దేశ సాంఘిక సంస్కరణోద్యమంలో ఫూలే దంపతులు అద్భుతమైన పాత్ర పోషించారు. నాటి పరిస్థితుల్లో స్త్రీలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. అయినప్పటికీ సామాజిక రుగ్మతలను పారదోలేందుకు తన వంతు కృషి చేసి నేటికీ ఆదర్శంగా నిలిచారు సావిత్రి బాయి ఫూలే. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో పదమూడేళ్ల జ్యోతి రావు ఫూలేతో (1840) వివాహం జరిగింది. వివాహానంతరం అభ్యుదయ భావాలున్న జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేతో కలసి సాంఘిక సంస్కరణోద్యమంలో నూతన ఒరవడికి తెర లేపారు.
ఈమె వివాహానంతరం ఇంట్లోనే విద్యాభ్యాసం ప్రారంభించారు. 1847లో ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందారు. 1848లో భర్త జ్యోతి రావు ఫూలేతో కలసి పూణేలో అణచివేతకు గురవుతున్న బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఇది మొదట తొమ్మిది మంది బాలికలతో ప్రారంభమైంది. తర్వాత పూణె, సతారా, అహ్మదా నగర్‌లలో మరికొన్ని పాఠశాలలు స్థాపించారు. ఈమె పాఠశాలకు వెళ్లేటప్పుడు సనాతన చాందసవాదుల కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆమెను మార్గ మధ్యలో ఆపి అసభ్యకరమైన పదజాలంతో దూషించి, రాళ్లతో దాడి చేసి, పేడ నీళ్ళు చల్లి అవమానించేవారు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. తన సంచిలో అదనంగా మరో చీర పెట్టుకెళ్లి పాఠశాల దగ్గర మార్చుకునేవారు. వారు మొక్కవోని దీక్షతో ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. చిన్న వయసులో వివాహం చేయటం వలన ప్రసవించే శక్తి లేక అనేకమంది బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని, చిన్న వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు వితంతువులుగా జీవితాన్ని గడపాల్సి వస్తుందనే వాదన దృఢంగా వినిపించారు. వితంతువులను హీనంగా చూస్తూ, గుండు గీయించి తెల్ల చీర కట్టించి, వారిని అశుభ సంకేతంగా చిత్రించేవారు. ఆ దురాచారాన్ని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాల్ని ప్రోత్సహించడమే గాక, దగ్గరుండి చేయించారు. వితంతు గర్భిణీల కోసం 1853లో ఒక గృహాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు దగ్గరుండి చూసేవారు. వితంతు మహిళలకు గుండు గీసే పద్ధతి పోయేందుకు కృషి చేశారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. 1852లో మహిళా హక్కులను మహిళలకు తెలియజేసేందుకు, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ‘మహిళా సేవా మండల్’ ఏర్పాటు చేశారు. కార్మికులు, గ్రామీణ పేదలు కోసం జ్యోతి రావు ఫూలే 52 ఆహార కేంద్రాలను తెరిచారు. వీటన్నింటిని ఆమె చూసుకునేవారు. వారిరువురూ ఏర్పాటు చేసిన బోర్డింగ్ పాఠశాలలను దగ్గరుండి చూసుకునే వారు. 1863లో సంఘ బహిష్కృతులైన తల్లీపిల్లల కోసం శరణాలయం స్థాపించారు. ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సేవ చేసే వారు. జ్యోతి రావు ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్‌ని ఆయన మరణానంతరం ఈమె నడిపారు. ఈ రకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా నిలబడిన ధీర వనిత సావిత్రి బాయి ఫూలే. స్త్రీల అభివృద్ధి కోసం తెగువతో నిలబడిన వీర వనిత. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తను కూడా ఆ వ్యాధి బారినపడి 1897 మార్చి 10న తుది శ్వాశ విడిచారు సావిత్రి బాయి ఫూలే. ఆమె నాడు నేడు ఆదర్శప్రాయమే. ఆమె లక్ష్య సాధనకు కృషి చేద్దాం.
– డా|| ప్రియాంక గంగరాపు,
ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యాపకులు.