవసాయ విద్యుత్ డిమాండు ఆధారంగా అవసరమైన ఉత్పత్తి సామర్ధ్యంతో స్థానికంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పితే అనేక ప్రయోజనాలుంటాయి. వాటి నుండి చుట్టుపక్కల స్థానిక ప్రాంతాలకు విద్యుత్ ప్రసారం, పంపిణీలకు పెట్టుబడుల అవసరాలు, చార్జీలు, ప్రసార, పంపిణీ నష్టాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఏర్పాటు అవసరమైన ఓల్టేజి నిర్వహణకు దోహదం చేస్తుంది. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజస్థాన్‌లోని అదాని ప్రాజెక్టుల నుండి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసే ఏర్పాటుతో రాష్ట్రం, వినియోగదారులు ఈ ప్రయోజనాలను కోల్పోయారు. అంతకు ముందు, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా 6000 మె.వా సౌర విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచింది ఇలాంటి ఏర్పాట్ల అవకాశాలతోనే. టెండర్ల షరతుల మార్పుపై వివాదాలతో, హైకోర్టు తీర్పుతో, తరువాత సెకీతో ఏర్పాటుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరకు ఆ టెండర్లను రద్దు చేసుకుంది. కేంద్ర విద్యుత్ ప్రసార సంస్థ పిజిసిఐఎల్ రాజస్థాన్ నుండి అదాని విద్యుత్‌ను రాష్ట్ర సరిహద్దు వరకు ప్రసారం చేస్తుంది. అక్కడి నుండి ఆ విద్యుత్‌ను వ్యవసాయం నిమిత్తం రాష్ట్రమంతటా సరఫరా చేయాల్సినందున ప్రసార, పంపిణీ నష్టాలు ఎక్కువ అవుతాయి. రాజస్థాన్ నుండి సౌర విద్యుత్ పొందటం వల్ల రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు భూమి కేటాయించాల్సిన అవసరం ఉండదని, దానిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చునని ఆనాడు అదాని-సెకితో ఒప్పందం వ్యవహారంలో ఉన్న అధికారులు వాదించారు. ప్రతి రాష్ట్రం అదే వైఖరి తీసుకుంటే, విద్యుత్ ప్రాజెక్టులు, ఆ మాటకు వస్తే ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమల వంటి వాటి స్థాపనకు, ఉపాధి కల్పనకు, అభివృద్ధికి అవకాశాలు వుండవనేది స్పష్టం. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందనేది స్పష్టం.
వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు ఎం. వేణుగోపాలరావు