ప్రతి కార్యకర్త చదవాల్సిన పుస్తకం

Mar 31,2024 05:30 #editpage

‘రీటా’ ఎమర్జెన్సీలో ‘బృందాకరత్‌’ మారు పేరు. వామపక్ష పార్టీల్లో పనిచేసే వారికి బృందాకరత్‌ గురించి తెలియని వారుండరు. బృందాకరత్‌ కమ్యూనిస్టు జీవితం ఎంతో విలక్షణం. ఉన్నత కుటుంబం నుంచి వచ్చి, ఉన్నత విద్య అభ్యసించారు. ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఎయిర్‌ ఇండియాలో పని చేసే మహిళలు స్కర్ట్‌, షర్ట్‌లు మాత్రమే వేసుకోవాలనే నిబంధనపై పోరాడి చీర కట్టుకోవడానికి ఇష్టమైన వారందరికీ అనుమతించాలనే హక్కు సాధించారు. వియత్నాంపై అమెరికా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పాల్గని లాఠీ దెబ్బలు తిన్నారు. మార్క్సిస్టుగా మారడానికి వియత్నాం యుద్ధమే ప్రేరణ అని రాశారు. బ్రిటన్‌లో ఉన్న కాలంలో మార్క్సిస్టు సాహిత్యం చదవడం మొదలుపెట్టారు. బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల మధ్య వివిధ సిద్ధాంతాలపై చర్చలు సాగాయి. తర్వాత భారతదేశానికి వచ్చి వ్యవసాయ కార్మిక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునీత్‌ చోప్రాతో సహా అనేక మంది భారతీయులు ఆ గ్రూపులో ఉన్నారు. అదే కాలంలో ఆమె స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏకపక్ష నిర్బంధం, వామపక్ష ఉద్యమాల ఉధృతి లాంటి పరిణామాలను ఇంగ్లీషు పత్రిక ద్వారా తెలుసుకునేవారు.
ఉద్యోగం వదిలి లండన్‌ నుంచి వచ్చి కఠోరమైన ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలో ట్రేడ్‌ యూనియన్‌ బాధ్యతలు చేపట్టారు. అదే నిబద్ధతతో నేటికీ పని చేస్తున్నారు. ఆమె యూనివర్సిటీ మేథావుల మధ్య ఎంత స్పష్టంగా మాట్లాడగలరో అత్యంత వెనుకబడిన గిరిజన ప్రజల్లో కూడా అంతే స్పష్టంగా మాట్లాడగల మాస్‌ లీడర్‌. నేను స్వయంగా ఆమె మాట్లాడిన అనేక గిరిజన సభల్లో పాల్గని ఆమె ఉపన్యాసాన్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేశాను. ఆమె ఎమర్జెన్సీలో రహస్యంగా ఢిల్లీలోని కార్మిక రంగంలో పనిచేశారు. ‘రీటా నేర్చిన పాఠం’ (యాన్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ రీటా-ఎ మెమైర్‌ 1975-1985) పేరుతో ఆమె రాసిన ఎమర్జెన్సీలో జ్ఞాపకాలు ప్రతి ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త చదవడం ఎంతో అవసరం. ఆ కాలపు అనుభవాలు నేటి తరం ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలు ఎదుర్కొనే అనేక సమస్యలకు ఆచరణలో పరిష్కారం చూపుతున్నాయి. గత 40 సంవత్సరాల నుండి బృందాతో సన్నిహిత సంబంధాలున్న నాకే ఈ పుస్తకం చదివే వరకు…ఆమెకు ట్రేడ్‌ యూనియన్‌లో ఇటువంటి మంచి అనుభవాలు ఉన్నాయని తెలియదు. ఈ పుస్తకం ద్వారా ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలు, నాయకులు నైపుణ్యంతో ఎలా పనిచేయాలో నేర్చుకోవచ్చు.
ఎమర్జెన్సీ రహస్య కాలంలో బృందా స్వయంగా ఎలా పనిచేశారో వివరించారు. నేడు ఎమర్జెన్సీ లేదు. కానీ టి.యు పనిలో అంతకంటే అధ్వాన్న పరిస్థితులున్నాయి. అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం, యాజమాన్యాలు ఒక్కటై కార్మికవర్గం మీద ముప్పేట దాడి సాగిస్తున్నాయి. ముఖ్యంగా బి.జె.పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మతోన్మాదాన్ని జోడించి కార్మికవర్గంలో తీవ్రంగా చీలికలు తీసుకొస్తున్నాయి. ఎమర్జెన్సీకి ముందు కంపెనీల గేట్లు ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉండేవి. గేట్‌ మీటింగ్‌లు, కరపత్రాలు పంచడం, ధర్నాలు చేయడం, నోటీసులు అంటించడం, పోస్టర్లు వేయడం అన్నింటికి కేంద్రాలు కంపెనీల గేట్లే. ఎమర్జెన్సీలో అన్నీ బంద్‌ అయ్యాయి. ఎమర్జెన్సీ తర్వాత కార్మిక పోరాటాలు మరింత ఉధృత స్థాయిలోకి వెళ్లాయి. కానీ 1991 సరళీకరణ విధానాల ఫలితంగా నేడు పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. గేట్ల దగ్గర గుమిగూడితే సీసీ కెమేరాల్లో వెతికి వేటాడి యాజమాన్యాలు వేధిస్తున్నాయి. ఉద్యోగం నుండి తొలగిస్తున్నాయి. కానీ పోలీసులకు చిక్కకుండా ఎమర్జెన్సీ కాలమంతా పనిచేయడం ‘వీరోచితం’గా అనిపించిందని బృందా తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. నివాస ప్రాంతాల్లో ఎలా పని చేయాలో చక్కని అనుభవాలు ఈ పుస్తకంలో మనకు బృందా అందించారు. జహింగీర్‌పురి ప్రాంతంలో నాడు నివాస ప్రాంతంలో పనిచేసిన అనుభవం నేటికీ ఉపకరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా జహింగీర్‌పురి లోని పేద ముస్లింల నివాసాలను బుల్డోజర్లతో కేంద్ర బి.జె.పి ప్రభుత్వం అక్రమంగా కూల్చడానికి 2022 ఏప్రిల్‌లో సిద్ధపడింది. బృందా సుప్రీంకోర్టు ఆర్డరు చేతిలో పట్టుకుని స్థానికుల సహాయంతో బుల్డోజర్లను అడ్డుకున్నారు. ఇది దేశమంతా వైరల్‌ అయ్యింది. నివాస ప్రాంతాల్లో పనికి ఎంతో ప్రాధాన్యత వుందని ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలు గుర్తించినా వారితో ఎలా కలసి మెలసి ఉండాలో ఆమె అనుభవాలు మనకు ఎంతగానో తోడ్పడతాయి.
కార్మిక నాయకులు పోరాటాలు, సమ్మెల్లో ఎలా కృషి చేయాలనేది ‘బిర్లా మిల్స్‌’లో సమ్మె అనుభవాలు ప్రతి కార్మిక నాయకుడికి బాగా ఉపయోగపడతాయి. కార్మికులను ఐక్యపర్చగలిగితే నిర్బంధంలో కూడా కార్మికుల నోళ్లు మూయించలేరని, సమ్మెలు ఆపలేరనే అనుభవాలు తెలియజేశారు. ఎమర్జెన్సీని అడ్డుపెట్టుకుని బిర్లా యాజమాన్యం కార్మికులపై పనిభారం రెట్టింపు చేసింది. ‘బిర్లా మిల్స్‌’ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ. ఈ మిల్లులోని వీవింగ్‌ సెక్షన్‌లో రెండు మగ్గాలకు బదులు నాలుగు మగ్గాలపై ప్రతి కార్మికుడు పని చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇది అమలు జరిగితే ఆ విభాగంలో సగం మందికి పనిపోతుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే సమస్య వచ్చినప్పుడు కార్మికుల చర్చలను ప్రత్యక్షంగా, ఓపిగ్గా విన్న అనుభవాలను బృందా చక్కగా ఉదహరించారు. యాజమాన్యం పోలీసులను ఆశ్రయించి బలప్రయోగం చేస్తే సమ్మె చేయగలమా? దీర్ఘకాలం సమ్మె చేయాల్సివస్తే సమ్మె సాధ్యమవుతుందా? వీవింగ్‌ సెక్షన్‌ కార్మికుల సమస్యకు మిగిలిన కార్మికుల మద్దతు ఉంటుందా? లాంటి అనేక చర్చల అనంతరం తప్పక సమ్మెలోకి వెళ్లాలని సిఐటియు కార్యకర్తలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. బృందా ఆ రోజు రాత్రి రమేష్‌ అనే కార్మిక నాయకుని చిన్న ఇంట్లోనే బస చేశారు. ఎమర్జెన్సీ అయినందు వల్ల సమ్మె కరపత్రాన్ని ఏ ప్రెస్‌ యాజమాన్యం అచ్చువేయలేదు. ‘సైక్లోస్టైల్‌’ ద్వారా వేయించి రహస్యంగా దారిలో వెదజల్లారు. ఆ కరపత్రాలను కార్మికులు రహస్యంగా జేబులో పెట్టుకుని తర్వాత చదువుకున్నారు. మరుసటి రోజు సమ్మెలో పాల్గన్నారు. ఈ సమ్మెను చూసి ఎంతో ఉత్తేజం పొందానని బృందా వివరించారు. రహస్య కాలంలో కూడా…ఢిల్లీ లోని క్లాత్‌ మిల్స్‌లో తొలగించబడిన కమల్‌ నారాయణ్‌ ద్వారా…చిన్న బుక్‌ షాప్‌ నడిపేవారు. ఈ బుక్‌షాప్‌లో వామపక్ష సాహిత్యం కూడా దొరికేది. సమావేశాలు ఈ బుక్‌షాప్‌ వెనుకనే జరిగేవి. సమావేశాలు జరిగేటప్పుడు షాప్‌ షెట్టర్‌ వేసుకుని మీటింగ్‌లు నడిపేవారు. నేడు యాజమాన్యాల ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇటువంటి మార్గాలు అనుసరించడం ఎంతో అవసరం. కమ్యూనిస్టు కుటుంబాల పేరుతో రాసిన అధ్యాయంలో మన కుటుంబాల్లో ఉండే ఆప్యాయతలు, త్యాగనిరతి మరే పార్టీల్లోగాని, సంఘాల్లో గాని సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ సమ్మెను విరమించేటప్పుడు పి.రామమూర్తి స్వయంగా హాజరై ఉపన్యసించారు. పి.రామమూర్తి సిఐటియు అఖిల భారత ప్రథమ ప్రధాన కార్యదర్శి. వారి గురించి పుస్తకంలో పది పంక్తులు రాశారు. అలాగే బృందా, ప్రకాష్‌ కరత్‌ వివాహమైన కొద్ది కాలానికే కరత్‌ తల్లి చనిపోయారు. వారిని పరామర్శించడానికి ఉదయాన్నే ఇంటికి వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య (పి.ఎస్‌) గురించి కూడా ఈ పుస్తకంలో వివరించారు. పి.ఎస్‌ మరో సందర్భంలో బృందాను పిలిచి ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో పార్టీని నిర్మించడం తన ప్రథమ కర్తవ్యంగా ఉండాలని వివరించారని రాశారు. ఆమెతో ఆ కాలంలో పరిచయమైన మేజర్‌ జయపాల్‌ సింగ్‌ గురించి అద్భుతంగా వర్ణించారు. ఆయన జైలు నుండి తప్పించుకుని వచ్చి ప్రజా ఉద్యమంలో పనిచేశారు. ఆయనే దొరికి ఉంటే బ్రిటీష్‌ వాళ్లు కాల్చేసేవారు. కానీ ఆయన ప్రాణాలకు తెగించి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అవసరమైన చోట్లకు వెళ్లి సైనిక శిక్షణ ఇచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆయన సైనిక శిక్షణ కీలకమైంది. ఇలా బి.టి.రణదివే, విమలా రణదివె, జ్యోతిబసు లాంటి అనేక మంది నాయకుల గురించి సందర్భాన్ని బట్టి వివరించడం ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకత.
కార్మికులు పోరాటాల్లో ఎదుర్కొనే వాదనలకు ఈ పుస్తకంలో సరైన సమాధానాలున్నాయి. ‘కార్మికుల సమస్యలను రాజకీయం చేయకండి’ అనే మాట తరచూ యజమానులు, ప్రభుత్వాలు అంటుంటాయి. ఇంతకన్నా దొంగమాట మరోటి వుండదు. ‘ప్రభుత్వం పెట్టుబాడిదారుల పక్షాన నిలబడటం రాజకీయం కాక మరేమిటి?’ అని బృందా సమాధానం చెప్పారు. బి.యం.ఎస్‌. ప్రతి సమ్మె సందర్భంగా ఇటువంటి తప్పుడు ప్రచారమే చేస్తుంటారు. కార్మిక నాయకులు కార్మికులను రెచ్చగొట్టి సమ్మెలను చేయిస్తున్నారన్నది యజమానుల మరో ప్రచారం. ఇది పూర్తి అవాస్తవం. సమ్మె అనేది కార్మికుల చివరి ఆయుధం. కావాలని కార్మికులు ఎప్పుడూ సమ్మె చేయరు. కష్టాలకు ఓర్చి పోరాటాలు చేసి విజయాలు సాధించాలని, హక్కులు సాధించాలని కార్మికులు సమ్మెలు చేస్తారు. దీర్ఘకాలం సమ్మెలు సాగినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు వారి భార్య, పిల్లలను స్వగ్రామాలకు పంపేవారు. బిర్లా మిల్స్‌ సమ్మెలో తన భార్య పొత్తిళ్లలో ఒక బిడ్డను, పక్కన మరో బిడ్డను పెట్టుకుని కదులుతున్న బస్సు లోంచి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పడాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను అని అక్కడి కార్మిక నాయకుడు పంత్‌ చెప్పిన విషయం బృందా పుస్తకంలో చదువుతుంటే కళ్లు చెమ్మగిల్లుతాయి. యాజమాన్యం చేసే అనేక తప్పుడు వాదనలకు సమాధానాలు ఈ పుస్తకంలో లభిస్తాయి.
మత విద్వేషం అంటువ్యాధిలాగా నేడు వ్యాపిస్తున్నది. మత ఘర్షణలు ప్రమాదాన్ని ఈ పుస్తకం చివరిలో చక్కగా వివరించారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో జరిగిన సిక్కులపై దాడి, 1984లో అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర పేరుతో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారం 1992లో అయోధ్య లోని బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలా దారితీసిందో నేడు ఆ ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి వెళ్లిందని ఉదహరించారు. బి.జె.పి మతోన్మాదాన్ని నివాస ప్రాంతాల్లో పని చేయడం ద్వారానే ఎదుర్కోగలం. మతతత్వాన్ని తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు. మన రాష్ట్రంలోని టి.యు కార్యకర్తలకు ఈ హెచ్చరిక ఎంతో అవసరం. ఈ పుస్తకంలోని ప్రతి పేజీ సిఐటియు కార్యకర్తలకు, నాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.

– సిహెచ్‌. నరసింగరావు

/ రచయిత సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /

➡️